chittinagar
-
విజయవాడ: చిట్టినగర్‌లో భారీ అగ్నిప్రమాదం
-
భార్యను గొడ్డలితో నరికి.. ఊరేసుకున్న భర్త
చిట్టినగర్ (విజయవాడపశ్చిమ): అనుమానంతో భార్యను గొడ్డలితో నరికిన భర్త.. ఆపై ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని తానూ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విజయవాడలోని జక్కంపూడి కాలనీలో శనివారం చోటు చేసుకుంది. ఘటనపై కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశారు. జక్కంపూడి కాలనీకి చెందిన అవనిగడ్డ నరసింహారావు, కృష్ణకుమారి భార్యభర్తలు. వీరికి 30 ఏళ్ల కిందట వివాహమైంది. వెల్డింగ్ పనులు చేసే నరసింహారావుకు తొలి నుంచి భార్యపై అనుమానం ఉండేది. పుట్టిన ఇద్దరు పిల్లలకు పెళ్లిళ్లు చేసినా ఆ అనుమానం వీడలేదు. మూడు రోజుల కిందట కృష్ణకుమారి ఇబ్రహీంపట్నం సమీపంలోని జూపూడిలో ఉంటున్న అక్క దగ్గరకు వెళ్లింది. శుక్రవారం రాత్రి ఇంటికి వచ్చిన కృష్ణకుమారి భోజనం చేసి నిద్రపోయింది. బయటినుంచి ఇంటికి వచ్చిన నరసింహారావు ఇంట్లో ఉన్న భార్యను చూసి కోపంతో రగిలిపోయాడు. ఆవేశంతో గొడ్డలితో తలపై వేటు వేయడంతో నుదిటిపై తీవ్ర గాయమైంది. తీవ్ర రక్తస్రావంతో కృష్ణకుమారి మంచంపైనే ప్రాణాలు విడిచింది. కృష్ణకుమారిని హత్య చేసిన తర్వాత గొడ్డలిని బాత్రూమ్లో శుభ్రం చేసేందుకు ప్రయత్నించాడు. తెల్లవారితే విషయం అందరికీ తెలిసిపోతుందనే భయంతో ఇంటిలోనే ఫ్యాన్ హుక్కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం ఉదయం కాలనీలోని అదే బ్లాక్‌లో ఉంటున్న కుమారుడు వచ్చి చూసే సరికి తలుపులు మూసి ఉండటం, లోపల నుంచి ఎటువంటి అలికిడి లేకపోవడంతో తలుపులు బద్దలు కొట్టారు. లోపల తండ్రి ఉరి వేసుకుని ఉండటం, మంచంపై తల్లి గాయాలతో చనిపోయి ఉండటంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికులు, బంధువుల నుంచి వివరాలను అడిగి తెలుసుకుని కేసు నమోదు చేశారు. -
సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్య
విజయవాడ: పోలీసులు మందలించారనే కారణంతో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విజయవాడలోని చిట్టిగనర్ లో చోటు చేసుకుంది. తాజుద్దీన్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తనతో కలిసి పనిచేస్తున్న యువతితో సన్నిహితంగా మెలిగిన తాజుద్దీన్ ప్రేమించాలని కోరాడు. తన వెంట పడుతున్నాడని ఆ యువతి సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిని స్టేషన్ కు పిలిపించి మందలించారు. యువతి వెంటపడొద్దని హెచ్చరించి వదిలేశారు. తనను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారన్న మనస్తాపంతో అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. తమ కుమారుడు ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తాజుద్దీన్ కుటుంబ సభ్యులు ఆదివారం ఉదయం సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. పోలీసులు వారికి నచ్చజెప్పి పంపించారు. -
