తుమ్మ..పాలా, నీళ్లా! | Acacia .. Paula, water! | Sakshi
Sakshi News home page

తుమ్మ..పాలా, నీళ్లా!

Published Fri, Feb 14 2014 12:43 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

తుమ్మ..పాలా, నీళ్లా! - Sakshi

తుమ్మ..పాలా, నీళ్లా!

  •     చక్కెర కర్మాగారం భవితవ్యంపై చివరి ఆశలు
  •      అదనంగా టన్నుకు రూ.200 చెల్లించాలని డిమాండ్
  •      ఆధునికీకరణకు రూ7.54 కోట్ల విడుదల కోసం ఎదురు చూపులు
  •      సీఎం వద్ద ‘తుమ్మపాల’ దస్త్రాలు
  •      హైదరాబాద్‌లో ఫైళ్లతో తిష్టవేసిన ఎమ్‌డీ
  •  అనకాపల్లి, న్యూస్‌లైన్: ముక్కుతూ, మూలుగుతూ ఈసీజన్‌లో గానుగాట చేపట్టిన తుమ్మపాల చక్కెర కర్మాగారం భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. రేపోమాపో ప్రభుత్వం పడిపోతుందని ప్రచారంసాగుతున్న నేపథ్యంలో సీఎం వద్ద పెండింగ్‌లో ఉన్న రెండు దస్త్రాలు ఇప్పుడు కీలకంగా కనిపిస్తున్నాయి. కర్మాగార భవితవ్యాన్ని, రైతులకు చెల్లించే మద్దతు ధరను ప్రభావితం చేయనున్నాయి.

    ఫ్యాక్టరీ ఎమ్‌డీ ఫైళ్లతో ప్రస్తుతం హైదరాబాద్‌లో తిష్ట వేశారు. పలు పెండింగ్ ఫైళ్లు, బిల్లులపై సీఎం సంతకాలు చేస్తుండడంతో తుమ్మపాలకు మంచి రోజులొస్తాయని ఇక్కడి రైతులు, ఫ్యాక్టరీ ఉద్యోగులు ఆశిస్తున్నారు. స్థానిక మంత్రి గంటా శ్రీనివాసరావు మాత్రం కర్మాగారం విషయంలో మాట తప్పారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంతవరకూ సుమారు 17 వేల టన్నుల చెరకు గానుగాడినప్పటికీ రైతులకు చిల్లిగవ్వ చెల్లించలేదు.

    గత సీజన్‌లో 38 వేల టన్నులు క్రషింగ్ జరిపారు. అడ్వాన్స్‌లతో కలిపి టన్నుకు రూ.1760 చొప్పున యాజమాన్యం చెల్లించింది. ఇది ఏమాత్రం గిట్టిబాటుకాదని అప్పటి నుంచి  రైతు సంఘాలు వాపోతున్నాయి. గత సీజన్‌లో సరఫరా చేసిన చెరకుకు టన్నుకు రూ.200 అదంగా చెల్లించాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. దాని ఫైలు సీఎం పెషీలో ఉంది. ఇక రెండో ఫైలు ఆధునికీకరణకు సంబంధించినది. రూ.7.54 కోట్లతో ముడిపడి ఉన్న దీనిపై సీఎం సంతకం చేస్తారా లేదా అన్నది ప్రశ్నార్థకం.

    అనకాపల్లి వచ్చినప్పుడల్లా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సుగర్స్‌ను ఆధునీకరిస్తామంటూ హామీలు గుప్పించారు. ప్రస్తుతం కిరణ్ ప్రభుత్వానికి విభజన సెగతో కీలకమైన కర్మాగారాల ఆధునికీకరణ, మద్ధతు ధరలపై స్పష్టత లేకుండా పోయింది. దీంతో రైతులు రగిలిపోతున్నారు. ఇటీవల ఫ్యాక్టరీ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కాగా కార్మికులకు ఐదు నెలలుగా జీతాలు చెల్లించలేదు. వారు ఎప్పటికప్పుడు ఆందోళన బాట పడుతున్నారు.

    పరిస్థితి దయనీయంగా ఉంది. ప్రస్తుత సీజన్‌లోనూ ఇదే తరహా పరిస్థితులు కొనసాగితే, ఫ్యాక్టరీకి చెరకు తరలింపు విషయంలో రైతుల వెనుకంజ తప్పదు. అలాగే ఆధునీకరణకు సంబంధించిన ఫైల్‌పై పురోగతి లేకుంటే గడ్డుకాలమే. ఈ పరిస్థితుల్లో చివరి ఆశలు ఏమేరకు నెరవేరుతాయో చూడాలి.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement