
9 గంటల విద్యుత్ సరఫరా
తాడేపల్లిగూడెం రూరల్: వ్యవసాయానికి 9 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్‌ను ప్రభుత్వం త్వరలోనే అందిస్తుందని దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. తాడేపల్లిగూడెం మండలం కొమ్ముగూడెంలో పొలం పిలుస్తోంది కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సొసైటీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రెండు నెలల్లో రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పరిస్థితి మెరుగవుతుందని చెప్పారు. పత్రి రైతుకూ వ్యవసాయంలో యాత్రిక వసతి, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం ద్వారా అధిక దిగుబడులు పొందేందుకు ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందిస్తుందని మంత్రి తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రంలో రైతుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలను రైతు ముంగిటలోకి తీసుకువచ్చి మరింత ఆదాయం పొందేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. భూమిలో పోషకవిలువలు వృద్ధి చెందేలా రైతు వేసే పంటకు ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకాన్ని తగ్గించి దిగుబడి పెంచేవిధంగా ప్రణాళిక సిద్ధం చేశామని మంత్రి వెల్లడించారు. ప్రతి రైతు పొలంలో సూక్ష్మపోషక విలువలు అందేలా ప్రభుత్వమే అవసరమైన సహాయ సహకరాలు అందిస్తుందన్నారు. గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.