అభి మీ సేవా.. మోసాలు ఇంకెన్నో! | Sakshi
Sakshi News home page

అభి మీ సేవా.. మోసాలు ఇంకెన్నో!

Published Mon, Oct 15 2018 12:20 PM

Abhi Mee Seva Centre Managers Scams to Farmers  - Sakshi

భీమవరం టౌన్‌: పట్టణంలో అభి మీ సేవ నిర్వాహకుల మోసాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ల్యాండ్‌ కన్వర్షన్‌ నిమిత్తం అభి మీ సేవకు వెళ్లిన 9 మంది రైతులకు రూ.33,33,815 టోకరా వేయగా తాజాగా మరో వ్యక్తి రూ.79 వేలు తాను చెల్లించి మోసపోయినట్లు రెవెన్యూ అధికారులను ఆశ్రయించాడు. అయితే ఇందుకు సంబంధించిన దరఖాస్తు కూడా అభి మీ సేవ నిర్వాహకులు చేయకపోవడంతో సీఎఫ్‌ఎంఎస్‌ వెబ్‌సైట్లోకి ఇందుకు సంబంధించిన వివరాలు చేరలేదు. ఇలా ఇంకా ఎన్ని మోసాలు అభి మీ సేవలో జరిగాయోనని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. మీ సేవ ఆపరేటర్‌ విటాల గంగాధరరావు, నిర్వాహకుడు చేబ్రోలు వెంకటేష్‌లపై ఇప్పటికే భీమవరం తహసీల్దార్‌ చవ్వాకుల ప్రసాద్‌ వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మొత్తం గోల్‌మాల్‌ ఆపరేటర్‌ విటాల గంగాధరరావు చేసినట్లుగా తెలుస్తోంది.

 కృష్ణా జిల్లా హనుమాన్‌ జంక్షన్‌ సమీపంలోని ఒక గ్రామానికి చెందిన గంగాధరరావు భీమవరం బ్యాంక్‌ కాలనీలో నివాసం ఉంటూ మీసేవ నడుపుతున్నాడు. గతేడాది ఆగస్టు నెలలో తొలిసారిగా ల్యాండ్‌ కన్వర్షన్‌ నిమిత్తం వచ్చిన రైతుకు టోకరా వేశాడు. అదే నెలలో ఆ తర్వాత ఈ ఏడాది జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌ నాటికి సీఎఫ్‌ఎంఎస్‌ ఆధారాల ప్రకారం 9 మంది రైతులు రూ.37,33,815 నగదు చెల్లించగా కేవలం రూ.3,419 మాత్రమే వీరందరి పేరిట ఆ వెబ్‌సైట్లో జమ కనిపిస్తోంది. ఏడాది కాలంగా నెమ్మదిగా అభి మీ సేవా మోసాలు ప్రారంభమయినా రెవెన్యూ యంత్రాంగం పసిగట్టలేకపోవడం విమర్శలకు తావిస్తోంది. సంబంధిత వీఆర్వోకు సన్నిహితంగా మెలుగుతూ నమ్మకంగా రైతులను గంగాధరరావు ముంచేసినట్లు తెలుస్తోంది. ల్యాండ్‌ కన్వర్షన్‌ నిమిత్తం వచ్చిన రైతులను ఆ వీఆర్వో అభి మీసేవకు నమ్మకంతో పంపగా ఆ నిర్వాహకులు నట్టేట ముంచారు. 

మీ సేవ నిర్వాహకుడు  పాలకోడేరు మండలం మోగల్లుకు చెందిన చేబోలు వెంకటేష్‌ కూడా నమ్మకంతో గంగాధరరావుకు బాధ్యతలు అప్పగించడంతో కేసులో ఇరుక్కున్నాడు. వెంకటేష్‌ మోగల్లులో శ్రీవెంకటేశ్వర మీ సేవ కూడా నిర్వహిస్తున్నాడు. కాగా ఈనెల 11వ తేదీన తహసీల్దార్‌ కార్యాలయ సిబ్బంది అభి మీసేవ గోడకు నోటీసును అతికించారు. 24 గంటల్లో హాజరుకావాలని అందులో పొందు పరిచినా  గంగాధరరావు పరారయ్యాడు. దీంతో తహసీల్దార్‌ చవ్వాకుల ప్రసాద్‌ ఫిర్యాదుతో మీసేవ కార్యకలాపాలను నిలిపివేశారు. బ్యాంక్‌ కాలనీలోని గంగాధరరావు అద్దెకు ఉంటున్న ఇంటికి కూడా నోటీసులు అతికించారు. ఇది ఇలా ఉండగా కొందరు రైతులను తీసుకుని వీఆర్వో కృష్ణా జిల్లా హనుమాన్‌ జంక్షన్‌ సమీపంలోని గంగాధరరావు స్వగ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులకు విషయాన్ని తెలియచేశారు. అతని తండ్రి వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న అతను సొమ్ము అందేలాగా చూస్తానని రైతులకు, వీఆర్వోకు చెప్పినట్లు తెలిసింది.  

Advertisement
 
Advertisement
 
Advertisement