ఏసీబీకి చిక్కిన ఎలిగేడ్ ఎంఈవో | ACB entrapped possible MEO | Sakshi
Sakshi News home page

ఏసీబీకి చిక్కిన ఎలిగేడ్ ఎంఈవో

Published Thu, Dec 19 2013 3:40 AM | Last Updated on Sat, Sep 2 2017 1:45 AM

ఎలిగేడ్ మండల ఇన్‌చార్జి విద్యాధికారి ఎర్రం రమేశ్ ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుల వద్ద రూ.10వేలు లంచం తీసుకుంటూ బుధవారం రాత్రి కరీంనగర్‌లో ఏసీబీ అధికారులకు చిక్కాడు.

కరీంనగర్ క్రైం, న్యూస్‌లైన్ : ఎలిగేడ్ మండల ఇన్‌చార్జి విద్యాధికారి ఎర్రం రమేశ్ ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుల వద్ద రూ.10వేలు లంచం తీసుకుంటూ బుధవారం రాత్రి కరీంనగర్‌లో ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ టి.సుదర్శన్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ విద్యానగర్‌కు చెందిన రమేశ్‌బాబు షీలా ఆర్గనైజేషన్ రూరల్ టెక్నాలజీ అనే స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నాడు. రాజీవ్ విద్యామిషన్ ఆధ్వర్యంలో బడి మానివేసిన విద్యార్థుల వివరాలు సేకరిస్తున్నారు.
 
 ఎలిగేడ్, జూలపల్లి మండలాల విద్యార్థుల వివరాలను సేకరించే ప్రాజెక్టును షీలా ఆర్గనైజేషన్ రూరల్ టెక్నాలజీ సంస్థ చేపట్టింది. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత బిల్లుల కోసం రమేశ్‌బాబు ఆయా గ్రామాల్లో విద్యార్థుల సర్వే చేపట్టినట్టు సర్పంచులు, కార్యదర్శుల సంతకాలు తీసుకున్నారు. వీటిని చివరకు ఎంఈవో ఆమోదం తెలిపితే బిల్లులు మంజూరు అవుతాయి. ఇందుకోసం రమేశ్‌బాబు ఎలిగేడ్ మండల ఇన్‌చార్జి ఎంఈవోగా పనిచేస్తున్న సుల్తాన్‌పూర్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు ఎర్రం రమేశ్‌ను సంప్రదించాడు.
 
 సంతకాల కోసం తనకు రూ.10 వేలు ఇవ్వాలని రమేశ్ డిమాండ్ చేస్తూ ఫైళ్లను పెండింగ్‌లో పెట్టాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. వారి సూచన మేరకు.. లంచం డబ్బులు ఇస్తానంటూ బుధవారం ఎంఈవోకు ఫోన్ చేశాడు. కరీంనగర్ జ్యోతినగర్‌లో నివాసం ఉంటున్న ఎంఈవో రమేశ్ రాత్రి 8గంటల ప్రాంతంలో కరీంనగర్ కూరగాయల మార్కెట్‌లోని శ్రీరామ సైకిల్ స్టోర్ వద్దకు రమ్మని అక్కడ తన బావ సదాశివరెడ్డి ద్వారా రూ.10వేలు తీసుకున్నాడు. వెంటనే ఏసీబీ అధికారులు రంగప్రవేశం చేసి ఎంఈవో రమేశ్, సదాశివరెడ్డిని పట్టుకున్నారు. డబ్బును స్వాధీనం చేసుకుని నిందితులను ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఇద్దరిపైనా కేసు నమోదు చేసి గురువారం ఏసీబీ కోర్టులో ప్రవేశపెడతామని సుదర్శన్‌గౌడ్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement