
ఏసీబీ డీఎస్పీ సమక్షంలో ఉన్న ఫిర్యాదుదారు ఉమమహేశ్వరి, పట్టుబడిన శాంతి ప్రసాద్
పాతబస్టాండ్/శ్రీకాకుళం సిటీ: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు చేసి 48 గంటలు కూడా కాకుండానే మరో ఉద్యోగి లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. జిల్లా కేంద్రంలోని బీసీ సంక్షేమశాఖ కార్యాలయంపై శుక్రవారం రాత్రి అవినీతి నిరోధకశాఖ అధికారులు మెరుపుదాడి చేసి లక్ష రూపాయలు లంచం తీసుకుంటున్న జూనియర్ అసిస్టెంట్ శాంతిప్రసాద్‌ను పట్టుకున్నారు. ఈ కార్యాలయంలో గతంలో కూడా ఏసీబీ దాడుల్లో ఆరుగురు ఉద్యోగులు పట్టుబడ్డారు. ఉపకార వేతనాల మంజూరులో అడ్డగోలుగా అవినీతికి పాల్పడడంతో వారు సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత రెండేళ్లపాటు ప్రశాంతంగా ఉన్న కార్యాలయంలో మరోసారి అలజడి రేగింది.
ఏసీబీ డీఎస్పీ చెప్పిన వివరాలిలా..
శుక్రవారం రాత్రి బీసీ సంక్షేమ శాఖలో ఏసీబీ దాడికి సం బంధించి ఆ శాఖ డీఎస్పీ కరణం రాజేంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు సంబంధిం చి యూనిఫారాలు, కుట్టుపనుల మజూరీల నగదు చెల్లింపు కోసం సంబంధిత శాఖలోని ఉద్యోగులు లంచం డిమాండ్ చేశారు. 2017–18 విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లాలో సుమారు 20 మహిళా సంఘాల యూనిట్లకు రూ.11 లక్షలు బకాయి చెల్లించాల్సి ఉంది. అయితే ఆ బకాయి చెల్లించేందుకురూ.1.50 లక్షలు జిల్లా బీసీ సంక్షేమాధికారిణి కె.శ్రీదేవి డిమాండ్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ వ్యవహారం రెండు మూడురోజులుగా సాగుతోందని, చివరకు 20 మంది కుట్టు, సంఘాల తరఫున గాయత్రి మహిళా సొసైటీ అధ్యక్షురాలు శవ్వాన ఉమామహేశ్వరి లక్ష రూపాయలు లంచంగా ఇచ్చేందుకు ఒప్పందం కుదిరినట్లు తెలిపారు. దీని ప్రకారం శుక్రవారం రాత్రి బీసీ సంక్షేమాధికారిణి శ్రీదేవికి అందజేసేందుకు శవ్వాన ఉమామహేశ్వరి రాగా, అంతలో ఆమె కార్యాలయం నుంచి వెళ్లిపోతుండడంతో అక్కడ ఉన్న జూనియర్ అసిస్టెంట్ శాంతిప్రసాద్‌కు అందజేయమని చెప్పినట్లు తెలిపారు.
ఈ క్రమంలో ఉమామహేశ్వరి డీబీసీకి ఇవ్వాల్సిన లంచం నగదు లక్ష రూపాయలను జూనియర్ అసిస్టెంట్ ప్రసాద్‌కు అందజేస్తుండగా తాము దాడి చేసి పట్టుకున్నట్టు డీఎస్పీ రాజేంద్ర వివరించారు. అయితే ఫిర్యాదుదారు ఉమామహేశ్వరి పూర్తిగా జిల్లా బీసీ సంక్షేమాధికారిని లక్ష్యంగా చేసుకొని రావడం జరిగిందని, ఆమె కొద్ది క్షణాల్లో తప్పించుకున్నారన్నారు. దీంతో జూనియర్ అసిస్టెంట్ ప్రసాద్‌ను అదుపులోకి తీసుకొని నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. దీనికి సంబంధించి ఇద్దరిపై కేసు నమోదు చేస్తున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు.
లంచం డిమాండ్ చేశారు
2017–18 విద్యా సంవత్సరానికి సంబంధించి యూనిఫారాల కుట్టుమజూర్లు రూ.11 లక్షల చెల్లించేందుకు డీబీసీ శ్రీదేవి రూ.1.50 లక్షలు డిమాండ్ చేశారు. అయితే లక్ష రూపాయలు ఇచ్చేందుకు ఒప్పుకోవడంతో బిల్లు చెల్లింపునకు అంగీకరించారు. ఆ నగదును తన కార్యాలయంలో ఉన్న జూనియర్ అసిస్టెంట్ ప్రసాద్‌కు అందజేయాలని శ్రీదేవి సూచించారు. ఈ క్రమంలోనే ప్రసాద్‌కు రూ. లక్ష నగదు అందజేయడం జరిగింది.– శవ్వాన ఉమామహేశ్వరి: గాయత్రీ మహిళా సొసైటీ అధ్యక్షురాలు
ఈ నగదుతో నాకు సంబంధం లేదు
ఉమామహేశ్వరి ఇచ్చిన లక్ష రూపాయలతో తనకు ఎటువంటి సంబంధం లేదు. నేను ఆమెను ఎప్పుడూ లంచం డిమాండ్ చేయలేదు. ఆమె హడావుడిగా వచ్చి నగదును కాగితాలతో పాటు తన కంప్యూటర్ టేబుల్‌పై పెట్టారు. తీరా కాగితాలు తీసేసరికి నగదు కనిపించింది. ఈ లోగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నా ఫింగర్ ప్రింట్స్ తీసుకోలేదు. ఆ డబ్బుతో తనకు ఎలాంటి సంబంధం లేదు.
శాంతిప్రసాద్, జూనియర్ అసిస్టెంట్
Comments
Please login to add a commentAdd a comment