మంగళగిరి టౌన్: అభిప్రాయ సేకరణకు వచ్చిన నిపుణుల కమిటీపై రాజధాని ప్రాంత రైతులు మండిపడ్డారు. మీ సర్వేలన్నీ బూటకమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ప్రభుత్వ ఉద్యోగులతో వేసిన నిఫుణుల కమిటీ.. తమకేమి ప్రయోజనం చేకూరుస్తుందని నిలదీశారు. తక్షణమే గ్రామం నుంచి వెళ్లిపోవాలని తేల్చిచెప్పారు. దీంతో నిడమర్రు గ్రామంలో అభిప్రాయసేకరణకు వచ్చిన నిపుణుల కమిటీ వెనుతిరిగింది. గుంటూరు జిల్లా మంగళగిరి మండల పరిధిలోని నిడమర్రు రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించేందుకు నిఫుణుల కమిటీ గురువారం గ్రామానికి వచ్చింది. ముందస్తు సమాచారం లేకుండా గ్రామంలోకి రావడంతో పాటు కమిటీ నివేదిక సమర్పించేందుకు సమయం పది రోజులే ఉందని తెలియడంతో రైతులు నిపుణుల కమిటీపై మండిపడ్డారు. 2013 భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా సర్వేలు చేయడమే కాకుండా.. ప్రభుత్వ ఉద్యోగులతో నిపుణుల కమిటీని నియమించి రైతులకు ఏం మేలు చేస్తారని ప్రశ్నించారు.
ఎక్స్‌పర్ట్ కమిటీ అర్థమేమిటో చెప్పాలని, అందులో ఎవరుంటారో వివరించాలని డిమాండ్ చేశారు. నిపుణులైన రైతులు లేకుండా కేవలం ఉద్యోగులతోనే కమిటీ ఎలా వేస్తారని ప్రశ్నించారు. రైతుల ప్రశ్నలతో కమిటీ సభ్యులు మిన్నకుండిపోయారు. గతంలో గ్రామంలో నిర్వహించిన ఎస్‌ఐఏ సర్వేనే ఒక తప్పుల తడకగా ఉందని, దాని ఆధారంగా అభిప్రాయాలు ఎలా సేకరిస్తారని రైతులు ప్రశ్నించడంతో.. కమిటీ సభ్యులు చివరకు అక్కడ్నుంచి వెనుతిరిగారు. వైఎస్సార్‌సీపీ స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, రాజధానిలో బూటకపు సర్వేలు నిర్వహించిన టీడీపీ ప్రభుత్వం.. వాటిని అమలుపర్చేందుకు నాటక కమిటీలను రంగంలోకి దించిందని ఎద్దేవా చేశారు. ఇలాంటి కమిటీల వల్ల అన్నదాతలకు ఎలాంటి న్యాయం జరగదని పేర్కొన్నారు. ప్రభుత్వానికి ధైర్యం ఉంటే మళ్లీ సర్వే నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాతే రైతుల నుంచి అభిప్రాయ సేకరణ జరపాలన్నారు. అలాగే నిఫుణుల కమిటీలో మొత్తం ప్రభుత్వ ఉద్యోగులే కాకుండా, నాన్ అఫీషియల్స్‌ను కూడా నియమించాలని డిమాండ్ చేశారు.
భూములిచ్చిన రైతులకే న్యాయం చేయలేదు..
రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకే ప్రభుత్వం ఇప్పటి వరకు న్యాయం చేయలేదు. వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడేమో మా భూములు కాజేసేందుకు తప్పుడు సర్వేలు, తప్పుడు రిపోర్టులు ఇస్తుండటం దారుణం. – వల్లభాపురపు శ్రీనివాసరావు, రైతు
తీసుకున్న భూముల్లో ఏం వెలగబెట్టారు?
రైతులను బెదిరించి తీసుకున్న భూముల్లో ఇప్పటివరకు ఏం వెలగబెట్టారు? జరీ భూముల్లో ఏం నిర్మిస్తారో ప్రభుత్వం ముందే చెప్పాలి. చట్టాలను తుంగలో తొక్కి ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తూ రైతులను మోసం చేస్తుంటే చూస్తూ ఊరుకోం. – ఎం.శివరామ్, రైతు
Comments
Please login to add a commentAdd a comment