
87 రోజులు కో...డ్‌కు తెర
సాక్షి, కాకినాడ :వరుసగా నిర్వహించిన స్థానిక, సార్వత్రిక ఎన్నికలతో జిల్లాలో 87 రోజుల పాటు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. పురపాలక సంఘాలకు మార్చి 3న ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగా ఆ రోజు నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) అమల్లోకి వచ్చింది. తరువాత మార్చి 10న ప్రాదేశిక ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో కోడ్ కొనసాగింది. మార్చి 30న మున్సిపల్, ఏప్రిల్ 6, 11 తేదీల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి. కాగా సార్వత్రిక ఎన్నికలకు మార్చి 5న కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించగా, జిల్లాలో ఏప్రిల్ 12న నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 7న ఎన్నికలు జరగ్గా మార్చి 12, 13 తేదీల్లో మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. 16న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలైనప్పటికీ కోడ్ ఈ నెల 28 వరకూ కొనసాగుతుందని ఎన్నికల షెడ్యూల్‌లో కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. మార్చి 3 నుంచి ప్రారంభమైన ఎన్నికల కోడ్ గతంలో ఎన్నడూ లేని రీతిలో 87 రోజులు అమల్లో ఉంది. ఇంత కాలం సాధారణ పరిపాలనా వ్యవస్థ స్తంభించి పోగా అభివృద్ధి పనులకు పూర్తిగా బ్రేకులు పడ్డాయి. అయితే కోడ్‌కు ముందు మంజూరై ప్రారంభమైన పనులు కూడా నత్తనడకనే సాగుతూ వచ్చాయి.
ఆరోజు కోసం నిరీక్షణ..
వార్డు సభ్యుల నుంచి ఎమ్మెల్యేల వరకు ఎవరూ ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తే కానీ..స్థానిక ప్రజాప్రతినిధులు మున్సిపల్, పరిషత్ పగ్గాలు చేపట్టే వీలులేని పరిస్థితి నెలకొంది. అధికార బాధ్యతలు చేపట్టడం అపాయింటెడ్ డే తో ముడిపడి ఉండడంతో అందరూ ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నారు. వీరంతా బాధ్యతలు చేపడితే కాని అధికారులు పాలనపై దృష్టి పెట్టలేరు. అందువలన అధికారులు కూడా అపాయింటెడ్ డే కోసం నిరీక్షిస్తున్నారు. ఆ తర్వాతే పాలన వేగం పుంజుకునే అవకాశాలున్నాయి. వరుస ఎన్నికల నిర్వహణ అనంతరం సెలవుపై వెళ్లిన అధికారులు ఇప్పుడిప్పుడే విధుల్లో చేరుతున్నారు. కలెక్టర్ నీతూ ప్రసాద్ కూడా బుధవారం విధుల్లో చేరారు. గురువారం నుంచి తిరిగి సాధారణ పరిపాలన పునఃప్రారంభం కానున్నప్పటికీ అపాయింటెడ్ డే తర్వాతే పాలన పూర్తి స్థాయిలో గాడిలో పడనుంది. మరో పక్క పెండింగ్‌లో ఉన్న ఎంపీ లాడ్స్, ఏసీడీపీ నిధుల విడుదలకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
నాలుగైదు రోజుల్లో వార్షిక రుణ ప్రణాళిక
సాధారణంగా ఆర్థిక సంవత్సరం మొదటి నెలలోనే విడుదల కావాల్సిన జిల్లా వార్షిక రుణప్రణాళిక ఈ ఏడాది ఎన్నికల కోడ్‌తో తీవ్ర జాప్యమైంది. గత ఏడాది(2013-14) వార్షిక రుణప్రణాళిక రూ.9 వేల కోట్లు కాగా, ఈ ఏడాది ఆ మొత్తం రూ.10 వేల కోట్లకు చేరే అవకాశాలున్నాయి. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక రుణ ప్రణాళిక రూపకల్పన ఇప్పటికే పూర్తయింది. కోడ్ ఎత్తివేయడంతో రానున్న నాలుగైదు రోజుల్లో దీన్ని విడుదల చేసేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఈ ప్రణాళిక విడుదలకు అపాయింటెడ్ డేతో సంబంధం లేకపోవడంతో గురు లేదా శుక్రవారం దీన్ని కలెక్టర్‌కు సమర్పించనున్నట్టు తెలిసింది. కలెక్టర్ ఆమోదం లభిస్తే శని లేదా సోమవారం విడుదల చేసే అవకాశాలున్నాయి. ఒక వేళ అపాయింటెడ్ డే తర్వాతే విడుదల చేద్దామని కలెక్టర్ భావిస్తే మరో వారం రోజులు జాప్యం తప్పదని అధికారులంటున్నారు.