విస్ఫోటం | a huge explosion in vijayawada | Sakshi
Sakshi News home page

విస్ఫోటం

Published Wed, Jan 21 2015 2:11 AM | Last Updated on Sat, Sep 2 2017 7:59 PM

విస్ఫోటం

విస్ఫోటం

కేఎల్‌రావు నగర్‌లో భారీ పేలుడు
 
ముగ్గురి మృతి.. ఏడుగురికి గాయాలు
ఉలిక్కిపడిన నగరం.. సంఘటనపై అనుమానాలు

 
‘గ్యాస్ లీకై ప్రమాదం జరగలేదు. మరేదైనా కారణాల వల్ల ప్రమాదం జరిగి ఉంటుంది. ప్రమాదం జరిగిన భవనం ఇంటితోపాటు పక్కన ఉన్న మరో మూడు పోర్షన్లలోని సిలిండర్లు సురక్షితంగా ఉన్నాయి..’ అని ఉదయం పేలుడు జరిగిన వెంటనే ఘటనాస్థలాన్ని పరిశీలించిన పౌరసరఫరాలు, గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులు తెలిపారు.
 
‘గ్యాస్ లీకేజీ కారణంగానే భారీ పేలుడు జరిగింది. మరే ఇతర కారణాల వల్ల పేలుడు జరిగిన ఆనవాళ్లు లభించలేదు. పేలుడు పదార్థాల ధాటికి పైన ఎంతమేర అయితే విధ్వంసం జరుగుతుందో, అంతేస్థాయిలో అడుగు భాగంలో కూడా గొయ్యి ఏర్పడుతుంది. పరిసర ప్రాంతాల్లో స్ప్రింక్లర్ల రూపంలో డ్యామేజీ కనిపిస్తుంది. ఇక్కడదేమీ లేదు..’ అందువల్ల గ్యాస్ లీకేజీ వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు సాయంత్రం ప్రకటించారు
 
చిట్టినగర్ : మంగళవారం ఉదయం 7.30 గంటలు.. పాలప్రాజెక్టు నుంచి చిట్టినగర్ వరకు ఒక్కసారిగా భారీ శబ్దం.. ఆందోళనతో జనం ఉరుకులు పరుగులు.. అసలు ఎక్కడ పేలుడు జరిగింది.. అంటూ సర్వత్రా ఉత్కంఠ.. ఈ క్రమంలో కేఎల్‌రావునగర్ పార్కు సమీపంలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిందని తేలింది. దీంతో అందరూ అక్కడికి చేరుకున్నారు. ధ్వంసమైన నాలుగు పోర్షన్ల భవనం.. రక్తపుమడుగులో ముగ్గురి మృతదేహాలు.. క్షతగాత్రుల రోదనలతో ఆ ప్రాంతమంతా బీభత్సంగా మారింది. స్థానికులు భయాందోళనలతో వణికిపోయారు. ఈ భారీ విస్ఫోటం గురించి నగరమంతటా క్షణాల్లో వ్యాపించడంతో అందరూ ఉలిక్కిపడ్డారు. స్థానిక కేఎల్‌రావు పార్కు సమీపంలోని బాయన అప్పారావు అపార్ట్‌మెంట్ వెనుక భాగంలో మరుపిళ్ల బాలరాజుకు నాలుగు పోర్షన్లు గల రెండు అంతస్తుల భవనం ఉంది. కింద ఉన్న నాలుగు పోర్షన్లలో ఇలిపిల్లి కమలేష్, కొండేటి రమణమ్మతోపాటు ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని)కి చెందిన కేశినేని ట్రావెల్స్‌లో కార్గో డ్రైవర్‌గా పని చేసే చిట్టిబాబు, తాపీ పనిచేసే కోరాడ రాంబాబుల కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఉదయం 7.30 గంటల సమయంలో నిద్ర లేచిన చిట్టిబాబు భార్య శివకేశ్వరి వంట చేసేందుకు గ్యాస్ పోయ్యి వెలిగించేందుకు ప్రయత్నించింది.