రోడ్డు విస్తరణలో ఉద్రిక్తత
విజయవాడ: నగరంలోని చిట్టినగర్ రోడ్డు విస్తరణలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. విస్తరణ పనుల కోసం అధికారులు అమ్మవారి ఆలయాన్ని తొలగించడానికి ప్రయత్నించడంతో స్థానికులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వీరపాండియన్‌కు, దేవాలయ కమిటీ సభ్యులకు మధ్య తోపులాట జరిగింది. రోడ్డు విస్తరణ చేయాల్సిందే అని మున్సిపల్ అధికారులు పట్టుబట్టడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పలువురు స్థానికులను అదుపులోకి తీసుకున్నారు. -
కోడలిపై కిరోసిన్ పోసి నిప్పంటించేయత్నం
-
కోడలిపై కిరోసిన్ పోసి నిప్పంటించేయత్నం
విజయవాడ: చిట్టినగర్‌లో ఓ అత్త కోడలిపై కిరోసిన్ పోసి నిప్పంటించేయత్నం చేసింది. బాధితురాలు చంద్రకళ కథనం ప్రకారం ఆమెకు చిన్న వయసులో 11 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. పది ఏళ్ల వరకు భర్త ఆమెను బాగానే చూసుకున్నాడు. ఇటీవల ఆమె పిల్లలకు కుటుంబ ఆస్తి కలసి వచ్చింది. అప్పటి నుంచి భర్త, అత్త ఆమెను వేధించసాగారు. కొట్టడం, తిట్టడంతోపాటు ఆమెకు తిండి కూడా పెట్టడంలేదు. కొడుక్కి మరో పెళ్లి చేస్తానని అత్త కొడలిని బెదిరించడం మొదలు పెట్టింది. చివరకు కోడలి ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించడానికి ప్రయత్నించింది. దాంతో చంద్రకళ న్యాయం కోసం చిట్టినగర్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు అత్తని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రకళ మాట్లాడుతూ తనకు కోర్టుల చుట్టూ తిరిగే శక్తిలేదని చెప్పింది. తన భర్తకు కౌన్సిలింగ్ ఇచ్చి తన కాపురాన్ని నిలబెట్టాలని ఆమె పోలీసులను కోరుతోంది. -
విస్ఫోటం
కేఎల్‌రావు నగర్లో భారీ పేలుడు ముగ్గురి మృతి.. ఏడుగురికి గాయాలు ఉలిక్కిపడిన నగరం.. సంఘటనపై అనుమానాలు ‘గ్యాస్ లీకై ప్రమాదం జరగలేదు. మరేదైనా కారణాల వల్ల ప్రమాదం జరిగి ఉంటుంది. ప్రమాదం జరిగిన భవనం ఇంటితోపాటు పక్కన ఉన్న మరో మూడు పోర్షన్లలోని సిలిండర్లు సురక్షితంగా ఉన్నాయి..’ అని ఉదయం పేలుడు జరిగిన వెంటనే ఘటనాస్థలాన్ని పరిశీలించిన పౌరసరఫరాలు, గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులు తెలిపారు. ‘గ్యాస్ లీకేజీ కారణంగానే భారీ పేలుడు జరిగింది. మరే ఇతర కారణాల వల్ల పేలుడు జరిగిన ఆనవాళ్లు లభించలేదు. పేలుడు పదార్థాల ధాటికి పైన ఎంతమేర అయితే విధ్వంసం జరుగుతుందో, అంతేస్థాయిలో అడుగు భాగంలో కూడా గొయ్యి ఏర్పడుతుంది. పరిసర ప్రాంతాల్లో స్ప్రింక్లర్ల రూపంలో డ్యామేజీ కనిపిస్తుంది. ఇక్కడదేమీ లేదు..’ అందువల్ల గ్యాస్ లీకేజీ వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు సాయంత్రం ప్రకటించారు చిట్టినగర్ : మంగళవారం ఉదయం 7.30 గంటలు.. పాలప్రాజెక్టు నుంచి చిట్టినగర్ వరకు ఒక్కసారిగా భారీ శబ్దం.. ఆందోళనతో జనం ఉరుకులు పరుగులు.. అసలు ఎక్కడ పేలుడు జరిగింది.. అంటూ సర్వత్రా ఉత్కంఠ.. ఈ క్రమంలో కేఎల్‌రావునగర్ పార్కు సమీపంలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిందని తేలింది. దీంతో అందరూ అక్కడికి చేరుకున్నారు. ధ్వంసమైన నాలుగు పోర్షన్ల భవనం.. రక్తపుమడుగులో ముగ్గురి మృతదేహాలు.. క్షతగాత్రుల రోదనలతో ఆ ప్రాంతమంతా బీభత్సంగా మారింది. స్థానికులు భయాందోళనలతో వణికిపోయారు. ఈ భారీ విస్ఫోటం గురించి నగరమంతటా క్షణాల్లో వ్యాపించడంతో అందరూ ఉలిక్కిపడ్డారు. స్థానిక కేఎల్‌రావు పార్కు సమీపంలోని బాయన అప్పారావు అపార్ట్మెంట్ వెనుక భాగంలో మరుపిళ్ల బాలరాజుకు నాలుగు పోర్షన్లు గల రెండు అంతస్తుల భవనం ఉంది. కింద ఉన్న నాలుగు పోర్షన్లలో ఇలిపిల్లి కమలేష్, కొండేటి రమణమ్మతోపాటు ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని)కి చెందిన కేశినేని ట్రావెల్స్‌లో కార్గో డ్రైవర్‌గా పని చేసే చిట్టిబాబు, తాపీ పనిచేసే కోరాడ రాంబాబుల కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఉదయం 7.30 గంటల సమయంలో నిద్ర లేచిన చిట్టిబాబు భార్య శివకేశ్వరి వంట చేసేందుకు గ్యాస్ పోయ్యి వెలిగించేందుకు ప్రయత్నించింది. ఇంటి వెనుక వైపు ఉన్న భవనంలోని వారు ‘మీ ఇంట్లో నుంచి గ్యాస్ వాసన వస్తోంది..’ అని చెప్పారు. అయితే, తమ సిలిండర్ నుంచి గ్యాస్ లీకవడం లేదంటూ శివకేశ్వరి పొయ్యి వెలిగించగానే ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతోపాటు భారీ విస్ఫోటం సంభవించింది. పేలుడు ధాటికి శబ్దం రెండు కిలో మీటర్ల మేర వినిపించడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. మంటలతో ఉన్న శివకేశ్వరితోపాటు కుమార్తె కీర్తి, కుమారుడు నిఖిల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. శివకేశ్వరి ఇంటికి కుడి వైపున ఉన్న కోరాడ రాంబాబు అలియాస్ రమణ (45), ఆయన భార్య నిర్మల(35) మీద ఇంటి శకలాలు పడటంతో అక్కడిక్కడే మృతిచెందారు. శివకేశ్వరి ఇంటికి ఎడమ వైపు పోర్షన్లో ఉంటున్న కొండేటి రమణమ్మ(60)పై రాళ్లు పడటంతో అమె కూడా అక్కడికక్కడే మరణించారు. రమణమ్మ మనవడు శంకర్ తలకు గాయమైంది. ఘటనాస్థలానికి వెయ్యి గజాల దూరంలో అవుట్‌ఫాల్ డ్రెయిన్ పక్కన నివసించేవారు వచ్చి శివకేశ్వరి, పిల్లలను బయటకు తీసుకొచ్చారు. సమీపంలో ఉన్నవారికి గాయాలు... : ఈ ప్రమాదంలో అవుట్‌ఫాల్ డ్రెయిన్ వద్ద మంచంపై నిద్రిస్తున్న షేక్ బాజీ(50) తలపై ఇంటి శకలాలు పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. బాలరాజు ఇంటి వెనుక వైపున ఉన్న మరో భవనంలో టీవీ చూస్తున్న చండ్ర కార్తీక్(15), స్వరూప్(14)లపై గోడ పడటంతో తీవ్రంగా గాయపడ్డారు. విస్ఫోటం జరిగిన ఇంటి ఎదురుగా నివసిస్తున్న గర్భిణి కె.ఇందిర ఇంటి తలుపు ధ్వంసమై ఆమె పొట్టపై పడింది. దీంతో హుటాహుటిన ఆమెను పంజా సెంటరులోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పక్కనున్న సీహెచ్ చంద్రకుమారి ఇంటితోపాటు చుట్టుపక్కల ఉన్న భవనాల తలుపుల అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. సమీపంలోని ఓ చర్చి గోడలు స్వల్పంగా బీట్లు ఇచ్చాయి. శివకేశ్వరి ఇంటి పక్క పోర్షన్లో ఉంటున్న కమలేష్ భార్య డెలివరీ కోసం శ్రీకాకుళం వెళ్లడంతో ఆమెను చూసేందుకు అతను వెళ్లడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడని స్థానికులు చెబుతున్నారు. తెల్లవారుజామున తమ సందులో శుభ్రం చేస్తుండగా ముందున్న భవనం నుంచి గ్యాస్ వాసన వచ్చిందని ప్రత్యక్ష సాక్షి ఊటుకూరి పద్మ చెప్పారు. కొత్తపేట పోలీసులు సెక్షన్ 174కింద కేసు నమోదుచేశారు. భూమి కంపించినట్లుగా... : శివకేశ్వరి ఇంటితోపాటు పక్కనే ఉన్న మూడు పోర్షన్ల మధ్య గోడలు ధ్వంసమయ్యాయి. ఇంటిలోని సామగ్రి వందల అడుగుల దూరంలో ఎగిరి పడ్డాయి. విస్ఫోటం సమయంలో భూమి కంపించినట్లుగా అయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కొత్తపేట సీఐ దుర్గారావు, వన్‌టౌన్ సీఐ వెంకటేశ్వర్లు బాధితులను 108లో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. స్థానిక ఎమ్మెల్యే జలీల్‌ఖాన్, మేయర్ కోనేరు శ్రీధర్, డెప్యూటీ మేయర్ గోగుల రమణారావు, సీపీఎం నగర కార్యదర్శి బాబూరావు, సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్, వైఎస్సార్ సీపీ నేత ఎంకే బేగ్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కాంగ్రెస్ నేత మీసాల రాజేశ్వరరావు, అర్బన్ తహశీల్దార్ ఆర్.శివరావు తదితరులు ఘటనాస్థలాన్ని పరిశీలించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న శివకేశ్వరి, నిఖిల్, కీర్తి, బాజీలను మంత్రి దేవినేని ఉమా పరామర్శించారు. కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కార్తీకేయ స్వరూప్, లక్ష్మీతేజ స్వరూప్‌ను కూడా మంత్రులు ఉమా, నారాయణ పరామర్శించారు. -
సిలిండర్ పేలుడు ఘటనపై కలెక్టర్ సీరియస్
విజయవాడ : విజయవాడ చిట్టినగర్‌లో జరిగిన గ్యాస్ సిలిండర్ పేలుడు ప్రమాదంపై జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. చిట్టినగర్‌లో మంగళవారం ఉదయం గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. విజయవాడ కేఎల్ రావు నగర్‌లోని ఓ ఇంట్లో వంట చేస్తుండగా మంగళవారం ఉదయం సిలిండర్ పేలింది. ఈ ఘటనలో దంపతులు కోరాడ రాంబాబు అలియాస్ రమణ, నిర్మలతోపాటు రమణమ్మ చనిపోయారు. గాయాల పాలైన నలుగురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి మూడు అంతస్తుల ఆ భవనంలో రెండు అంతస్తులు ధ్వంసమయ్యాయి. కాగా, గ్యాస్ లీకేజీ కారణంగా పేలుడు సంభవించినట్లు ప్రాథమిక సమాచారం. సంఘటనా స్థలాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ సందర్శించి, బాధితులను పరామర్శించారు. మరోవైపు ఈ సంఘటనపై బాధితులు మాట్లాడుతూ భారత్ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. గ్యాస్ లీక్ అవుతుందని నాలుగు రోజులుగా డిస్ట్రిబ్యూటర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు.