విద్యుత్ ఉద్యోగికి ఏసీబీ షాక్
రైతు నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కె.కోటపాడు లైన్ ఇన్‌స్పెక్టర్
కె.కోటపాడు: మండ లంలో అవినీతి అధికారుల వేట కొనసాగుతోంది. 10 నెలల్లో ఇద్దరు రెవెన్యూ అధికారులు లంచం తీసుకుంటూ దొరికిపోగా తాజాగా విద్యుత్ శాఖకు చెందిన లైన్ ఇన్‌స్పెక్టర్ ఏసీబీకి పట్టుపడ్డాడు. కె.కోటపాడు లైన్‌ఇన్‌స్పెక్టర్ ఓ రైతు నుంచి లంచం తీసుకుంటుండగా ఎసీబీ అధికారులు సోమవారం పట్టుకున్నారు. మండలంలో దాలివలస గ్రామానికి చెందిన రైతు బండారు శ్రీనివాసరావుకు చెందిన పొలంలో ఇటీవల తుఫాన్‌కు విద్యుత్ స్తంభం ఒరిగిపోయి వైర్లు కిందికి వాలిపోయి తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనితో ఆయన పలుమార్లు ఈ స్తంభాన్ని మార్చాలంటూ కె.కోటపాడు ఏఈని, లైన్‌ఇన్‌స్పెక్టర్ కె.అప్పాజీబాబును కోరారు. స్తంభం మార్చడానికి రూ. 10 వేలు లంచం ఇవ్వాలని లైన్‌ఇన్‌స్పెక్టర్ డిమాండ్ చేశాడు.
చివరికి రూ.8 వేలకు ఒప్పందం కుదురింది. లైన్‌ఇన్‌స్పెక్టర్ అవినీతికి అడ్డుకట్టవేయాలని భావించిన రైతు ఈనెల 4న ఏసీబీని ఆశ్రయించినట్టు ఏసీబీ డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్ తెలిపారు. దీంతో ముందస్తు ప్రణాళిక ప్రకారం రూ.500 నోట్లు 16 (8 వేలు) ఇచ్చి ఏసీబీ అధికారులు పంపారు. తన పొలంలోకి వస్తే ఒప్పందం మేరకు డబ్బు ఇస్తానని రైతు లైన్‌ఇన్‌స్పెక్టర్‌కు చెప్పడంలో సోమవారం మధ్యాహ్నం వచ్చాడు. పొలంలో డబ్బులు తీసుకుంటుండగా అప్పాజీబాబును పట్టుకున్నట్టు డీఎస్పీ తెలిపారు. కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశామని ఆయన చెప్పారు.