ఇంటి వెనుక వైపు ఉన్న భవనంలోని వారు ‘మీ ఇంట్లో నుంచి గ్యాస్ వాసన వస్తోంది..’ అని చెప్పారు. అయితే, తమ సిలిండర్ నుంచి గ్యాస్ లీకవడం లేదంటూ శివకేశ్వరి పొయ్యి వెలిగించగానే ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతోపాటు భారీ విస్ఫోటం సంభవించింది. పేలుడు ధాటికి శబ్దం రెండు కిలో మీటర్ల మేర వినిపించడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. మంటలతో ఉన్న శివకేశ్వరితోపాటు కుమార్తె కీర్తి, కుమారుడు నిఖిల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. శివకేశ్వరి ఇంటికి కుడి వైపున ఉన్న కోరాడ రాంబాబు అలియాస్ రమణ (45), ఆయన భార్య నిర్మల(35) మీద ఇంటి శకలాలు పడటంతో అక్కడిక్కడే మృతిచెందారు. శివకేశ్వరి ఇంటికి ఎడమ వైపు పోర్షన్‌లో ఉంటున్న కొండేటి రమణమ్మ(60)పై రాళ్లు పడటంతో అమె కూడా అక్కడికక్కడే మరణించారు. రమణమ్మ మనవడు శంకర్ తలకు గాయమైంది. ఘటనాస్థలానికి వెయ్యి గజాల దూరంలో అవుట్‌ఫాల్ డ్రెయిన్ పక్కన నివసించేవారు వచ్చి శివకేశ్వరి, పిల్లలను బయటకు తీసుకొచ్చారు.
 సమీపంలో ఉన్నవారికి  గాయాలు... : ఈ ప్రమాదంలో అవుట్‌ఫాల్ డ్రెయిన్ వద్ద మంచంపై నిద్రిస్తున్న షేక్ బాజీ(50) తలపై ఇంటి శకలాలు పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. బాలరాజు ఇంటి వెనుక వైపున ఉన్న మరో భవనంలో టీవీ చూస్తున్న చండ్ర కార్తీక్(15), స్వరూప్(14)లపై గోడ పడటంతో తీవ్రంగా గాయపడ్డారు. విస్ఫోటం జరిగిన ఇంటి ఎదురుగా నివసిస్తున్న గర్భిణి కె.ఇందిర ఇంటి తలుపు ధ్వంసమై ఆమె పొట్టపై పడింది. దీంతో హుటాహుటిన ఆమెను పంజా సెంటరులోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పక్కనున్న సీహెచ్ చంద్రకుమారి ఇంటితోపాటు చుట్టుపక్కల ఉన్న భవనాల తలుపుల అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. సమీపంలోని ఓ చర్చి గోడలు స్వల్పంగా బీట్లు ఇచ్చాయి. శివకేశ్వరి ఇంటి పక్క పోర్షన్‌లో ఉంటున్న కమలేష్ భార్య డెలివరీ కోసం శ్రీకాకుళం వెళ్లడంతో ఆమెను చూసేందుకు అతను వెళ్లడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడని స్థానికులు చెబుతున్నారు. తెల్లవారుజామున తమ సందులో శుభ్రం చేస్తుండగా ముందున్న భవనం నుంచి గ్యాస్ వాసన వచ్చిందని ప్రత్యక్ష సాక్షి  ఊటుకూరి పద్మ చెప్పారు. కొత్తపేట పోలీసులు సెక్షన్ 174కింద కేసు నమోదుచేశారు.

భూమి కంపించినట్లుగా... : శివకేశ్వరి ఇంటితోపాటు పక్కనే ఉన్న మూడు పోర్షన్ల మధ్య గోడలు ధ్వంసమయ్యాయి. ఇంటిలోని సామగ్రి వందల అడుగుల దూరంలో ఎగిరి పడ్డాయి. విస్ఫోటం సమయంలో భూమి కంపించినట్లుగా అయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కొత్తపేట సీఐ దుర్గారావు, వన్‌టౌన్ సీఐ వెంకటేశ్వర్లు బాధితులను 108లో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. స్థానిక ఎమ్మెల్యే జలీల్‌ఖాన్, మేయర్ కోనేరు శ్రీధర్, డెప్యూటీ మేయర్ గోగుల రమణారావు, సీపీఎం నగర కార్యదర్శి బాబూరావు, సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్, వైఎస్సార్ సీపీ నేత ఎంకే బేగ్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కాంగ్రెస్ నేత మీసాల రాజేశ్వరరావు, అర్బన్ తహశీల్దార్ ఆర్.శివరావు తదితరులు ఘటనాస్థలాన్ని పరిశీలించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న శివకేశ్వరి, నిఖిల్, కీర్తి, బాజీలను మంత్రి దేవినేని ఉమా పరామర్శించారు. కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కార్తీకేయ స్వరూప్, లక్ష్మీతేజ స్వరూప్‌ను కూడా మంత్రులు ఉమా, నారాయణ పరామర్శించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement