పట్టాదారు పాసు పుస్తకం జారీ చేసేందుకు వ్యవసాయ భూమి యజమానురాలి నుంచి రూ.2 వేలు లంచం తీసుకుంటూ భట్లమగుటూరు వీఆర్వో ఖండవల్లి ప్రసాద్ శుక్రవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు
పెనుమంట్ర,న్యూస్‌లైన్ : పట్టాదారు పాసు పుస్తకం జారీ చేసేందుకు వ్యవసాయ భూమి యజమానురాలి నుంచి రూ.2 వేలు లంచం తీసుకుంటూ భట్లమగుటూరు వీఆర్వో ఖండవల్లి ప్రసాద్ శుక్రవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని నేలపోగుల గ్రామానికి చెందిన లంక సత్యవతికి భట్లమగుటూరులో 36 సెంట్ల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమిని వివాహితులైన ఆమె కుమార్తెలు బుచ్చెమ్మ, దుర్గలకు వీలునామా రాసింది. తల్లి మరణానంతరం వారిద్దరూ కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల కోసం 2011, డిసెంబరులో దరఖాస్తు చేశారు.
అప్పటి నుంచి వీఆర్వో చట్టూ కాళ్లరిగేలా తిరిగినా అతను పట్టించుకోలేదు. రూ 2 వేలు ఇస్తే పాస్ పుస్తకాలు వస్తాయని ఇటీవల అతను చెప్పడంతో సిర్రా బుచ్చెమ్మ, ఆమె భర్త కనకదుర్గారావు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు వారికి రసాయనాలు పూసిన నగదు ఇచ్చారు. శుక్రవారం సాయంత్రం పెనుమంట్రలోని తహసిల్దారు కార్యాలయం వద్ద బుచ్చెమ్మ నుంచి రూ.2 వేలు నగదు తీసుకుంటుండగా వీఆర్వో ప్రసాదును ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి నగదు స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు. దాడిలో ఏసీబీ సీఐలు వీజే విల్సన్, కొమరయ్య పాల్గొన్నారు.