కూలీ నుంచి కోటీశ్వరుడు! | ACB Attacks On Housing AE Kurnool | Sakshi
Sakshi News home page

రంగ రంగా.. కళ్లు చెదరంగా..

Published Wed, Nov 14 2018 1:10 PM | Last Updated on Wed, Nov 14 2018 1:10 PM

ACB Attacks On Housing AE Kurnool - Sakshi

ఏసీబీ తనిఖీలో బయటపడిన సొమ్ములు, పత్రాలు

కర్నూలు: ఖరీదైన భవనాలు, భూములు, డిపాజిట్లు, బ్యాంకుల్లో నగదు, భారీ మొత్తంలో అప్పుల పత్రాలు, కళ్లు చెదిరే బంగారు ఆభరణాలు.. ఇవీ గృహనిర్మాణ శాఖ కొత్తపల్లి మండల ఏఈగా పనిచేస్తున్న రంగస్వామి అక్రమార్జన. ఓ సాధారణ ఉద్యోగి ఏ స్థాయిలో అక్రమాలకు పాల్పడ్డాడో చెప్పడానికి ఇవే ఉదాహరణలు. ఓసారి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు చిక్కినప్పటికీ తీరు మారని రంగస్వామి మరింత రెచ్చిపోయాడు. ఈయన బారి నుంచి కాపాడాలని సామాన్య ప్రజానీకం ఇన్నాళ్లూ గగ్గోలు పెట్టినా పట్టించుకున్న వారు లేరు. ఓ లబ్ధిదారునికి ఇంటి బిల్లు మంజూరు చేసేందుకుఏఈ రంగస్వామి రూ.7 వేలు లంచం తీసుకుంటూ గత నెల 15న ఏసీబీ అధికారులకు చిక్కారు. దీంతో ఇతని అక్రమాస్తులపైనా  పూర్తిస్థాయి విచారణ చేశారు. మంగళవారం ఏకకాలంలో నాలుగు చోట్ల దాడులు నిర్వహించి..భారీగా అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించారు. నంద్యాల పట్టణానికి చెందిన వీఆర్వో జె.జె.బాబు ఆస్తులపై దాడులను మరువకముందే ఏసీబీ మరోసారి పంజా విసరడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

కూలీ నుంచి కోటీశ్వరుడు!
కర్నూలు నగరం పాతబస్తీకి చెందిన రంగస్వామి ఉద్యోగం రాకముందు కుటుంబ సభ్యులతో కలసి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. గృహ నిర్మాణ శాఖలో సాధారణ ఉద్యోగిగా చేరి అనతికాలంలోనే కోటీశ్వరుడయ్యాడు. ఏసీబీ డీఎస్పీ విజయరామరాజు, సీఐలు ఖాదర్‌ బాషా, గౌతమి నేతృత్వంలో మంగళవారం కర్నూలు శివారులోని నందికొట్కూరు రోడ్డులో ఉన్న విజయ నగర్‌ కాలనీలో రంగస్వామి నివాసముంటున్న ఇంట్లో సోదాలు నిర్వహించారు. అలాగే కృష్ణానగర్‌లోని రెండో కుమార్తె సులోచన, బేతంచర్లలోని మూడో కుమార్తె గాయత్రి, హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని కుమారుడు లక్ష్మీనారాయణ ఇళ్లలో సీఐలు నాగభూషణం, తేజేశ్వరరావు, శ్రీధర్‌ నాయకత్వంలో తనిఖీలు చేపట్టారు. కోడుమూరులో రెండంతస్తుల భవనం, రెండు ఇంటి స్థలాలు, కర్నూలు విజయనగర్‌ కాలనీలో మూడంతస్తుల భవనం, ఇంటి స్థలం, పాములపాడు మండలం జూటూరులో 75 సెంట్ల వ్యవసాయ భూమి, 200 గ్రాముల బంగారం, 500 గ్రాముల వెండి ఆభరణాలు, డస్టర్‌ కారు, రెండు మోటర్‌ సైకిళ్లు, రుణాల పత్రాలతో పాటు బ్యాంకు అకౌంట్లలో రూ.3 లక్షల నగదు, ఇన్సూరెన్స్‌ పత్రాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.కోటి ఉంటుందని, బహిరంగ మార్కెట్‌లో అయితే రూ.3 కోట్లకు పైమాటే అని ఏసీబీ అధికారులు అంచనా వేశారు. రంగస్వామిని అరెస్టు చేసి.. ఏసీబీ కోర్టులో హాజరుపరిచినట్లు డీఎస్పీ జయరామరాజు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement