సమైక్య సమరం
Published Fri, Feb 7 2014 12:42 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
సాక్షి, గుంటూరు :సమైక్య రాష్ట్రాన్ని కాంక్షిస్తూ, రాష్ట్ర విభజనకు కేంద్రం తీసుకుంటున్న చర్యలను నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా ఉద్యోగుల పోరు మొదలైంది. గురువారం ఉదయం నుంచి ఎన్జీవోలు సమ్మె బాట పట్టారు. పలు ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులు గురువారం విధులకు గైర్హాజరయ్యారు. గుంటూరు, నర్సరావుపేట, తెనాలి, సత్తెనపల్లి, మాచర్ల, బాపట్ల పట్టణాల్లో ఉద్యోగ సంఘ నాయకులు సంఘటితంగా కదిలి ప్రభుత్వ విభాగాల్లో విధులకు హాజరైన మరికొందరు ఉద్యోగులను బయటకు తీసుకొచ్చారు. దీంతో అధిక మొత్తంలో ప్రభుత్వ కార్యాలయాలు మూతపడి ప్రజలకు అందాల్సిన సేవలు నిలిచిపోయాయి. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలోని ఎన్జీవోలు సమ్మెలో పాల్గొనేందుకు నిర్ణయించుకున్నారు. ఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రామిరెడ్డి, ప్రభాకరరావుల సూచనల మేరకు జిల్లాలోని 20 యూనిట్ల ఎన్జీవో సంఘ నాయకులు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ పనిచేసే ఉద్యోగుల్ని సమ్మె బాటన నడి పించేందుకు కృషి చేశారు.
రెవెన్యూ, మున్సిపల్, వైద్య ఆరోగ్యశాఖ, పంచాయతీరాజ్, ట్రెజరీ, వ్యవసాయ, కార్మిక, ఆర్ అండ్ బీ, తదితర 12 ప్రభుత్వ శాఖలకు చెందిన అన్ని కేటగిరీల్లోని ఉద్యోగులూ గురువారం ఉదయం విధులకు హాజరు కాకుండా తమతమ కార్యాలయాల ముందు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. కేంద్రం తెలంగాణ బిల్లును వెనక్కి తీసుకుని రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. తెనాలిలోని ఉద్యోగులందరూ సమైక్యంగా కదిలి ఉద్యమబాట నడిచారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించి కేంద్రం తీరును నిరసించారు. బాపట్ల, మాచర్ల, నర్సరావుపేట, పొన్నూరు, చిలకలూరిపేట, సత్తెనపల్లి, రేపల్లె, వినుకొండ పట్టణాల్లోనూ ఉద్యోగుల నిరసన ప్రదర్శనలు జరిగాయి.
గుంటూరులో... జిల్లా కేంద్రమైన గుంటూరులో ఎన్జీవో సంఘం ఆధ్వర్యంలో సమైక్య సమ్మె మొదలైంది. ఎన్జీవో సంఘ నాయకులు రామిరెడ్డి, ప్రభాకరరావు, దయానందరాజు ప్రభృతులు ఉదయం 10 గంటల నుంచి కార్యాలయాలను మూయించడం మొదలుపెట్టారు. కలెక్టరేట్, జెడ్పీ కార్యాలయాలకు వెళ్లి ఏజేసీ నాగేశ్వరరావు, జెడ్పీ సీఈవో సత్యనారాయణలను కలిసి సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. విజిలెన్సు ఎస్పీ అమ్మిరెడ్డిని కలిసి ఉద్యోగులందరూ సమ్మెలో పాల్గొనేందుకు మద్దతు కోరారు. విధులకు హాజరవుతున్న మహిళా ఉద్యోగులకు సమైక్య సమ్మె ఉద్దేశం వివరించి సమ్మెలో పాల్గొనేలా చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘ నాయకులు పలు కార్యాలయాల్లో సమ్మెకు మద్దతు పలకాలని అధికారులను కోరారు. ‘జై సమైక్యాంధ్ర, జైజై సమైక్యాంధ్ర’ అంటూ నినదించారు. ఆగకుండా హారన్లు మోగించుకుంటూ బైకులపై పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.
Advertisement