
సాక్షి, విశాఖపట‍్టణం : ఆంధ్రప్రదేశ్ ప్రధాన నగరాల్లో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) సోమవారం సోదాలు చేసింది. విశాఖపట‍్టణం టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్ ఎన్ వీ రఘు ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్టు వచ్చిన ఫిర్యాదు మేరకు తాము రంగంలోకి దిగినట్లు అధికారులు చెబుతున్నారు. రఘు బంధువుల ఇళ్లలో కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి.
మంగళగిరి, విజయవాడ, షిర్డీ, నెల్లూరు, తిరుపతి, విశాఖపట్టణం, రాజానగరం(తూ.గో.) ఇలా ఏకకాలంలో 15 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పెద్ద మొత్తంలోనే రఘు ఆస్తులను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.
విజయవాడలో కూడా...
విజయవాడలో మున్సిపల్ టౌన్ ప్లానింగ్ సూపరిండెంట్ నల్లూరి వెంకటశివప్రసాద్ నివాసంలో సోమవారం ఉదయం ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. విజయవాడతోపాటు గన్నవరంలోగల ఆయన ఇళ్లలో కూడా ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ సందర్బంగా కోట్లు విలువ చేసే ఆస్తులను ఆయన కలిగి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సోదాలు పూర్తయిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ తెలిపింది.