సాక్షి, విజయవాడ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ సరిహద్దులతోపాటు పలు జిల్లాల్లో ఉన్న ఉమ్మడి చెక్‌పోస్టులపై ఏసీబీ అధికారులు మరోసారి కొరడా ఝుళిపించారు. ఏసీబీ డెరైక్టర్ జనరల్ ఏకే ఖాన్ ఆదేశాలతో శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు చెక్‌పోస్టులపై మెరుపు దాడులు చేశారు. ఆర్టీఏ, కమర్షియల్ ట్యాక్స్, మార్కెట్ కమిటీ, ఎక్సైజ్ తదితర కీలక శాఖలకు సంబంధించిన ఉమ్మడి చెక్‌పోస్టుల్లో ఏసీబీ అధికారులు ఈ తనిఖీలు చేశారు. శ్రీకాకుళం, తూర్పు గోదావరి, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లోని చెక్‌పోస్టుల్లో పలు అక్రమాలు వెలుగు చూశాయి. చెక్‌పోస్టుల్లో వసూలు చేసిన నగదు, రికార్డులను పరిశీలించి అదనపు వసూళ్లు చేసిన రూ. 4.26 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. పొంతనలేని లెక్కలతో ఉన్న రికార్డులను కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఇచ్ఛాపురం ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులో వాహనదారుల నుంచి అక్రమంగా వసూలు చేసిన రూ. 1.48 లక్షలను ఏసీబీ విజయనగరం డీఎస్పీ లక్ష్మీపతి, విశాఖపట్నం డీఎస్పీ నర్సింగరావుల ఆధ్వర్యంలో బృందం స్వాధీనం చేసుకుంది. అనధికారికంగా విధులు నిర్వహిస్తున్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా తేటగుంట చెక్‌పోస్టులో అనధికారికంగా ఉన్న రూ.81 వేలతోపాటు రికార్డులను కూడా స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు జిల్లా నరహరిపేట కమర్షియల్ ట్యాక్స్ చెక్‌పోస్టులో రూ.41వేలు, పలమనేరు ఆర్టీవో ఉమ్మడి చెక్‌పోస్టులో రూ.80 వేలు అదనపు వసూళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం జిల్లా పెనుకొండ ఆర్టీఐ చెక్‌పోస్టులో లెక్కకు మించి ఉన్న రూ.25 వేలను, రికార్డులను, నెల్లూరు జిల్లా తడ మండలం భీమునిపాలెం ఉమ్మడి చెక్‌పోస్టు నుంచి అక్రమంగా వసూలు చేసిన రూ.51వేలను, రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.
ఏకే ఖాన్ హయాంలో నాలుగోసారి..
ఏసీబీ డెరైక్టర్ జనరల్‌గా ఏకే ఖాన్ బాధ్యతలు చేపట్టిన అనంతరం చెక్‌పోస్టులపై ఆకస్మిక తనిఖీలు చేయడం ఇది నాలుగోసారి. గత ఏడాది డిసెంబర్ 21న పలు చెక్‌పోస్టులను తనిఖీలు చేశారు. ఆ తర్వాత వారం తర్వాత 29న మళ్లీ దాడులు చేసి ఉద్యోగులకు చెమటలు పట్టించారు. ఈ ఏడాది జనవరి 18న మరోసారి మెరుపు దాడులు చేశారు. ఇప్పుడు మళ్లీ ఏసీబీ చెక్‌పోస్టులపై కొరడా ఝుళిపించింది. ఇదే కాకుండా ఈ నెలలోనే ఎస్సీ, ఎస్టీ వసతి గృహాలపై దాడులు చేసి మెనూ అమలు, హాజరు, విద్యార్థుల సౌకర్యాల్లో లోపాలపై ఏసీబీ నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే.