చంద్రబాబు స్వార్థానికి బలయ్యాం! | TDP MLCs Comments On Chandra Naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు స్వార్థానికి బలయ్యాం!

Published Fri, Jan 24 2020 4:30 AM | Last Updated on Fri, Jan 24 2020 2:38 PM

TDP MLCs Comments On Chandra Naidu - Sakshi

సాక్షి, అమరావతి: శాసన మండలిలో పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల విషయంలో చంద్రబాబును నమ్మి మోసపోయాయని, కొరివితో తలగొక్కున్నట్లైందని టీడీపీ సభ్యులు వాపోతున్నారు. చైర్మన్‌ను అడ్డుపెట్టుకుని బిల్లులు చట్టరూపం దాల్చకుండా తాత్కాలికంగా అడ్డుకుని.. తమ పదవులకే ఎసరు తెచ్చుకున్నామని ఆందోళన చెందుతున్నారు. మండలిని రద్దు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయడంతో టీడీపీ ఎమ్మెల్సీలు  అంతర్మథనంలో పడ్డారు. తమ రాజకీయ భవిష్యత్తు అంధకారమయ్యే పరిస్థితి ఏర్పడిందని.. అందుకు చంద్రబాబే కారణమని లోలోన రగిలిపోతున్నారు.  (చదవండిఅప్రజాస్వామికం)

మండలి రద్దయితే టీడీపీకి తీరనినష్టం

మండలిలో టీడీపీ సభ్యుల సంఖ్య 32 కాగా.. చైర్మన్, డిప్యూటీ చైర్మన్‌లు ఆ పార్టీకి చెందిన వారే. మండలి రద్దయితే ఎక్కువగా నష్టపోయేది టీడీపీనే. మండలిలో ఈ రెండు బిల్లుల్ని అడ్డుకునేందుకు బాబు, లోకేష్, యనమల మంత్రాంగం నడుపుతున్న సమయంలోనే పలువురు టీడీపీ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. బిల్లులను కొద్దిరోజులు అడ్డుకోవడం వల్ల ఒరిగేదేమీ ఉండదని.. కొంత ఆలస్యమైనా ప్రభుత్వం తన నిర్ణయాన్ని అమలు చేస్తుందని చెప్పారు. చట్టవిరుద్ధంగా వ్యవహరించి అప్రదిష్ట మూటగట్టుకోవాల్సి వచ్చిందని పలువురు టీడీపీ ఎమ్మెల్సీలు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. (చదవండివీధిన పడ్డపెద్ద సభ పరువు)

ఈ క్రమంలోనే పార్టీ విప్‌ను ధిక్కరించి పోతుల సునీత, శివనాథరెడ్డిలు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారు. కొందరు యనమల వద్ద  అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే చంద్రబాబు, లోకేశ్‌ రాజకీయాల వల్ల పైకి మాట్లాడలేక పోయారు. రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు తమ భవిష్యత్తును పణంగా పెట్టారని రాయలసీమ ప్రాంతానికి చెందిన ఒక ఎమ్మెల్సీ ఆవేదన వ్యక్తం చేశారు. తాత్కాలిక రాజకీయ అవసరాల కోసం తమ పదవులకు ఎసరు తెచ్చే పరిస్థితి తీసుకొచ్చారని మరికొందరు వాపోతున్నారు. శాసనమండలి రద్దు దిశగా అడుగులు పడుతుండడంతో ఏం చేయాలో తెలియక విలవిల్లాడుతున్నారు.

ఈ పరిస్థితి వస్తుందని చెప్పినా వినలేదు: పీడీఎఫ్‌  
చంద్రబాబు, లోకేశ్‌ తీరు వల్లే శాసన మండలి ఉనికే లేకుండాపోయే పరిస్థితి ఏర్పడిందని పీడీఎఫ్‌ సభ్యులు, పలువురు ఇండిపెండెంట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సలహాలు, సూచనల వరకే పరిమితం కావాలని తాము మొదటి నుంచి టీడీపీ సభ్యులకు చెబుతున్నా స్వప్రయోజనాలు చూసుకున్నారని, వారి స్వార్థానికి అందరూ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని మండిపడుతున్నారు.  టీడీపీ తీరుపై పీడీఎఫ్‌ ఫ్లోర్‌ లీడర్‌ విఠపు బాలసుబ్రహ్మణ్యం మండలిలో అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. బిల్లులు అడ్డుకోవడం సరికాదని స్పష్టం చేశారు. ఆ తర్వాత చైర్మన్‌తో జరిగిన చర్చల్లోనూ.. నిబంధనల ప్రకారం వ్యవహరించి బిల్లులపై ఓటింగ్‌ నిర్వహించాలని కోరారు. (చదవండి:ప్రజలకు మేలు చేయని మండలి అవసరమా?)

చైర్మన్‌తో చంద్రబాబు తప్పు చేయించి అందరినీ బలి చేస్తున్నారని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలికి ఎలాంటి అధికారాలు, విధులు లేవని.. అనవసరంగా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దని స్వతంత్య్ర సభ్యుడు కంతేటి సత్యనారాయణరాజు  టీడీపీకి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. చాన్నాళ్ల అనంతరం వైఎస్‌ హయాంలో మండలిని పునరుద్ధరించుకుంటే.. ఇప్పుడు దాన్ని లేకుండా చేయొద్దని హితవు పలికినా చంద్రబాబు అండ్‌ కో పట్టించుకోలేదు. చంద్రబాబు రాజకీయం వల్ల సొంత పారీ్టకి చెందిన సభ్యులతోపాటు పట్టభద్రులు, ఉపాధ్యాయుల ప్రతినిధులుగా మండలిలో అడుగుపెట్టిన మేధావులకు సైతం నష్టం జరిగే పరిస్థితి ఏర్పడిందని సభ్యులు ఆవేదన వెలిబుచ్చుతున్నారు. (గ్యాలరీలో చంద్రబాబు ఎందుకు కూర్చున్నారు?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement