కాకినాడ సిటీ, న్యూస్‌లైన్ :ఎవరో చిన్న పరిగెల వంటి చిరుద్యోగులను మాత్రమే ఇటీవల పట్టుకున్న అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు జిల్లాస్థాయి అధికారి చిక్కారు. జిల్లా పరిషత్ ముఖ్య కార్య నిర్వహణాధికారి (సీఈఓ) కోరా జయరాజ్ సోమవారం ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. జిల్లా స్థాయి ఉన్న తాధికారుల్లో ఒకరైన జెడ్పీ సీఈఓ ఇలా అవినీతికి పాల్పడుతూ పట్టుబడడం సంచలనం కలిగించింది. అధికార యంత్రాంగంలో వణుకు పుట్టించింది. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కాంప్రహెన్సివ్ ప్రాజెకు ్టవర్క్స్ (సీపీడబ్ల్యూ) కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఓవర్‌హెడ్ ట్యాంకుల మరమ్మతు, నిర్వహణ కాంట్రాక్టును ముమ్మిడివరానికి చెందిన ఎం.ధర్మారావుకు అప్పగించారు.
కొమరాడ, కాట్రేనికోన, ఉప్పలగుప్తం, తొత్తరమూడిలలో రూ.6.75 లక్షల విలువైన పనులు పూర్తి చేసిన ధర్మారావు ఇందుకు సంబంధించిన బిల్లులను సంబంధిత పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ద్వారా ఏప్రిల్‌లోనే జెడ్పీకి సమర్పించారు. అప్పటి నుంచి ఈ బిల్లు మంజూరు కోసం సీఈఓ జయరాజ్ ఏదో ఒక అభ్యంతరం ఎత్తిచూపుతూ తిప్పించుకుంటున్నారు. ఈలోగా సమైక్యాంధ్ర ఉద్యమం రావడంతో బిల్లులు పూర్తిగా పెండింగ్‌లో పడిపోయాయి. కాగా ఈ నెల ఒకటిన ధర్మారావు మరోసారి జెడ్పీ సీఈఓను కలిసి బిల్లులు మంజూరు చేయాల్సిందిగా అభ్యర్థించారు. తనకు రూ.60 వేలు ఇస్తే బిల్లులు మంజూరు చేస్తానని సీఈఓ చెప్పారు. ఇప్పటికే అప్పులపాలైన తాను అంత ఇచ్చుకోలేనని, బిల్లులు మంజూరు చేయాలని ధర్మారావు విజ్ఞప్తి చేశారు. అయిన ప్పటికీ సీఈఓ ససేమిరా అనడంతో చివరకు రూ.40 వేలు ఇచ్చేందుకు అంగీకరించారు. అనంతరం సీఈఓపై ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు.
విజయవాడ ఏసీబీ కోర్టుకు తరలింపు
ఏసీబీ అధికారుల సూచన మేరకు ధర్మారావు సోమవారం జెడ్పీ కార్యాలయంలో సీఈఓకు రూ.30 వేలు లంచం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆ సొమ్మును సీసీకి ఇమ్మని సీఈఓ సూచించగా, స్వామిమాలలో ఉన్న సీసీకి లంచం సొమ్ము ఇవ్వలేనని ధర్మారావు చెప్పారు. దీంతో సీఈఓ ఆయనను తన చాంబర్‌కు పిలిపించుకొని సొమ్మును టేబుల్ మీద ఉన్న పుస్తకాల్లో ఉంచమన్నారు. ధర్మారావు 30 వెయ్యి రూపాయల నోట్లను పుస్తకాల మధ్య ఉంచారు. అదే సమయంలో ఏసీబీ జిల్లా డీఎస్పీ ఎన్.వెంకటేశ్వరరావు, ఏలూరు డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐలు రాజశేఖర్, సంజీవ్‌రావు, సిబ్బంది చాంబర్‌లోకి చొరబడి లంచం సొమ్ముతో సీఈఓ జయరాజ్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఆయన కార్యాలయంలో తనిఖీలు చేశారు. ఇంద్రపాలెంలోని ఆయన ఇంటితో పాటు జన్మభూమి పార్కు పరిసర ప్రాంతాల్లో ఉంటున్న ఆయన బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేశారు. ఈ సోదాలు సోమవారం అర్ధరాత్రి వరకు కొనసాగాయి. సీఈఓ జయరాజ్‌ను అదుపులోకి తీసుకుని విజయవాడ ఏసీబీ కోర్టుకు తరలించారు. సీఈఓ జయరాజ్ రెవెన్యూ విభాగంలో సీనియర్ అసిస్టెంట్ నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఇదే జిల్లాలో డిప్యూటీ కలెక్టర్ హోదా వరకు పనిచేశారు. ఇతర జిల్లాల్లో పనిచేసి ఈ ఏడాది మార్చిలో జెడ్పీ సీఈఓగా బదిలీపై వచ్చారు. సోమవారం ఆయన ఏసీబీ దాడిలో పట్టుబడడంతో జిల్లా అధికారుల్లో కలకలం రేగింది.
ఏసీబీ వలలో జెడ్పీ సీఈఓ
Published Tue, Nov 5 2013 2:00 AM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM
Advertisement
Advertisement