
తిరుగు ప్రయాణంలో విషాదం
కల్వర్టును ఢీకొన్న కారు
ఇద్దరు మృతి
ఓర్వకల్లు, న్యూస్‌లైన్:
బంధువుల వివాహానికి హాజరై సం తోషంగా తిరిగి వెళ్తున్న వారిని మృత్యువు కబళించింది. కర్నూలు - చిత్తూరు జాతీయ రహదారిపై నన్నూరు సమీపంలో శనివారం ఉదయం జరిగిన ప్రమాదం రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృత్యువాత పడ్డారు.
కోవెలకుంట్ల మండలం గోవిందపల్లెకు చెందిన వెంకటేశ్వరరెడ్డి(30), శివశంకర్‌రెడ్డి వరుసకు బంధువులు. కొద్ది సంవత్సరాల క్రితం వీరు వ్యాపారం నిమిత్తం హైదరాబాద్ కూకట్‌పల్లిలో స్థిర పడ్డారు. బంధువుల వివాహానికి హాజరయ్యేందుకు కుటుంబ సభ్యులతో కలసి వీరు గురువారం కారులో గోవిందపల్లెకు చేరుకున్నారు. శుక్రవారం జమ్ములమడుగులో జరిగిన సమీప బంధువుల పెళ్లికి వెళ్లి అదే రోజు రాత్రి స్వగ్రామానికి తిరిగి వచ్చారు.
రెండు రోజుల పాటు బంధువులు, కుటుంబ సభ్యులతో సరదాగా గడిపిన వారు శనివారం ఉదయాన్నే కారులో హైదరాబాద్‌కు బయల్దేరారు. మార్గమధ్యంలో నన్నూరు సమీపంలో కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొంది. ఈ సంఘటనలో అందులో ప్రయాణిస్తున్న వెంకటేశ్వరరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతుని సోదరి (అక్క) హైమావతి, శివశంకర్‌రెడ్డి భార్య పద్మావతి(34) తీవ్రంగా గాయపడ్డారు. వీరిని కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ పద్మావతి మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విజయలక్ష్మి తెలిపారు.