
సాక్షి, తాడేపల్లి : శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ టీడీపీ నాయకుడిగా వ్యవహరించారని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా మండిపడ్డారు. ఆయన శుక్రవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మండలిలో టీడీపీ సభ్యులు వ్యవహరించిన తీరును ప్రజలు గమనించారన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ కోసం ప్రభుత్వం సభలో రెండు బిల్లులు ప్రవేశపెట్టారని.. పెద్దల సభలు సలహాలు, సూచనలు ఇవ్వాలే కానీ, బిల్లులు చర్చకు రాకుండా రూల్ 71ను తీసుకు వచ్చారన్నారు. 51 శాతం ఓట్లు 86 శాతం సీట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. సభలో మండలి ఛైర్మన్ అనైతికంగా వ్యవహరించారని, ఆయన చైర్‌ను గౌరవించలేదని విమర్శించారు.
సభలో నిబంధనలను అతిక్రమించారని, బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపి చైర్మన్ తప్పు మీద తప్పు చేశారన్నారు. ఛైర్మన్ తీరుపై అన్ని ప్రాంతాల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతుందన్నారు.సభ నిబంధనలకు విరుద్ధంగా సభలో వీడియోలు తీశారని, చంద్రబాబు కనుసన్నల్లోనే మండలి ఛైర్మన్ నిర్ణయం తీసుకున్నారని డిప్యూటీ సీఎం ధ్వజమెత్తారు. కాలయాపన చేయడం కోసమే సెలెక్ట్ కమిటీకి పంపారన్నారు. సభలో టీడీపీ సభ్యులు గూండాలు, రౌడీలుగా వ్యవహరిస్తే చంద్రబాబు వారిని శెభాష్ అని మెచ్చుకోవడం సిగ్గుచేటు అన్నారు. చంద్రబాబుకు కుల రాజకీయాలు చేయడం వెన్నతో పెట్టిన విద్య అని, ఆయన కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.
శవ రాజకీయాలు చేయడంలో చంద్రబాబును మించినవారు దేశంలో మరొకరు ఉండరని అన్నారు. ఛైర్మన్‌ను మంత్రులు కులంపేరుతో తిట్టారని టీడీపీ నేతలు అంటుంటే... ఛైర్మనే స్వయంగా తనను ఎవరూ తిట్టలేదని చెబుతున్నారన్నారు. టీడీపీ నేతలు కావాలనే మతం, కులంతో రాజకీయాలు చూస్తున్నారన్నారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ముస్లింల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. ఈ సందర్భంగా తనను మంత్రులు తిట్టలేదని శాసనమండలి ఛైర్మన్ చెప్పిన వీడియోను మీడియా ఎదుట ప్రదర్శించారు.
ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం మూడు రాజధానులను ముఖ్యమంత్రి ఏర్పాటు చేశారని, ఆ నిర్ణయాన్ని ప్రజలందరూ స్వాగతిస్తున్నారన్నారు. కర్నూలులో హైకోర్టు రాయలసీమ ప్రజల హక్కు అని అన్నారు. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం సీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమ ద్రోహి అయిన చంద్రబాబు... కనీసం సీమలో హైకోర్టు బెంచ్ కూడా ఏర్పాటు చేయలేదని విమర్శించారు. 13 జిల్లాల అభివృద్ధి కోసమే పరిపాలన వికేంద్రీకరణ చేస్తున్నారన్నారు. కర్నూలు అభివృద్ధిపై చంద్రబాబుతో చర్చకు సిద్ధమని ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ సవాల్ విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment