నగరి: ఈ ఫొటోలోని వలస కుటుంబానిది.. శ్రీకాళహస్తి. బతుకుదెరువు కోసం ఉపాధి వెతుక్కుంటూ.. ఐదేళ్ల కిందట నగరి మండలం మాంగాడుకి చేరింది. ఇద్దరు పిల్లలున్న వీరు బుక్కెడు బువ్వ కోసం దినదిన గండం ఎదుర్కొంటున్నారంటే అతిశయోక్తి కాదు. కుటుంబ యజమాని సుబ్రమణ్యం మేస్త్రి పని చేస్తున్న సమయంలో ఎడమ కాలికి తీవ్రగాయమైంది. వైద్యులు పరీక్షించి కాలు తీసేయకపోతే ప్రాణానికే ముప్పని తేల్చేశారు. చివరికి కాలు తొలగించి జైపూర్ (కృత్రిమ) కాలు అమర్చారు. అప్పటి నుంచి పని చేసే శక్తిని కోల్పోయి నిస్సహాయంగా మిగిలాడు. అడపాదడపా పనికి పిలిచేవారు సైతం ‘నువ్వేం పనిచేయగలవు..బరువు కూడా ఎత్తలేవు కదా..’ అంటూ చీత్కరించుకునేవారు.
దీంతో బతుకు బండిని లాగేందుకు నానా కష్టాలు పడుతున్నారు. కూర్చుని వ్యాపారం చేసుకునేంత ఆర్థిక స్తోమత వీరికి లేదు. వీరి దుర్భర జీవితానికి తోడు సొంత ఇల్లు కూడా లేక అద్దె గృహంలో ఆపసోపాలు పడుతున్నారు. పైగా ఊరు మారడంతో ఏర్పడిన సాంకేతిక కారణాల వల్ల రేషన్ కార్డు లేక దివ్యాంగ పింఛన్ కూడా వీరికి మంజూరు కాలేదు. ఇలాంటి విపత్కర పరిస్థితులకు తోడున్నట్లుగా సుబ్రమణ్యం భార్య అరుణకు మాటలు రావు. దీంతో ఈమెను కూడా కూలిపనులకు పిలిచే దిక్కులేదు. ఇలాంటి సమయంలో తమ ఇద్దరు పిల్లలు (పెద్దబ్బాయి అఖిల్ 1వ తరగతి చదువుతున్నాడు. పాపకు మూడేళ్లు)కు చదువు చెప్పించడం వీరికి అసాధ్యమైంది. ఇదే తరుణంలో అమ్మఒడి తమ జీవితానికి ఆసరాగా కనిపించిందని, భగవంతుడి ఆశీర్వాదం, జగనన్న తోడ్పాటు వల్ల పిల్లలను బడికి పంపే అవకాశం కలిగిందని సుబ్రమణ్యం, అరుణ దంపతులు ఉబికి వస్తున్న ఆనంద భాష్పాలతో ‘సాక్షి’కి తెలిపారు. తమ వలస జీవితాలకు అమ్మఒడి చుక్కానిలాంటిదని హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment