
చంద్రబాబు చేసిన మోసాలకు నిరసనగా నల్ల జెండా పాతుతున్న అసైన్డ్ భూముల రైతులు
తుళ్లూరు: రాజధాని అసైన్డ్ భూముల రైతులకు తీరని అన్యాయం చేసిన మాజీ సీఎం చంద్రబాబు దళిత ద్రోహిగా మిగిలిపోతారని రాజధాని ప్రాంత అసైన్డ్ భూముల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం రాజధాని గ్రామమైన రాయపూడిలోని సీడ్ యాక్సెస్ రహదారిపై వారు సమావేశమయ్యారు. రాజధానిలో చంద్రబాబు పర్యటనను నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలు, జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తమను తీవ్రంగా మోసగించి.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని రాజధానికి వస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
రాజధాని ప్రకటించాక అసైన్డ్ భూములకు ఏడాది పాటు ప్యాకేజీ, కౌలు చెక్కులు ఇవ్వకుండా టీడీపీ నేతలు, బినామీలతో తప్పుడు ప్రచారాలు చేయించి తమను భయాందోళనలకు గురి చేశారన్నారు. అసైన్డ్ భూములను కారుచౌకగా కొనుగోలు చేశాకే ప్రభుత్వం తమ భూములకు పరిహారం ప్రకటించిందని గుర్తు చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా రాజధానిలో 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని నిధులు ఎందుకు విడుదల చేయలేదో చెప్పాలన్నారు. ఇప్పటికైనా తప్పు చేశానని క్షమాపణ చెప్పాలని లేదంటే చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment