బాలవాడీ సెంటర్లను ఐకేపీ నుంచి అంగన్‌వాడీ సెంటర్లకు అప్పజెప్పాలంటూ సీఐటీయూ అనుబంధ సంస్థ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మహిళలు ఆందోళన నిర్వహించారు.
నినాదాలతో హోరెత్తించిన అంగన్‌వాడీ మహిళలు
కలెక్టరేట్ వద్ద ఆందోళన
కల్లూరు రూరల్, న్యూస్‌లైన్: బాలవాడీ సెంటర్లను ఐకేపీ నుంచి అంగన్‌వాడీ సెంటర్లకు అప్పజెప్పాలంటూ సీఐటీయూ అనుబంధ సంస్థ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మహిళలు ఆందోళన నిర్వహించారు. సుమారు రెండు గంటలపాటు కలెక్టరేట్ మొదటి గేటు ముందు బైఠాయించి నినాదాలతో హోరెత్తించారు. జిల్లావ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన వందలాది అంగన్‌వాడీ మహిళలు సోమవారం కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు.
ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ, ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జి.షేభా, మహి మాట్లాడారు. రకరకాల పనుల ఒత్తిళ్లు, మెమోలు, వేధింపులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వేసవి సెలవులు పెంచాలని, సీని యారిటీ ప్రకారంగా సూపర్‌వైజర్స్ పోస్టు ల్లో నియమించాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం రూ. 12,500కు పెంచాలని, పెండింగ్ వేతనాలతోపాటు టీఏ, డీఏ బిల్లు లు చెల్లించాలన్నారు.
ఇందిరమ్మ అమృత హస్తం బిల్లులు, వీఓఏల నుంచి కాకుండా నేరుగా అంగన్‌వాడీ సెంటర్లకు ఇవ్వాలని, షరతులు లేకుండా అద్దెలు చెల్లించాలని, సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు, స్టౌలు అందించాలని కోరారు. చివరికి ఐసీడీఎస్ పీడీ ముత్యాలమ్మ గేటు వద్దకు వచ్చి అంగన్‌వాడీలను సమాధాన పరిచారు. ఫిబ్రవరి 15వ తేదీలోపు సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో అంగన్‌వాడీ మహిళలు శాంతించారు. కార్యక్రమంలో నిర్మల, అరుణమ్మ, వెంకటలక్ష్మి, కోమల, సీతామహాలక్ష్మి, హేమలత, కాంతమ్మ, వరలక్ష్మి, రేణుక, విజయభారతి, నాగేశ్వరమ్మ, సీఐటీయూ జిల్లా నాయకులు జి.నాగేశ్వరరావు, గౌస్, భాస్కరరెడ్డి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.