ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆనం విజయకుమార్‌రెడ్డి
వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వెల్లడి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు జిల్లాలో స్థానిక సంస్థల కోటా కింద జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు తమ పార్టీ అభ్యర్థిగా ఆనం విజయకుమార్‌రెడ్డిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఒంగోలు ఎంపీ, పార్టీ జిల్లా పరిశీలకుడు వైవీ సుబ్బారెడ్డి సోమవారం ఇక్కడ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, పార్టీ జిల్లా నేతలు, స్థానిక సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆనం విజయకుమార్‌రెడ్డిని తమ పార్టీ అభ్యర్థిగా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ ప్రలోభాలు, బెదిరింపుల కారణంగా పార్టీ ఫిరాయించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులంతా తిరిగి పార్టీలోకి రావాలని ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు.
కర్నూలు ఎమ్మెల్సీ స్థానానికి గౌరు వెంకటరెడ్డి నామినేషన్
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి వైఎస్సార్‌సీపీ నేత గౌరు వెంకటరెడ్డి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య, బనగానపల్లె నియోజకవర్గ ఇన్‌చార్జి కాటసాని రామిరెడ్డి, ఆళ్లగడ్డ ఇన్‌చార్జి గంగుల ప్రభాకర్‌రెడ్డి తదితరులతో కలసి రిటర్నింగ్ అధికారికి ఆయన ఒక సెట్ నామినేషన్ పత్రాలను అందచేశారు. అనంతరం గౌరు వెంకటరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లాకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా సీఎం చంద్రబాబు నెరవేర్చలేదని మండిపడ్డారు. టీడీపీ పాలనపై జిల్లా ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని చెప్పారు.