రవికుమార్ ఇంటిలో సోదాలు చేస్తున్న ఏసీబీ సిబ్బంది అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ రవికుమార్
విశాఖ క్రైం: కానిస్టేబుల్‌గా విధుల్లో చేరాడు... అక్కడి నుంచి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ స్థాయికి చేరాడు... ఈ మధ్యలో అందినకాడికి దోచుకుని కోట్ల రూపాయలకు పడగలెత్తాడు. అలా అక్రమార్జనతో భారీగా స్థిరాస్తులు సంపాదించి ఏసీబీకి చిక్కాడు ఏఎంవీఐ కొత్తపల్లి రవికుమార్. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలతో ఏసీబీ అధికారులు మంగళవారం తెల్లవారుజాము నుంచి విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్‌తోసహా 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు జరిపారు. ఏసీబీ డీఎస్పీ కె.రామకృష్ణప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం... విజయనగరం జిల్లా అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ కొత్తపల్లి రవికుమార్‌కు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు సమాచారంతో విశాఖలోని శ్రీహరిపురం కోరమాండల్ గేటు వద్ద ఉన్న రవికుమార్ ఇంటిలో, గాజువాక, కుర్మన్నపాలెం, సీతమ్మధార టీఎస్‌ఎన్ కాలనీ, ఇసుకతోటలోని బంధువుల ఇళ్లుతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్‌లో రవికుమార్ అన్నయ్య ఇల్లు, విజయనగరం రవాణా శాఖ కార్యాలయంలో నాలుగు జిల్లాలకు సంబంధించిన ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఈ సందర్భంగా స్థిరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లుతోపాటు ఇంటిలో 120 గ్రాముల బంగారం, ఇండియన్ బ్యాంక్ లాకరులో 399 గ్రాముల బంగారు ఆభరణాలు, 180 గ్రాముల వెండి, బ్యాంక్ బ్యాలెన్స్ రూ.55వేలు ఉన్నట్లు గుర్తించామని డీఎస్పీ రామకృష్ణప్రసాద్ తెలిపారు. రెండు కార్లు, ఒక బైక్ స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశామని తెలిపారు. ఇప్పటి వరకు గుర్తించిన ఆస్తుల విలువ ప్రభుత్వ ధర ప్రకారం రూ.2కోట్లుపైగా ఉంటుందని... బహిరంగ మార్కెట్లో మాత్రం రూ.30 కోట్లుపైనే ఉంటుందని వెల్లడించారు.
విజయనగరం రవాణా శాఖ కార్యాలయంలో సోదాలు చేశామని తెలిపారు. సోదాల్లో సీఐలు ఎం.వి.గణేష్, రమణమూర్తి, గొలగాని అప్పారావు, ఎం.మహేశ్వరరావు, గఫూర్, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
28 ఏళ్లు... రూ.30 కోట్లకుపైగా అక్రమార్జన
విశాఖపట్నానికి చెందిన కొత్తపల్లి రవికుమార్ 1990లో రవాణా శాఖలో కానిస్టేబుల్‌గా విధుల్లో చేరాడు. అనంతరం విశాఖ నగరంలోని గాజువాక, మర్రిపాలెంలోని రవాణా శాఖ కార్యాలయాల్లో 20 ఏళ్లుకుపైగా ఆయన పనిచేశారు. నాలుగేళ్ల కిందట 2014లో ఏఎంవీఐగా పదోన్నతిపై విజయనగరం బదిలీ అయ్యారు. అయితే విజయనగరం రవాణా శాఖలో కీలకంగా చక్రం తిప్పుతూ ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్లు తీవ్రమైన ఆరోపణలున్నాయి. ఏసీబీ అధికారులు చెబుతున్న దాని ప్రకారం 28 ఏళ్ల సర్వీసులో రవికుమార్ రూ.30కోట్లకుపైగా ఆస్తులు కూడబెట్టాడు.
గుర్తించిన ఆస్తులివీ...
♦ మల్కాపురం అజంతకాలనీలో 1040 చదరపు అడుగుల విస్తీర్ణం గల ప్లాట్.
♦ మహారాణిపేటలోని వేంకటేశ్వరనగర్‌లో 44.19 చదరపు గజాల ఇంటి స్థలం.
♦ రవికుమార్ భార్య కొత్తపల్లి ఇందిరా ప్రియదర్శిని పేరుమీద మహారాణిపేట వేంకటేశ్వరనగర్‌లో 60 చదరపు గజా ల విస్తీర్ణంలోని మూడు ఇళ్ల స్థలాలు 2017లో కొనుగోలు చేశారు.
♦ విశాఖ బీచ్‌లోని నోవాటెల్ సమీపంలో 180 చదరపు గజాల విస్తీర్ణంలో గల స్థలంలో నిర్మిస్తున్న జీ ప్లస్ 1 భవనం. ఇక్కడే మరో ఖరీదైన ఇల్లు ఉంది.
♦ ఆరిలోవ శ్రీకాంత్‌నగర్‌లో 124 చదరపు గజాల విస్తీర్ణంలో జీ ప్లస్ 1 భవనం.
♦ భీమిలి నియోజకవర్గంలోని కాపులుప్పాడ సమీప తిమ్మాపురంలో 144 చదరపు గజాల ఇంటి స్థలం.
♦ అదే గ్రామంలో మరో 145 చదరపు గజాల ఇంటి స్థలం.
♦ అక్కడే మరో 100 చదరపు గజాల ఇంటి స్థలం.
♦ విజయగనరం జిల్లా వేపాడ మండలం జాకీర్ గ్రామంలో 0.62 సెంట్లు స్థలం.
♦ విశాఖ జిల్లా అచ్యుతాపురంలో 0.17 సెంట్లు స్థలం ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment