సూక్ష్మపోషకాల లోపాలపై అవగాహన
పెలైట్ ప్రాజెక్ట్ కింద నాలుగు మండలాలు ఎంపిక
ప్రారంభం కానున్న భూసార నమూనాల సేకరణ
సత్ఫలితాల సాధనపై వ్యవసాయశాఖ దృష్టి
గజ్వేల్, న్యూస్‌లైన్: భూముల్లో సూక్ష్మపోషకాలు లోపించి దిగుబడులు గణనీయంగా పడిపోతున్న వేళ.. ఇక్రిశాట్, వ్యవసాయశాఖ నడుం బిగించాయి. ముందుగా భూసార పరీక్షలు నిర్వహించడంతోపాటు, అందుకు తగ్గట్టు పోషకాలను అందించే కార్యాచరణ సిద్ధం చేస్తున్నాయి. ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టేందుకు మొదట జిల్లాలోని నాలుగు మండలాలను పెలైట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేశారు. పంటల
సాగులో 16 రకాల సూక్ష్మపోషకాలు ప్రధాన భూమికను పోషిస్తాయి. ఇందులో కార్బనం, నీరు, ఆక్సిజన్, నత్రజని, భాస్వరం, పొటాషియంలను అతి ముఖ్యమైనవిగా చెబుతుండగా జింక్, కాపర్, మెగ్నీషియం, సల్ఫర్, మాలిబ్‌నమ్, బోరాన్, మాంగనీస్, కాల్షియం తదితర పోషకాలు కూడా ముఖ్యమైనవే.
అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రసాయనిక ఎరువులను విచక్షణారహితంగా వాడటం, భూసార పరీక్షల ఊసే కరువై సూక్ష్మపోషకాల లోపాల గురించి తెలియకపోవడం వంటి కారణాలతో 20 శాతానికిపైగా పంటల దిగుబడులు పడిపోతున్నాయి. చాలావరకు రైతులు పెట్టుబడులు కూడా దక్కని స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఏ యేటికాయేడు కష్టాల్లో చిక్కుకుంటున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయరంగం సంక్షోభం దిశగా పయనిస్తున్నది. జిల్లాలో ఈ దుస్థితిని నివారించేందుకు ఇక్రిశాట్, వ్యవసాయశాఖ నడుంబిగించింది. గతేడాది అక్టోబర్ నుంచి ‘భూ చేతన’ పేరిట కార్యక్రమాలను చేపడుతున్నది. తొలుత ఒక్కో మండలంలో కొన్ని గ్రామాలను ఎంపిక చేసి అక్కడ రైతులకు సూక్ష్మపోషకాల లోపాలపై అవగాహన కల్పించి వివిధ రకాల సూక్ష్మపోషకాల బ్యాగులను 50 శాతం సబ్సిడీపై రైతులకు పంపిణీ చేస్తున్నారు. అయితే ఈ కార్యక్రమం ద్వారా ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంవల్ల మరింత పకడ్బందీగా కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. ఇందులోభాగంగానే జిల్లాలోని జగదేవ్‌పూర్, కొండాపూర్, మనూర్, ఝరాసంగం మండలాలను పెలైట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేశారు. జగదేవ్‌పూర్ మండలంలోని అలిరాజపేట, తిమ్మాపూర్, బస్వాపూర్, ఇటిక్యాల, ఎర్రవల్లి, బీజీ వెంకటాపూర్ గ్రామాల్లో ఈ ప్రక్రియ ప్రారంభం కానున్నది. జగదేవ్‌పూర్ మండలంలోని ఆయా గ్రామాల్లో భూసార పరీక్షలకు సంబంధించిన నమునాల సేకరణపై మంగళవారం గజ్వేలోని మార్కెట్ కమీటీ కార్యాలయ సమావేశమందిరంలో రైతులకు, వ్యవసాయాధికారులకు, వ్యవసాయవిస్తరణాధికారులకు శిక్షణనిచ్చారు. అదేవిధంగా మిగతా మండలాల్లోనూ ఆరేసీ గ్రామాలను ఎంపిక చేశారు.
మొదటగా ఆయా గ్రామాల్లో భూసార నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం ఇక్రిశాట్‌కు పంపనున్నారు. పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాత ఏయే సూక్ష్మపోషకాలు లోపించాయనే విషయాన్ని గుర్తించి దానికనుగుణంగా పోషకాలను సబ్సిడీపై ప్రతి రైతుకు అందజేయనున్నారు. తక్కువ ధరకు ఈ షోషకాలను అందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ప్రక్రియ విజయవంతంగా నిర్వహించిన పక్షంలో వచ్చే ఖరీఫ్‌లో సత్ఫలితాలను సాధించి అన్ని మండలాలకు ఈ పథకాన్ని వర్తింపజేయడానికి వ్యవసాయశాఖ యోచిస్తున్నది.
‘భూ చేతన’.. రైతుకు సాంత్వన
Published Wed, Feb 26 2014 12:00 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement