రాజధాని ప్రాంతంలో నకిలీ పత్రాలతో భూముల క్రమవిక్రయాలకు ప్రయత్నాలు జరుగుతున్నాయని...
సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని ప్రాంతంలో నకిలీ పత్రాలతో భూముల క్రమవిక్రయాలకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఆర్‌డీఏ శనివారం ఒక ప్రకటనలో అప్రమత్తం చేసింది. ముసాయిదా భూసమీకరణ పథకం నోటిఫికేషన్ ఇప్పటి వరకూ నేలపాడు గ్రామానికే ఇచ్చామని పేర్కొంది. 30 రోజుల అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత రైతులు తమ వాటా ప్లాట్ల కోసం ఒక్కరిగా 9.18ఏ, ఉమ్మడిగా 9.18బీ దరఖాస్తు ఫారాల్లో కోరుకున్న స్థలాలు లాటరీ ద్వారా నిర్ణయించి భూసమీకరణ యాజమాన్య పత్రం రిజిష్ట్రేషన్ చేస్తామని వివరించింది.
అలా రిజిష్ట్రేషన్ పొందిన భూ యజమానికి మాత్రమే దానిపై అర్హత ఉంటుందని స్పష్టం చేసింది. కొందరు వ్యక్తులు పేదల ఆక్రమణలో ఉన్న భూములు, అసైన్డ్ పట్టాలు, లంక భూములను అనధికారికంగా కొనుగోలు చేసి..లబ్ధిదారునికి ధ్రువీకరణ పత్రం వచ్చాక రిజిష్ట్రేషన్ చేయాలని ఒత్తిడి చేసే అవకాశముందని పేర్కొంది. అలాంటి భూములను కొనుగోలు చేయకుండా జాగ్రత్త వహించాలని సూచించింది. ఇప్పటి వరకూ రాజధాని ప్రాంతంలో భూసమీకరణ యాజమాన్య ధ్రువపత్రాలు ఇవ్వలేదని, ఈ పత్రంపై సీఆర్‌డీఏ కమిషనర్ సంతకం ఉండదని పేర్కొంది. కాంపిటెంట్ అథారిటీ, రిజిష్ట్రేషన్ శాఖ, మండల కార్యాలయాలను సంప్రదించి సంబంధించి ప్లాటును చూసి, దాని నంబరు, కొలతలు, జీపీఎస్ రీడింగ్‌లు తెలుసుకుని కొనుగోలు చేయాలని తెలిపింది.