
తిరుపతి నుంచి స్విట్జర్లాండ్‌కు ఎగుమతి అవుతున్న మామిడి పండ్లు
సాక్షి, అమరావతి: లాక్‌డౌన్ సమయంలో కూడా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. ఇందులో భాగంగా తిరుపతి ఏపీ ఆగ్రోస్ ప్యాక్ హౌస్ సంస్థ నుంచి స్విట్జర్లాండ్‌కు 1.2 టన్నుల బంగినపల్లి మామిడి పండ్లను ఎగుమతి చేశారు. రాష్ట్ర ఉద్యానవన శాఖ సహకారంతో రైతులు, వ్యాపారులు కలిసి ఏపీ ఆగ్రోస్ ప్యాక్ సంస్థను ఏర్పాటు చేశారు.
రాష్ట్రంలో పండే వివిధ పండ్లు, కూరగాయలను ఇది విదేశాలకు ఎగుమతి చేస్తుంది. ఏటా 50 లక్షల టన్నులకు పైగా మామిడి దిగుబడి అవుతుండగా అందులో 1000 టన్నుల వరకు అమెరికా, యూరోప్, దక్షిణాసియా దేశాలకు పంపిస్తున్నారు. ముఖ్యంగా బంగినపల్లి, సువర్ణ రేఖ, ఆల్ఫోన్సా వంటి వాటిని ఎగుమతి చేస్తున్నారు. లాక్‌డౌన్ సమయంలో ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోంది అనడానికి ఇది ఒక శుభసూచికమని మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ట్వీట్ చేశారు.