అలిపిరి కేసులో దోషులకు నాలుగేళ్లు జైలు
తిరుపతి : అలిపిరి బాంబు దాడి కేసులో దోషులకు గురువారం శిక్ష ఖరారైంది. న్యాయస్థానం ముగ్గురు దోషులకు నాలుగేళ్ల జైలు శిక్షతో పాటు రూ.500 జరిమానాను విధిస్తూ తీర్పు వెల్లడించింది. 2003 అక్టోబర్‌లో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడుపై తిరుపతి సమీపంలోని అలిపిరి వద్ద నక్సల్స్ దాడి చేసిన విషయం విదితమే.
ఈ కేసులో నిందితులు రాంమ్మోహన్ రెడ్డి, నర్సింహారెడ్డి, కేశవ్లను దోషులగా నిర్థారిస్తూ న్యాయస్థానం ఈ శిక్షలు ఖరారు చేసింది. తిరుమల స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు వెళుతున్న బాబుపై ఈ దాడి జరిగింది. కాగా తాము ఎప్పుడో జనజీవన స్రవంతిలో కలిసిపోయామని, కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు దోషులు నర్సింహారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, కేశవ్ తెలిపారు.