బాబోయ్ చిరుత
- రెండు నెలలుగా ఇక్రిశాట్‌లో సంచారం
- పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న అధికారులు
- భయాందోళనలో సమీప ప్రాంతాల ప్రజలు
సాక్షి, హైదరాబాద్: నగర శివార్లలోని పటాన్‌చెరులో ఉన్న జాతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ (ఇక్రిశాట్) ప్రాంగణంలోకి చిరుత పులి ప్రవేశించింది. రెండు నెలలుగా హల్‌చల్ చేస్తున్న దీన్ని పట్టుకోవడానికి అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించట్లేదు. దీనివల్ల ఎలాంటి ఇబ్బంది లేదని అటవీ శాఖ అధికారులు చెబుతున్నా... ఈ సంస్థ ప్రాంగణం చుట్టూ నివసిస్తున్న ప్రజలు మాత్రం తీవ్ర భయాందోళనతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
వ్యవసాయ క్షేత్రాలతో, వందల ఎకరాల్లో సువిశాల ప్రాంగణంలో చెట్లు, పొదలతో విస్తరించి ఉన్న ఇక్రిశాట్‌లో కుందేళ్లు, నెమళ్లు, అడవి పందుల వంటి వన్యప్రాణులు నివసిస్తుంటాయి. ఇందులోకి క్రూరమృగమైన చిరుత పులి ప్రవేశించిన విషయాన్ని రెండు నెలల క్రితం అధికారులు గుర్తించారు. పలుమార్లు చిరుత కదలికల్ని గమనించిన తరువాత విషయాన్ని అటవీ శాఖ దృష్టికి తీసుకువెళ్లారు. ఆ శాఖ అధికారులు సదరు చిరుత ఇక్రిశాట్‌కు 26 కి.మీ. దూరంలో ఉన్న నర్సాపూర్ లేదా 28 కి.మీ. దూరంలో ఉన్న ముడినియాల్ అటవీ ప్రాంతం నుంచి వచ్చినట్లు అంచనా వేశారు.
ముడినియాల్ అడవి నుంచి ఇక్రిశాట్ మధ్య మార్గంలో పూర్తిగా అభివృద్ధి చేయని ఔటర్ రింగ్ రోడ్ ఉండటం, దారి పొడవునా చెట్లు, పొదలు ఉండటంతో దఫదఫాలుగా ప్రయాణిస్తూ ఈ మార్గంలోనే వచ్చి ఉంటుందని నిర్థరించారు. చిరుతను పట్టుకోవడానికి ప్రయత్నాలు మాత్రం ఇక్రిశాట్ సిబ్బందే ప్రారంభించారు. ప్రాంగణంలోని అనేక ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేయడంతో పాటు కుక్కల్నీ ఎరగా వేసి ప్రయత్నించారు. ఇప్పటి వరకు ఇవేవీ ఫలించలేదు.
ఈ అంశంపై అటవీ శాఖ కన్జర్వేటర్ సీనియర్ ఐఎఫ్‌ఎస్ అధికారి శంకరన్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా... ‘ఇక్రిశాట్‌లో చిరుత పులి సంచరిస్తున్న విషయాన్ని అధికారులు మా దృష్టికి కూడా తీసుకువచ్చారు. ప్రాంగణంలో ఉన్న చిన్న జంతువులను తింటూ జీవిస్తున్న చిరుత వల్ల ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులు లేవు. దాన్ని పట్టుకోవడానికి సహాయం కోరితే బృందాలను పంపిస్తాం’ అని అన్నారు. అయితే చిరుత సంచారం, దాన్ని పట్టుకోవడంలో విఫలమవుతున్న ఇక్రిశాట్ అధికారుల తీరుతో చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చిరుత ఒకసారి ప్రాంగణం దాటి బయటకు వస్తే అది మ్యాన్ ఈటర్‌గా మారే ప్రమాదం ఉందని భయపడుతున్నారు. అది ఏ క్షణంలో ఎక్కడ కనిపిస్తుందో అని దినదినగండంగా గడుపుతున్నారు. వైల్డ్ లైఫ్ ట్రాంక్వలైజింగ్ ఫోర్స్ పేరిట దేశవ్యాప్తంగా క్రూరమృగాల్ని మత్తు మందిచ్చి బంధిస్తున్న నవాబ్ షఫత్ అలీఖాన్ హైదరాబాద్‌లోని రెడ్‌హిల్స్‌కు చెందిన వ్యక్తేనని.. ఇక్రిశాట్ అధికారులు ఆయన సహాయం తీసుకుని వేగంగా క్రూరమృగాన్ని బంధించాలని డిమాండ్ చేస్తున్నారు.