రుణ మాఫీకి ఆధార్‌తో లింకు!
చంద్రబాబు సర్కారు కొత్త మెలిక
హైదరాబాద్: రుణ మాఫీపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త మెలిక పెట్టబోతోంది. రుణ మాఫీకి ఆధార్ కార్డుకూ ముడిపెట్టాలని నిర్ణయించింది. నకిలీ పత్రాలతో, భూమి లేకుండా రుణాలు తీసుకున్న వారు, టెన్ వన్ అడంగల్‌తో రుణాలు పొందిన వారిని కట్టడి చేసేందుకు రుణ మాఫీని ఆధార్‌తో అనుసంధానం చేయనున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. బుధవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆధార్ కార్డు ద్వారా నకిలీలను నివారిస్తామని, సరైన పత్రాలు, పట్టాదారు పాసు పస్తకాలతో రుణాలు పొందిన వారికి ఇబ్బంది ఉండదని అన్నారు. ఆధార్ లేనివారి విషయంలో ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తామని చెప్పారు. ఆధార్ కార్డులను అనుసంధానం చేసుకున్న తరువాత వారికి మాఫీ వర్తిస్తుందన్నారు. తాము రూపొందించే మార్గదర్శకాల పరిధిలోకి వచ్చే వారి రుణాలను ప్రభుత్వం బ్యాంకులకు చెల్లిస్తుందని, మిగిలిన వారు తమ బకాయిలను చెల్లించాల్సి ఉంటుందన్నారు.
రుణమాఫీ చేయకుంటే ఉద్యమమే
కాకినాడ: రుణమాఫీ అమలు కాకుంటే కోనసీమ రైతులు ఉద్యమించేందుకు సన్నద్ధమవుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో బుధవారం సమావేశమైన రైతులు రుణమాఫీ తప్ప మరో మార్గం వెతకవద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.