
విజయ్‌కుమార్
కర్నూలు (అగ్రికల్చర్): పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని ఓ యువకుడు నిరూపించారు. చిన్నతనం నుంచి క్రమశిక్షణ, తల్లిదండ్రులు, గురువుల సలహాలు, సూచనలు పాటిస్తూ మొదటి ప్రయత్నంలోనే ఆంధ్రపదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూపు–2 ద్వారా వ్యవసాయాధికారి పోస్టు సాధించారు. కర్నూలులో గుత్తి పెట్రోలు బంక్ ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలోని రామకృష్ణనగర్‌కు చెందిన వి.వెంకటేశ్వర్లు, రమాదేవి దంపతుల కుమారుడు వి.విజయ్‌కుమార్ అనంతపురం జిల్లా యాడికి మండల వ్యవసాయాధికారిగా నియమితులయ్యారు. తండ్రి ట్రెకోడెర్మా విరిడి కేంద్రాన్ని నడుపుతూ సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుండగా, కుమారుడు కూడా వ్యవసాయాధికారిగా ఎంపిక కావడం విశేషం.
విజయ్‌కుమార్ 10వ తరగతి వరకు కర్నూలు సర్వేపల్లి విద్యానిలయంలో చదువుకున్నారు. ఇంటర్ మీడియట్ కర్నూలులోనే రత్నం కాలేజీలో చదివారు. ఎంసెట్ ద్వారా మహానంది వ్యవసాయ కళాశాలలో అగ్రికల్చర్ బీఎస్సీలో సీటు సాధించి అక్కడే ఎంఎస్సీ అగ్రికల్చర్ కూడా పూర్తి చేశారు. ఆ తర్వాత 2017 ఏప్రిల్‌లో గ్రూపు–2 వ్యవసాయాధికారి టెక్నికల్ నోటిఫికేషన్ వెలువడటంతో ఎలాగైనా పోస్టు సాధించాలని కష్టపడ్డాడు. ఎలాంటి కోచింగ్ లేకుండానే రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంకు సాధించి వ్యవసాయాధికారిగా ఎంపికయ్యారు. తల్లిదండ్రులు, గురువులు ఇచ్చిన ప్రోత్సాహంతో వ్యవసాయాధికారిగా ఎంపికయ్యాయని విజయకుమార్ చెబుతున్నారు. వ్యవసాయంలో రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు సాధించేందుకు కృషి చేస్తానంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment