‘రేసుగుర్రం’ కాదు..రెక్కలగుర్రం ఎక్కినంత సంతోషంగా ఉంది..
మీ అభిమానం చూస్తుంటే.. ‘రేసుగుర్రం’ కాదు..రెక్కలగుర్రం ఎక్కినంత సంతోషంగా ఉంది..రాజమండ్రిలో శుక్రవారం ‘జాయ్ అలుక్కాస్’ షోరూమ్‌ను ప్రారంభించడానికి వచ్చిన సందర్భంగా తనను చూసేందుకు పోటీపడ్డ అభిమానులకు అభివాదం చేస్తున్న హీరో అల్లు అర్జున్.
జాయ్ అలుక్కాస్ షోరూం ప్రారంభం
ప్రముఖ వజ్రాభరణాల వ్యాపార సంస్థ జాయ్ అలుక్కాస్ కొత్త షోరూంను రాజమండ్రిలో శుక్రవారం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రారంభించారు. శ్యామలా సెంటర్‌లో ఈ షోరూం ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత తిరుపతిలో ఉదయం 10.30 గంటలకు జాయ్ అలుక్కాస్ నూతన షోరూంను ప్రారంభించిన అనంతరం 2.30 గంటలకు విమానంలో మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్నారు. రోడ్డు మార్గంగుండా రాజమండ్రి చేరుకుని ఓ హొటల్‌లో విశ్రాంతి తీసుకున్న అనంతరం సాయంత్రం ఐదు గంటలకు రాజమండ్రి షోరూంకు చేరుకున్నారు.
ముందుగా రిబ్బన్ కట్ చేసి షోరూంను ప్రారంభించిన బన్నీ..అనంతరం ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద నగర మేయర్ పంతం రజనీ శేషసాయి, అర్బన్ ఎస్పీ రవికుమార్ మూర్తితో కలిసి దీపారాధన చేశారు. ఆతర్వాత షోరూంలో నగల ప్రదర్శనను వీక్షించారు. కోనుగోలు చేసేందుకు వచ్చిన వారికి నగలు అందించారు. అనంతరం బయట తన కోసం ఎదరు చూస్తున్న అభిమానులను ఉద్దేశించి అర్జున్ మాట్లాడారు.
అలుక్కాస్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడం తన అదృష్టంగా పేర్కొన్నారు. షోరూం ప్రారంభోత్సవానికి రాజమండ్రి వచ్చే భాగ్యాన్ని కలుగచేసిన సంస్థ నిర్వాహకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నగర మేయర్ పంతం రజనీ శేషసాయి మాట్లాడుతూ ప్రముఖ వజ్రాభరణాల సంస్థ రాజమండ్రిలో వ్యాపార విభాగాన్ని ప్రారంభించడం శుభ పరిణామమన్నారు. సంస్థ నిర్వాహక ప్రముఖులు పాల్గొన్నారు.
- సాక్షి, రాజమండ్రి
నాకు కొడుకు పుట్టాడు
సాక్షి, రాజమండ్రి : ‘నాకు మొన్ననే కొడుకు పుట్టాడు. వాడి ఫొటోలు తొందర్లో నే మీకోసం రిలీజ్ చేస్తా’ అంటూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన పుత్రోత్సాహాన్ని రాజమండ్రిలో అభిమానులతో పంచుకున్నారు. ప్రముఖ వజ్రాభరణాల విక్రయ సంస్థ జాయ్ అలుక్కాస్ షోరూంను రాజమండ్రిలో ప్రారంభించేందుకు వచ్చిన అర్జున్‌కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. శ్యామలా సెంటర్‌లో షోరూం ప్రారంభం అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన వేదికపై ఎక్కి అర్జున్ తన అభిమానులతో మాట్లాడారు. అభిమానులను చూసి ‘దేవుడా’ అంటూ రేసుగుర్రం డైలాగు చెప్పడంతో జనం కేరింతలు కొట్టారు.
స్టెప్పులు వేయాలంటూ కేకలు వేశారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తాను నటిస్తున్న సినిమా త్వరలో మీముందుకు రాబోతోందని వెల్లడించారు. తన రేసుగుర్రం గురువారంతో వంద రోజులు పూర్తిచేసుకుందని, అంతటి ఘన విజయాన్ని అందచేసిన అభిమానులకు థ్యాంక్స్ చెబుతున్నానన్నారు. తన పట్ల రాజమండ్రి ప్రజలు ఎప్పుడూ ప్రత్యేక అభిమానం చూపుతారన్నారు.. తనకు కూడా రాజమండ్రి అంటే అభిమానం ఎక్కువని అన్నారు. తాను జాయ్ అలుక్కాస్ షోరూంలను చాలా చోట్ల ప్రారంభించానని, రాజమండ్రిలో వచ్చిన జనం ఎక్కడా చూడలేదని బన్ని ముచ్చట పడిపోయారు.