
రుణమాఫీ.. అయోమయం..!
సదాశివపేట: రూ. లక్షలోపు పంట రుణాలను మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినందున రుణమాఫీపై రైతులు కోటి ఆశలు పెట్టుకున్నారు. ఈ విషయమై రోజుకో నిర్ణయం వెలువడడంతో మార్గదర్శకాలు తారుమారవుతున్నాయి. కొత్తగా ఆధార్ లింకు పెట్టడంతో రుణ మాఫీపై రైతుల్లో అయోమయం నెలకొంది. చాలా మంది రైతులకు ఇంకా ఆధార్ జారీకాలేదు. అందువల్ల రుణ మాఫీ జాబితాలో తమపేరు ఉన్నదో లేదోననే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రుణ మాఫీ ప్రకటనకు కట్టుబడి ఉన్నామంటూ ఈ మధ్యేనే ప్రభుత్వం జీఓ నంబరు 69 జారీ చేసింది. మార్చి 31, 2014 వరకు తీసుకున్న రుణాల్లో లక్ష లోపు రుణమాఫీకి ప్రభుత్వం ఇదివరకే ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
అయితే రుణ మాఫీకి అర్హులు ఎవరన్న విషయం తేల్చాల్సిన సమయం అసన్నమైన తరుణంలో బ్యాంకర్లు రెవెన్యూ అధికారులతో ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తున్నారు. దీని ఆధారంగా రుణ మాఫీ అర్హులను తేల్చేందుకు నిర్వహించే సామాజిక తనఖీలే ప్రామాణికం కానున్నాయి. సదాశివపేట పట్టణంలోని ఎస్‌బీఐ, ఎస్‌బీహెచ్, ఏపీ జీవీబీ, డీసీసీబీ, రూరల్ బ్యాంకు, వైశ్యాబ్యాంకు, ఆంధ్రా బ్యాంకు, విజయ బ్యాంకుతో పాటు మండల పరిధిలోని నిజాంపూర్ ఎస్‌బీఐ బ్యాంకుల నుంచి రైతులు పంట రుణాలు తీసుకున్నారు. మండల పరిధిలో దాదాపు 19 వేల మంది రైతులు అధికారికంగా నమోదై ఉన్నారని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు.
వీరిలో దాదాపు 90 శాతం వరకు బ్యాంకుల నుంచి పంట రుణాలు తీసుకున్నారని వీరిలో 10 శాతం మంది రైతులకు ఆధార్ కార్డులు లేవని సమాచారం. 2014 మార్చి 31 వరకు తీసుకున్న పంట రుణాలు, పాత బకాయిల జాబితాలు, వ్యవసాయ భూములకు సంబంధించిన పట్టాదార్ పాసుబుక్కుల అధారంగా బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న పంట రుణాల జాబితాను బ్యాంకు అధికారులు తయారు చేస్తున్నారని సమాచారం. ఈనెల చివరి వరకు తుది జాబితాను సిద్ధ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
రుణమాఫీపై మార్గదర్శకాలు ఇవే
జీఓ నంబరు 69 ద్వారా ప్రభుత్వం రుణ మాఫీపై మార్గదర్శకాలను విడుదల చేసింది. మూడు నెలలుగా రుణ మాఫీపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరి చెప్పకపోవడంతో రైతులు ఆందోళన చెందారు. ఈనెలాఖరులోగా రుణ మాఫీపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైతులు ఈ ఏడాది మార్చి 31 వరకు తీసుకున్న పంట రుణాలకు మాఫీ వర్తిస్తుంది. ప్రభుత్వం ఒక్కోరైతుకు గరిష్టంగా రూ. లక్ష వరకు మాఫీ అవకాశం కల్పించింది. వడ్డీ కలుపుకుని రూ. లక్ష వరకు మాఫీ అవుతుంది.
రూ. లక్షల కంటే అధికంగా ఉన్న రుణ మొత్తాన్ని రైతులే చెల్లించాలి. రైతులు పలు బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నా అన్ని రుణాలను మండల స్ధాయి బ్యాంకర్ల సమావేశంలో లెక్కించి రూ. లక్ష వరకు మాఫీ చేసి మిగతా మొత్తం రైతుల నుంచి వసూలు చేసేందుకు నిర్ణయిస్తారు. రుణ మాఫీకి కూడా కుటుంబాన్ని ప్రాతిపదికగా తీసుకోనున్నారు. ఒక్కో కుటుంబానికి రూ. లక్ష పంట రుణం మాత్రమే మాఫీ అవుతుందని తెలిసింది. రైతులు బ్యాంకులో ఆధార్ కాపీని అందజేసి ఆధార్ సంఖ్యను నమోదు చేయించుకోవాలి.
జీఓ 69 ప్రకారమే
ప్రభుత్వం విడుదల చేసిన జీఓ 69 ప్రకారం రుణ మాఫీకి కొన్ని విధి విధానాలను నిర్ణయించిందని, ఈ ఉత్తర్వులకు లోబడే రుణ మాఫీ ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు పేర్కొంటున్నారు.
ఆధార్ లింకు
రుణ మాఫీ ఉత్తర్వులు విడుదల కావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్న రైతులను ఆధార్ లింకు అయోమయానికి గురిచేస్తోంది. బ్యాంకర్లు ఆధార్ అర్హతను నిర్ణయించడంతో పంటరుణాలు తీసుకున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట రుణాలు తీసుకొని, ఆధార్ లేని రైతులు అయోమయంలో పడుతున్నారు.
ఆధార్ లింక్ తొలగించాలి
దాదాపు 90 శాతం వ్యవసాయ భూములున్న రైతులు పంట రుణాలు తీసుకున్నారు. వీరిలో 10 శాతం వరకు రైతులకు ఆధార్‌కార్డులు లేవు. ఆధార్‌తో సంబంధం లేకుండా రుణ మాఫీ చేసి రైతులను ఆదుకోవాలి.
మంజీర రైతు సమాఖ్య జిల్లా అధ్యక్షుడు, పృథ్వీరాజ్