
సాక్షి, అమరావతి: వలస కార్మికులను వారి స్వస్థలాలకు చేర్చడంలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం రూ.15.71 కోట్లు విడుదల చేసింది. కరోనా కారణంగా రోజుకు 65 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ ఇప్పుడు కేవలం రెండు లక్షల మందికే సేవలందిస్తోంది. రోజుకు రూ.13 కోట్లకు పైగా ఆదాయం ఆర్జించే పరిస్థితి నుంచి ఇప్పుడు సగటున రూ.1.50 కోట్ల వరకే ఆర్జించే స్థితికి పడిపోయింది. ఈ దశలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను మే నెలకు సంబంధించి కాంట్రాక్టు సిబ్బందికి చెల్లించాల్సిన జీతాలు, పాత బకాయిలు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు జూన్ నెలకు సంబంధించి ఎస్‌ఆర్‌బీఎస్ పెన్షన్, ఎస్‌బీటీ చెల్లింపులు, ఐటీఐ అప్రెంటిస్‌లకు స్టైఫండ్, ఉద్యోగుల వైద్య ఖర్చులు, ఆఫీసు నిర్వహణ, డీజిల్ బిల్లుల చెల్లింపులు తదితరాలకు ఖర్చుచేసింది.
♦ ఆర్టీసీ ఎదుర్కొంటున్న ఆర్థిక గడ్డు పరిస్థితి నేపథ్యంలో ప్రభుత్వం 52 వేల మంది ఉద్యోగులకు జీతాలతో పాటు ఆర్టీసీ సేవలకు నిధులు చెల్లించింది.
♦ వలస కార్మికులను ఇతర రాష్ట్రాలకు, రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు చేర్చడానికి ఆర్టీసీ 8,611 బస్సుల్ని వినియోగించి, మొత్తం 2,45,308 మందిని వారి స్వస్థలాలకు చేర్చింది.