దీర్ఘకాలిక సెలవుపై జేసీ..!
Published Wed, Dec 4 2013 3:29 AM | Last Updated on Sat, Sep 2 2017 1:13 AM
సాక్షి ప్రతినిధి, విజయనగరం:జిల్లాలో దాదాపు రెండున్నరేళ్లుగా పని చేస్తున్న జాయింట్ కలెక్టర్ శోభ దీర్ఘ కాలిక సెలవుపై వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అధికారులు వారం పది రోజులు లేదా నెల రోజుల పాటు సెలవుపై వెళ్లడం పరిపాటి. అయితే జేసీ ఏకంగా ఆరు నెలల పాటు సెలవు కావాలని దరఖాస్తు చేయడంపై అధికారవర్గాలు విస్మ యం వ్యక్తం చేస్తున్నాయి. విధి నిర్వహణలో ముక్కు సూటిగా వ్యవహరిస్తారని, నిబంధనలు అమలు చేయడంలో నిక్కచ్చిగా ఉంటారని గుర్తింపు పొందిన శోభ ఇప్పుడు హఠాత్తుగా ఎందుకు ఈ నిర్ణయంతీసుకున్నారన్న దానిపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
జిల్లాలో ఇటీవల పెద్ద ఎత్తున ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించిన బియ్యం పక్కదారి పట్టిన విషయం అందరికీ తెలిసిందే. బాడంగి, గంట్యా డ, తెర్లాం, గజపతినగరం తదితర మండలాల్లో బియ్యం పక్కదారి పడుతుండగా అధికారులు పట్టుకున్నారు. జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థను నియంత్రించేది జాయింట్ కలెక్టరేనన్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆమె ఇలాంటి తప్పుడు వ్యవహారాల పై కఠినంగా వ్యవహరించి నిందితులపై చర్యలకు ఉపక్రమించారు. దీంతో ఆయా వర్గాల్లో కలవరం మొదలైంది. ఆమెను నియంత్రించాలని, కేసుల నుంచి తమను రక్షించాలని సదరు రేష న్ డీలర్లు, మిల్లర్లు ఏకమై రాజకీయ వర్గాలను ఆశ్రయించారు.
ఇలాంటి ఘ టన జరిగిన ప్రతిసారి బాధ్యులు అధికార పార్టీ నేతలను ఆశ్రయించడం పరిపాటిగా మారింది. ఇలాంటి వాటిని చూసీ చూడనట్లుగా వదిలేయాలని అధికార పార్టీ నేతల నుంచి పలుమార్లు సిఫారసులు వచ్చినప్పటికీ ఆమె ఖాతరు చేయనట్లు తెలిసింది. దీంతోపాటూ రెవెన్యూ సంబంధ విషయాల్లోనూ శోభ నిక్కచ్చిగా వ్యవహరించి ఆ నేతలకు ఇబ్బందికరంగా పరిణమించారు. దీంతో ఆమెపై ఒత్తిళ్లు అధికమయ్యాయి. ఈ నేపథ్యంలో సెలవు పెట్టినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా తన వ్యక్తిగత కారణాలపై సెలవు పెడుతున్నట్టు దరఖాస్తు చేసినట్లు తెలిసింది. సర్కారు నుంచి అనుమతి రాగానే ఆమె సెలవు పై వెళ్లనున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ పరిణామం అధికారవర్గాల్లో చర్చకు దారితీసింది.
Advertisement