
తొమ్మిదేళ్ల బాలుడు కిడ్నాప్
- చింతలగ్రహారంలో ఘటన
- కిడ్నాపర్ల నుంచి తండ్రికి ఫోన్.. రూ.30 లక్షలు డిమాండ్
పెందుర్తి: పెందుర్తి మండలం చింతలగ్రహారంలో ఓ బాలు డు కిడ్నాపయ్యాడు. వివరాలు ఇలా ఉన్నాయి. కోరుబిల్లి శ్రీనివాసరావు,లక్ష్మి దంపతులకు కుమార్తె యమున, కుమారుడు దామోదర్(9) సంతానం. శ్రీనివాసరావు స్థానికంగా వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. దామోదర్ స్థానిక మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు.
ఈ నెల 8న పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన బాలుడు రాత్రి 8.30కి వినాయక మండపం వద్దకు అని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు గ్రామంలో ఆరా తీశారు. రెండురోజులు వెతికినా ఫలితం లేకపోవడంతో బుధవారం పెందుర్తి పోలీస్‌స్టేషన్‌లో అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేశారు.
కిడ్నాపర్ల నుంచి ఫోన్: అదృశ్యమయ్యాడనుకున్న దామోదర్ ఉదంతం బుధవారం సాయంత్రం కొత్తమలుపు తిరిగింది. బాలుడు తమ వద్ద ఉన్నాడంటూ గోపాలపట్నం దరి కొత్తపాలెం రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న కాయిన్‌బాక్స్ నుంచి తండ్రి శ్రీనివాసరావుకు ఫోన్ వ చ్చింది. సాయంత్రం 4.20, 4.30కి రెండు దఫాలు ఫోన్ చేసిన దుండగులు 40 గంటల్లో రూ.30 లక్షలు ఇవ్వాలని..లేకుంటే మీ కుమారిడ్ని చంపుతామంటూ బెదిరించారు.
ఆయా ఫోన్‌కాల్ వాయిస్‌ను రికార్డు చేసిన శ్రీనివాసరావు పోలీసులకు అందించాడు. అందులో బాలుడి గొంతు వినిపించింది. గాజువాక, అనకాపల్లి ప్రాంతాల్లో బాలుడు తిరిగినట్లు పలువురు చెబుతున్నారు.పోలీసులు కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. బాలుడి కేసును అత్యంత వేగంగా ఛేదిస్తామని నార్త్ ఏసీపీ సీఎం నాయుడు విలేకరులకు చెప్పారు. నాలుగు బృందాలతో ముమ్మర గాలింపు చేస్తున్నట్లు వెల్లడించారు. కిడ్నాప్ వెనుక ఆర్థిక పరమైన కారణాలు కనిపిస్తున్నాయి.
ఎటువంటి వివాదాలు లేవని తండ్రి చెబుతున్నా ఈ వ్యవహారంలో పలు వాదనలు వినిపిస్తున్నాయి. ఏడాది కాలంగా రూ.30 లక్షల రుణం వ్యవహారంలో శ్రీనివాసరావుకు, మరో వ్యక్తికి వివాదం నడుస్తున్నట్లు తెలుస్తుంది. ఇటీవల ఓ ఆస్తి అమ్మకంలో శ్రీనివాసరావు వద్ద కొంత మొత్తం ఉన్నట్లు ప్రచారంలో ఉంది. ఈ విషయం తెలిసిన ఎవరైనా దామోదర్‌ను కిడ్నాప్ చేశారా అని అనుమానిస్తున్నారు.