
10వ వార్డులో ప్రచారం చేస్తున్న అనంత వెంకటరామిరెడ్డి, రాగే పరుశురాం, మహాలక్ష్మి శ్రీనివాస్, కోగటం విజయభాస్కర్‌రెడ్డి, తదితరులు
అనంతపురం: తాను పదవిలో ఉన్నా లేకున్నా నగరాభివృద్ధికి కేంద్రం నుంచి అమృత్ స్కీం తీసుకొస్తానని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ అనంతపురం పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఫైర్ అయ్యారు. మంత్రిగా, ఎంపీగా ఉండి 15 ఏళ్లు ఏం సాధించారని ప్రశ్నించారు. సోమవారం నగరంలోని 10వ డివిజన్‌లో ‘రావాలి జగన్ – కావాలి జగన్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అనంత మాట్లాడుతూ జేసీ నాగిరెడ్డి పథకం, యాడికి కెనాల్ నిర్మాణానికి 2005లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పునాది వేశారన్నారు. జేసీ నాగిరెడ్డి పథకానికి రూ.390కోట్లు, యాడికి కెనాల్‌కు రూ.502 కోట్లు ఖర్చు చేశారన్నారు. పునాది వేసిన తర్వాత రెండు పర్యాయాలు కాలపరిమితి దాటిందన్నారు. జేసీ దివాకర్‌రెడ్డి టీడీపీలోకి వెళ్లిన తర్వాత మూడో పర్యాయం కూడా పూర్తవుతోందన్నారు. 15 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్న ఆయన 90 శాతానికిపైగా జరిగిన ఆ పనులనే పూర్తి చేయించలేదుగానీ, పదవిలో లేకపోయినా నగరాన్ని అభివృద్ధి చేస్తారంట అని ఎద్దేవా చేశారు.
తాను ఎంపీగా ఉన్నప్పుడే రాంనగర్ ఫ్‌లై ఓవర్ బ్రిడ్జి తెచ్చామన్నారు. అయితే సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆలస్యమైందన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెడల్పు కుదిస్తూ అంచనాలు మార్పు చేసి దాన్ని పనికిరాకుండా చేశారన్నారు. ఈ బ్రిడ్జిపై వెళ్లేవారికి ఎదురుగా మరో వాహనం వస్తే ఇబ్బందేనన్నారు. అంచనాలు మార్చి వెడల్పు కుదించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని మండిపడ్డారు. సైఫుల్లా బ్రిడ్జి నిర్మాణంలోనూ నిధులు ఆగిపోతే దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి సహకారంతో రూ.3.50కోట్లు మంజూరు చేయించి పూర్తి చేశామని గుర్తు చేశారు. టీటీడీ నుంచి అడ్డంకులు వస్తే తాము మాట్లాడి అనుమతులు తెచ్చామన్నారు. నగరంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటుకు తమ హయాంలోనే ముందడుగు పడిందని, అయితే ఎన్నికలు, ఇతరత్ర కారణాల వల్ల నిలిచిపోయిందని చెప్పారు. అప్పట్లో డీపీఆర్ చేసినా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క అడుగూ ముందుకు పడలేదన్నారు. టీడీపీ ప్రజాప్రతినిధులు నాలుగున్నరేళ్లుగా అమృత్ పథకం అంటూ కథలు చెప్పడం తప్ప చేసిందేమీ లేదన్నారు. నగర పరిధిలో 42 మురికివాడలుంటే ఎంపీ, ఎమ్మెల్యే, మేయర్ ఆవైపు కన్నెత్తి చూడలేదన్నారు. నగర అభివృద్ధి విషయంలో ఎంపీ, ఎమ్మెల్యే, మేయర్ కథలు చెబుతున్నారే తప్ప ఎలాంటి చర్యలూ తీసుకోలేదని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment