కనిగిరి, న్యూస్‌లైన్ : విద్యుత్‌శాఖ కనిగిరి డివిజన్‌లో అవినీతికి అడ్డూఅదుపూ లేకుండా పోయింది. ఈ డివిజన్‌లో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది నుంచి ఉన్నతాధికారి వరకూ లంచాల మత్తులో జోగుతున్నారు. డివిజన్‌లోని 16 మండలాల్లో సుమారు 34 వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లున్నాయి. కనిగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 13 వేలకుపైగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. డివిజన్ పరిధిలో వివిధ రకాల ట్రాన్స్‌ఫార్మర్లు 8,662 ఉండగా, కనిగిరి, పామూరు విద్యుత్ సబ్‌డివిజన్లలో 100 కేవీ, 75 కేవీ, 65 కేవీ, 32 కేవీ ట్రాన్స్‌ఫార్మర్లు 1,300కుపైగా ఉన్నాయి.
అయితే, తరచూ విద్యుత్ కోతలు, ఓవర్‌లోడ్ కారణంగా వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు అధిక సంఖ్యలో కాలిపోతున్నాయి. డివిజన్‌లో వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు సాగుచేయాలంటే బోర్లపైనే ఆధారపడాల్సి ఉంది. బోర్లు పనిచేయాలంటే విద్యుత్ సరఫరా తప్పనిసరి. దీన్ని ఆసరాగా చేసుకుని విద్యుత్ శాఖాధికారులు, సిబ్బంది కలిసి రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారు. కాలిపోయిన వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌కు మరమ్మతులు చేయాలన్నా..దానిస్థానంలో కొత్తదాన్ని ఏర్పాటు చేయాలన్నా... ఒక రేటు నిర్ణయించి మరీ రైతుల నుంచి వసూలు చేస్తున్నారు. అంతేగాకుండా కొత్త కనెక్షన్ల మంజూరుకు, కొత్త లైన్ ఏర్పాటుకు, స్తంభాల మార్పునకు... ఒక్కో పనికి ఒక్కో రేటు నిర్ణయించి వినియోగదారుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. అడిగినంతా ఇవ్వకుంటే పనిచేయకుండా కుంటిసాకులు చెబుతూ కార్యాలయం చుట్టూ రైతులను తిప్పుకుంటున్నారు.
ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోతే పండగే...
ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోతే విద్యుత్ సిబ్బంది నుంచి అధికారుల వరకూ పండగే అన్నట్టుగా కనిగిరి డివిజన్‌లో పరిస్థితి నెలకొంది. డివిజన్‌లో రెండేళ్ల నుంచి తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా బోర్లపైనే ఆధారపడి రైతులు సాగుచేస్తున్నారు. దీంతో ట్రాన్స్‌ఫార్మర్లు తరచూ కాలిపోతున్నాయి. ఒక 100 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ పరిధిలో కనీసం 20 నుంచి 25 వరకు వ్యవసాయ కనెక్షన్లు ఉంటాయి. అదిగానీ కాలిపోతే రైతులు సాగుచేస్తున్న పంటలు ఎండిపోవడం ఖాయం. దీంతో ఎంతోకొంత లంచమిచ్చయినా ట్రాన్స్‌ఫార్మర్‌కు వెంటనే మరమ్మతులు చేయించుకోవాలని రైతులు చూస్తున్నారు. ఈ పరిస్థితే విద్యుత్ సిబ్బంది పాలిట వరంగా మారింది.
నిబంధనల ప్రకారం ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోయినా..చెడిపోయినా.. పట్టణ పరిధిలో అయితే 24 గంటల్లో, రూరల్ పరిధిలో ఉంటే 48 గంటల్లో సమస్యను పరిష్కరించాలి. కానీ, కనిగిరి డివిజన్‌లో ఎక్కడా కూడా ఇలా జరగడం లేదు. రైతులు, వినియోగదారులను వారం నుంచి పది రోజుల పాటు కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారు. చెడిపోయిన ట్రాన్స్‌ఫార్మర్‌ను రైతులే స్వయంగా కార్యాలయానికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. లంచమిస్తేనే పనిచేసి పంపుతున్నారు. ఎవరైనా నిబంధనలను గుర్తుచేసి ఎదురుప్రశ్నిస్తే వారికి తిప్పలు తప్పవు. అలాచేస్తే నీరందక పంటలు ఎండుతాయేమోనన్న భయంతో కిమ్మనకుండా అడిగినంతా ఇచ్చి పని చేయించుకుని వస్తున్నారు. సిబ్బంది అవినీతిలో అధికారులకూ వాటాలుంటాయి.
బహిరంగంగానే షిఫ్ట్ ఆపరేటర్ పోస్టుల అమ్మకాలు...
డివిజన్‌లోని హనుమంతునిపాడు ఏఈ శివకుమార్‌రెడ్డి ఇటీవల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటనను ఎవరూ మరవకముందే డివిజన్‌లో పనిచేస్తున్న విద్యుత్ శాఖ ఉన్నతాధికారి.. షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులను బహిరంగంగానే బేరం పెట్టినట్లు తెలుస్తోంది. డివిజన్‌లో ఖాళీగా ఉన్న 25 షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులకు ఒక్కోదానికి 4 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నాలుగు పోస్టులను అమ్ముకున్నట్లు కూడా తెలిసింది. 4 లక్షల రూపాయలు ఇచ్చిన నలుగురిని షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులకు నియమించేందుకు ఆఘమేఘాలపై ఫైలు సిద్ధం చేసినట్లు సమాచారం. ఇదంతా బహిరంగంగానే జరుగుతున్నప్పటికీ జిల్లాస్థాయి అధికారులెవరూ పట్టించుకోకపోవడంపై అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా విద్యుత్ శాఖ జిల్లాస్థాయి అధికారులు క ళ్లుతెరిచి కనిగిరి డివిజన్‌లో అధికారులు, సిబ్బంది అవినీతికి అడ్డుకట్ట వేయాలని రైతులు, వినియోగదారులు కోరుతున్నారు.
విద్యుత్ శాఖలో అవినీతి షాక్..!
Published Thu, Jun 5 2014 1:10 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement