- ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి
- ఎమ్మార్‌పల్లె కాంగ్రెస్ మాజీ వార్డు మెంబర్లు వైఎస్‌ఆర్ సీపీలో చేరిక
తిరుపతి(మంగళం), న్యూస్‌లైన్: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తిరుపతి పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా శాశ్వత పరిష్కారం చూపుతానని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి హామీ ఇచ్చారు. వైఎస్‌ఆర్ సీపీ నాయకులు వెంకటమునిరెడ్డి, తిరుమలయ్య, మబ్బు నాదమునిరెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి ఎంఆర్‌పల్లె మాజీ కాంగ్రెస్ వార్డు మెంబర్లతో పాటు వందలాది మంది యువత ఆదివారం తిరుపతి ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు.
వారికి ఎమ్మెల్యే కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎంఆర్‌పల్లె పరిధిలోని ఎస్వీనగర్ వద్ద పార్టీ నాయకుడు ఎంవీఎస్.మణి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో, శ్రీనివాసనగర్‌లో పార్టీ నాయకుడు యేసు నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి పరిసర ప్రాంతాల్లోని ప్రజలంతా చెయ్యి చెయ్యి కలిపి ఏకమై వైఎస్‌ఆర్ సీపీని గెలిపించుకుని తిరుపతి పుణ్యక్షేత్రాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుకుందామని పిలుపునిచ్చారు.
ఉప ఎన్నికల్లో తాను గెలుపొందినప్పటి నుంచి కంటిపై కునుకు లేకుండా నిత్యం ప్రజల్లోనే ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానని తెలిపారు. టీడీపీలోలాగా వైఎస్‌ఆర్ సీపీలో వర్గాలు, కుమ్ములాటలు ఉండవన్నారు. వైఎస్‌ఆర్ సీపీ క్రమశిక్షణకు మారు పేరు అన్నారు. పార్టీలోని నాయకులు, కార్యకర్తలంతా ఒక్కటిగా ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి వెంటనే కృషి చేస్తామన్నారు.
తండ్రి ఆశయసాధన, ప్రజల అభ్యున్నతికై జగనన్న పడుతున్న శ్రమను ప్రతి ఒక్కరూ గుర్తించి రాబోయే ఎన్నికల్లో వైఎసార్ కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. జగనన్న అధికారంలోకి రాగానే మహానేత వైఎస్. రాజశేఖరరెడ్డి అందించిన సంక్షేమ పథకాలకన్నా మరిన్ని ఎక్కువగా ప్రవేశపెడతారని స్పష్టం చేశారు. అనంతరం ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి సోదరి భూమన సుగుణారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో వచ్చి కల్లబొల్లి మాటలు చెప్పే నాయకులను నమ్మవద్దని ప్రజలకోసం పనిచేసే కరుణాకరరెడ్డి వంటి నాయకుడిని ఆదరించి గెలిపిం చాలని కోరారు.
పార్టీ నాయకులు ఎస్‌కే. బాబు, కట్టా జయరాంయాదవ్, సాకం ప్రభాకర్, ముద్రనారాయణ, మునిసుబ్రమణ్యం, లక్ష్మి, సుభాషిణి, పార్టీలో చేరిన వారు పి. సుబ్రమణ్యం, ఎ. సుధాకర్, మోహనయ్య, రమణయ్య, సోమశేఖర్, సుమంత్, మురళి, రాజగోపాల్, నాగేశ్వరరావు, జయప్రకాష్, లోకనాధం, సతీష్‌బాబు, మౌనిక, నాగమణితో పాటు వందలాది మంది యువత ఉన్నారు.