కలెక్టరేట్, న్యూస్‌లైన్ :
సాధారణ ఎన్నికలు ముంచుకొస్తుండటంతో మూడేళ్లు ఒకేచోట పనిచేస్తున్న అధికారుల బదిలీకి రంగం సిద్ధమైంది. రెవెన్యూ, పోలీస్‌శాఖ అధికారులతోపాటు ఎంపీడీవోలను కూడా బదిలీ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇందుకు జీవో ఎంఎస్ నంబర్ 18న విడుదలైంది. సొంత జిల్లా అధికారులైతే బదిలీపై వచ్చి ఒక్కరోజు విధులు నిర్వర్తించినా ఇతర జిల్లాల అధికారులను నియమించాలని జీవోలో పేర్కొన్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులు బదిలీకి అవకాశం ఉన్న అధికారుల వివరాలు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు.
66 మంది బదిలీ అయ్యే అవకాశం
జిల్లా నుంచి దాదాపు 66 మంది అధికారులు బదిలీ అయ్యే అవకాశం ఉంది. జిల్లాలోని 31 మంది తహశీల్దార్లతోపాటు జిల్లాలోని ఆయా ప్రధాన హోదాలో ఉన్న 10 మంది పరిపాలన అధికారులు కూడా బదిలీ కానున్నారు. సస్పెన్షన్‌లో ఉన్న నలుగురు తహశీల్దార్ల వివరాలు కూడా ప్రభుత్వానికి పంపారు. అయితే ప్రభుత్వం జోన్ పరిధిలో ఏదో ఒక జిల్లాకు అధికారులను బదిలీ చేయాల్సి ఉంది. జిల్లాలో మొత్తం 29 మంది ఎంపీడీవోలు ఉన్నారు. వీరిలో ఇద్దరు వచ్చే రెండు నెలల్లో రిటైర్‌మెంట్ కావాల్సి ఉండగా, మరో ఇద్దరు ఎంపీడీవోలు నూతనంగా విధుల్లో చేశారు. ఆ నలుగురిని మినహాయిస్తే మిగతా 25 మంది ఎంపీడీవోల వివరాలను ప్రభుత్వానికి పంపించారు. జిల్లా నుంచి 41 మంది రెవెన్యూ అధికారులు, 25 మంది ఎంపీడీవోలు బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
రెండు రోజుల్లో బదిలీ ఉత్తర్వులు
జిల్లా అధికారుల బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులు రెండు రోజుల్లో వెలువడనున్నట్లు సమాచారం. అధికారుల బదిలీలు ఫిబ్రవరి 10లోగా పూర్తి చేయాలని ఇటీవల ఎన్నికల సంఘం ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే జిల్లా నుంచి వేరే జిల్లాకు బదిలీ అయినా తరువాత ఎన్నికల అనంతరం ఇదే జిల్లాకు బదిలీ చేయించుకునే అవకాశాలు ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు.
బదిలీలకు రంగం సిద్ధం
Published Fri, Jan 31 2014 6:10 AM | Last Updated on Sat, Sep 2 2017 3:13 AM
Advertisement