
లంచం తీసుకుంటూ పట్టుబడిన వీఆర్వో బానోజీరావు 70 పాస్‌పుస్తకాలను స్వాధీనం చేసుకుంటున్న ఏసీబీ అధికారులు
శ్రీకాకుళం, పాతపట్నం: జిల్లాలో ఓ వైపు ఏసీబీ దాడుల్లో అవినీతిపరులు భరతం పడుతున్నా కొంతమంది అధికారుల్లో ఎటువంటి నిర్భీతి లేదు. దర్జాగా లంచాల మేత మేస్తున్నారు. దీన్ని రుచి మరిగిన సోంపేట, ఎచ్చెర్ల, మందస మండలాల్లో ముగ్గురు వీఆర్వోలు ఇటీవల ఏసీబీ అధికారులు చిక్కిన విషయం విదితమే. ఈ ఉదంతాలు మరువక ముందే తాజాగా మెళియాపుట్టి మండలం జాడుపల్లి గ్రామ రెవెన్యూ అధికారి సవిరిగాన బానోజీరావు అడ్డంగా దొరికిపోయారు. రూ.3 వేలు లంచం తీసుకుంటుండగా పక్కా ప్రణాళికతో పట్టుకున్నారు. ఈ ఘటన రెవెన్యూ వర్గాల్లో అవినీతిపరులను చెమటలు పట్టించింది. మండల చరిత్రలో రెండో ఏసీబీ కేసుగా నమోదైంది. గతంలో ఓ ఎస్‌ఐ అద్దె ఇంటిపై ఏసీబీ దాడులు చేశారు. ప్రస్తుతం వీఆర్వో బానోజీరావు దొరికిపోయారు. పాతపట్నం మండలం బోరుబద్ర గ్రామానికి చెందిన ఈయన 2008లో నామిని గ్రామ రెవెన్యూ అధికారిగా మెళియాపుట్టి మండలం గొప్పిలి గ్రామ రెవెన్యూలో ఉద్యోగంలో చేరాడు. 11 ఏళ్లపాటు పలు రెవెన్యూ గ్రామాల్లో పనిచేసి, ప్రస్తుతం జాడుపల్లి వీఆర్వోగా చేస్తున్నాడు.
ఈ నేపథ్యంలో బాణాపురం పంచాయతీ సుజ్జని గ్రామానికి చెందిన బమ్మిడి కృష్ణారావు సెప్టెంబర్‌లో 82 సెంట్లు భూమి కొనుగోలు చేశాడు. దానికి సంబంధించి మ్యూటేషన్, పాస్‌పుస్తకానికి దరఖాస్తు పెట్టాడు. తహసీల్దార్ దామోదరావును కలిసినా ఇవ్వలేదు. చివరకు వీఆర్వోను సంప్రదించగా పలుమార్లు తిప్పించుకుంటూ రూ.3 వేలు ఇస్తే పాస్‌పుస్తకం ఇస్తానని తేల్చి చెప్పాడు. ఈ విషయమై ఏసీబీ అధికారులను బాధితుడు ఆశ్రయించాడు. శ్రీకాకుళం ఏసీబీ డీఎస్పీ బీవీఎస్‌ఎస్ రమణమూర్తి ఆధ్వర్యంలో సీఐలు భాస్కరరావు, హరి, ఎస్‌ఐలు సుబ్బారావు, చిన్నంనాయుడు శుక్రవారం అవినీతి చేపను పట్టుకోవడానికి రంగం సిద్ధం చేశారు. ఇందులో భాగంగా కృష్ణారావుతో ఫోన్ చేయించగా, తహసీల్దార్ కార్యాలయం సమీపాన అద్దె ఇంట్లో ఉన్నానని, వచ్చి కలవాలని వీఆర్వో సూచించాడు. అక్కడ రూ.3 వేలు తీసుకుంటుండగా, అప్పటికే మాటు వేసిన ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నగదును స్వాధీనం చేసుకుని, ఫింగర్ ప్రింట్‌ను తీసుకున్నారు. వీఆర్వో ఉంటున్న ఇంట్లో తనిఖీలు చేయగా 70 పాస్‌పుస్తకాలు దొరికాయి. వాటిని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తహసీల్దార్ ఎస్ దామోదరావును, డిప్యూటీ తహసీల్దార్ ప్రసాద్‌ను రప్పించి విచారణ చేశారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి మాట్లాడుతూ మ్యూటేషన్, పాస్‌పుస్తకాల కోసం రూ.3 వేలు లంచం డిమాండ్ చేశారని, పక్కా ప్రణాళికతో వీఆర్వోను పట్టుకుని కేసు నమోదు చేశామన్నారు. విశాఖపట్నం ప్రత్యేక ఏసీబీ కోర్టులో శనివారం హాజరు పరుస్తామన్నారు.
నెలలుగా తిరిగినా∙పుస్తకాలు ఇవ్వలేదు
మూణ్నెల్ల క్రితం మ్యూటేషన్, పాస్‌పుస్తకం కోసం దరఖాస్తు చేశాను. ఇంత వరకు వీఆర్వో పాస్‌పుస్తకం ఇవ్వలేదు. నెలల తరబడి తిరిగినా పట్టించుకోలేదు. పాస్‌పుస్తకం కోసం రూ.3 వేలు డిమాండ్ చేయడంతోనే దిక్కులేక ఏసీబీని ఆశ్రయించాను.– బమ్మిడి కృష్ణారావు, రైతు,సుజ్జని గ్రామం, పాతపట్నం
Comments
Please login to add a commentAdd a comment