జూన్ 6న ఉ.8.49కి రాజధాని భూమిపూజ..
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని భూమిపూజకు ముహుర్తం ఖరారైంది. జూన్ 6వ తేదీ ఉదయం 8.49 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ తెలిపారు. ఆయన సోమవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ 144 ఏళ్ల తర్వాత వచ్చిన గోదావరి పుష్కరాలను మహా పుష్కరంగా పరిగణిస్తామన్నారు. 198 ఎంట్రీలను పరిశీలించాక పుష్కరాల లోగోను ఆవిష్కరించామని ఆయన తెలిపారు.
ఇకపై అన్ని ప్రభుత్వ ప్రకటనల్లో ఈ లోగోను వాడుతామని పరకాల పేర్కొన్నారు. పుష్కరాలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను సీఎం చంద్రబాబు ఆహ్వానిస్తారని తెలిపారు. 3.5 కోట్లమంది గోదావరి పుష్కరాలకు హాజరవుతారని భావిస్తున్నట్లు పరకాల చెప్పారు. ప్రభుత్వం.. గోదావరి పుష్కరాల కోసం రూ.1471 కోట్లను ఖర్చు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అంతకు ముందు చంద్రబాబు నాయుడు గోదావరి పుష్కరాల లోగోను ఆవిష్కరించారు.