పాఠశాలలపై ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి : ఏఐఎస్‌ఎఫ్
అనంతపురం : ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలలపై ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోంది. మౌలిక సదుపాయాలు కల్పించడంలో అటు ప్రభుత్వం ఇటు అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమయ్యిందని ఏఐఎస్‌ఎఫ్ నాయకులు ధ్వజమెత్తారు. మౌలిక సదుపాయాలు కల్పించాలనే డిమాండ్‌తో మంగళవారం అనంతపురం కలెక్టరేట్ ఎదురుగా అర్ధనగ్నంగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు జాన్సన్‌బాబు మాట్లాడుతూ.. ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం లేదన్నారు. ముఖ్యంగా బాలికలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.
సమస్యలను ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకొచ్చినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. వేల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థల్లోనూ మౌలిక సదుపాయాలు అంతంతమాత్రమే అన్నారు. యాజమాన్యాలతో అధికారులు లాలూచిపడి పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో శ్రీరాములు, మురళీ, పవన్, సాయి, రాజశేఖర్, చరణ్, దాదాపీరా, హరికృష్ణ, కుమార్, గణేశ్, తదితరులు పాల్గొన్నారు.