చంద్రబాబుకు ఏసీబీ కోర్టు షాక్‌ | ACB Court Gives Shock To Chandrababu Naidu In Disproportionate Assets | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు ఏసీబీ కోర్టు షాక్‌

Published Tue, Nov 19 2019 1:49 AM | Last Updated on Tue, Nov 19 2019 8:01 AM

ACB Court Gives Shock To Chandrababu Naidu In Disproportionate Assets - Sakshi

సాక్షి, అమరావతి : ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు హైదరాబాద్‌ లోని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ప్రత్యేక న్యాయస్థానం గట్టి షాక్‌ ఇచ్చింది. 14 ఏళ్ల క్రితం ఏసీబీ కోర్టులో లక్ష్మీపార్వతి దాఖలు చేసి న ఫిర్యాదుపై తదుపరి విచారణ చేపట్టేందుకు ఏసీబీ కోర్టు అంగీ కరించింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ కేసులో చంద్రబాబు స్టే గడువు ముగియడం, స్టే విష యంలో హైకోర్టు నుంచి ఎలాంటి పొడిగింపు లేకపోవడంతో కేసులో తదుపరి ప్రక్రియను ప్రారంభి స్తామని ఏసీబీ ప్రత్యేక కోర్టు జడ్జి సాంబశివరావు నాయుడు సోమ వారం లిఖితపూర్వక ఉత్తర్వులు జారీ చేశారు. ఫిర్యాదుదారుగా ఉన్నలక్ష్మీపార్వతి సాక్ష్యాన్ని నమోదు చేయాలని నిర్ణయించి తదుపరి విచారణను ఈ నెల 25కి కోర్టు వాయిదా వేసింది.

సివిల్, క్రిమినల్‌ కేసుల్లో స్టే ఆరు నెలలకు మించకూడదని సుప్రీంకోర్టు గత ఏడాది ఇచ్చిన తీర్పును, చంద్రబాబు స్టే గడువు ముగిసిన విషయాన్ని, ఆ స్టేకు ఎలాంటి పొడిగింపు లేకపోవడాన్ని జడ్జి తన ఉత్తర్వుల్లో పొందుపరిచారు. విచారణ సందర్భంగా చంద్రబాబు తరఫు న్యాయవాది జోక్యం చేసుకుంటూ, తదుపరి ఉత్తర్వులు వెలువరించేంత వరకు 2005లో హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులు కొనసాగుతాయని వాదించారు. లక్ష్మీపార్వతి తరఫు న్యాయవాది సురేందర్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ, సివిల్, క్రిమినల్‌ కేసుల్లో స్టే అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గుర్తు చేశారు. ఆ స్టే పొడిగింపు ఉత్తర్వులు లేవని కోర్టుకు వివరించారు. 

పూర్వాపరాలు పరిశీలించి..
ఈ కేసు ప్రస్తుత దశలో చంద్రబాబు తరఫు న్యాయవాది వాదనలు వినిపించేందుకు నిబంధనలు అంగీకరించవని లక్ష్మీపార్వతి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. 2005 మార్చి 14న అప్పట్లో ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను జడ్జి పరిశీలించారు. కేసు విచారణకు స్వీకరించడానికి ముందు దశలో చంద్రబాబు తరఫు న్యాయవాది వాదనలు వినిపించేందుకు వీలులేదన్న ఆ ఉత్తర్వుల్ని జడ్జి పరిగణనలోకి తీసుకున్నారు. 2005లో హైకోర్టు ఇచ్చిన స్టేను పొడిగించని విషయాన్ని, ఈ విషయాన్ని చంద్రబాబు తరఫు న్యాయవాది నిర్ధారించిన విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో, చంద్రబాబు 2005లో తెచ్చుకున్న స్టేను పొడిగిస్తూ హైకోర్టు ఎలాంటి లిఖితపూర్వక ఉత్తర్వులు ఇవ్వలేదని జడ్జి గుర్తు చేశారు. అందువల్ల ఈ కేసులో తదుపరి ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. 

14 ఏళ్లుగా కొనసాగుతున్న స్టే
ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని, దీనిపై ఏసీబీ విచారణకు ఆదేశించాలని కోరుతూ లక్ష్మీపార్వతి 2005లో ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. ఈ ఫిర్యాదుపై పూర్తిస్థాయి విచారణ ప్రారంభించక ముందే చంద్రబాబు ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఫిర్యాదును స్వీకరించడానికి ముందే వాదనలు వినడం సాధ్యం కాదంటూ చంద్రబాబు అభ్యర్థనను ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది. దీనిపై ఆయన హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. కింది కోర్టు ఉత్తర్వులు సవాలు చేస్తున్నప్పుడు క్రిమినల్‌ పిటిషన్‌ దాఖలు చేయడం పరిపాటి.. అయితే చంద్రబాబు రిట్‌ పిటిషన్‌ దాఖలు చేయడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది.

ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన అప్పటి న్యాయమూర్తి డీఎస్‌ఆర్‌ వర్మ ఏసీబీ కోర్టులో విచారణకు సంబంధించిన తదుపరి చర్యలు నిలిపేస్తూ 2005లోనే స్టే ఉత్తర్వులిచ్చారు. స్టే ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ లక్ష్మీపార్వతి అనుబంధ పిటిషన్‌ దాఖలు చేయగా, దానిని హైకోర్టు కొట్టేసింది. అప్పటి నుంచి స్టే కొనసాగుతూ వస్తోంది. సుప్రీం తీర్పు నేపథ్యంలో ఇటీవల ఈ కేసు ఏసీబీ కోర్టు ముందుకు విచారణకొచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో స్టే లేనట్లేనని భావిస్తూ విచారణ కొనసాగింపునకు జడ్జి గోవర్థన్‌రెడ్డి నిర్ణయించారు. లక్ష్మీపార్వతి హాజరుకు ఆదేశాలిచ్చి విచారణ వాయిదా వేశారు. ఆ తరువాత కొద్దిరోజులకే గోవర్థన్‌రెడ్డి బదిలీ అయ్యారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement