క్యాన్సర్‌పై యుద్ధం!  | Another 44 Diseases Are Covered Under The Aarogyasri Scheme | Sakshi
Sakshi News home page

క్యాన్సర్‌పై యుద్ధం! 

Published Sun, Jan 19 2020 10:48 AM | Last Updated on Sun, Jan 19 2020 10:48 AM

Another 44 Diseases Are Covered Under The Aarogyasri Scheme - Sakshi

ఆకివీడు: రాష్ట్రంలో క్యాన్సర్‌ను అదుపు చే సేందుకు ప్రభుత్వం గట్టి చర్యలకు పూనుకుంది. వ్యాధి ముదరకముందే గుర్తించి నివారించే ప్రణాళికలు చేపట్టింది. ప్రాథమిక దశలో గుర్తించని కారణంగా.. క్యాన్సర్‌ వ్యాధి ముదిరి వేలమంది మృత్యువాత పడుతున్నారు. ముందు గుర్తించగలిగితే కొన్ని ప్రాణాలనైనా కాపాడగలమనే ఉద్దేశంతో ప్రభుత్వం క్యాన్సర్‌ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించింది. దీనిలో భాగంగా ఆరోగ్యశ్రీ పథకంలో క్యాన్సర్‌ రోగులకు విస్తృత సేవలందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆరోగ్యశ్రీలో 131 రకాల క్యాన్సర్‌ వ్యాధులకు చికిత్స అందిస్తుండగా మరో 44 రకాల జబ్బులను పథకం పరిధిలోకి తీసుకువచ్చారు.  

విస్తరిస్తున్న వ్యాధి..
జిల్లాలో చాప కింద నీరులా క్యాన్సర్‌ విస్తరిస్తోంది. క్యాన్సర్‌ను ప్రాథమిక దశలో గుర్తిస్తే నివారణ సులభమమని వైద్యులు చెబుతున్నారు. శరీరంలోని కణాలు నియంత్రణ లేకుండా అనారోగ్యంగా పెరిగి కణుతులుగా మారతాయి. శరీరంలో ఇష్టారాజ్యంగా కణుతులు పెరగడమే క్యాన్సర్‌గా చెప్పవచ్చు. సరైన అవగాహన లేకపోవడం, నిర్లక్ష్యం కారణంగా క్యాన్సర్‌ విస్తరిస్తున్నట్టు తెలుస్తోంది. ఈనేపథ్యంలో క్యాన్సర్‌కు పూర్తి వైద్య అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది.

జిల్లాలో 40 వేల మందికి పైగా రోగులు..
జిల్లాలో క్యాన్సర్‌ రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కలుషిత వాతావరణం, ఆహారం, నీటి కాలుష్యం, కల్తీ నూనెలు తదితరాల ద్వారా క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. జిల్లాలో మూడు, నాలుగు స్టేజ్‌లలో ఉన్న క్యాన్సర్‌ రోగుల సంఖ్య 40 వేలకు పైగా ఉంటుందని అంచనా. 1, 2 స్టేజ్‌లలో క్యాన్సర్‌ లక్షణాలు ఉన్న వ్యక్తులకు రోగం బయటపడే అవకాశం తక్కువగా ఉంటుందని వైద్యులు అంటున్నారు. ప్రతిఒక్కరూ క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం ద్వారా జబ్బును గుర్తించి, తగిన మందులు వాడటంతో నివారణ చర్యలు చేపట్టే అవకాశం ఉందని సూచిస్తున్నారు.

ప్రతినెలా పరీక్షా శిబిరం :
కార్పొరేట్‌ ఆసుపత్రులు సామాజిక బాధ్యతగా నెలకో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. వైద్య శిబిరం ఏర్పాటు చేసి స్క్రీనింగ్‌ పరీక్షల ద్వారా క్యాన్సర్‌ వ్యాధిగ్రస్తుల్ని గుర్తించవచ్చని ప్రభుత్వం నిర్ధారించింది. పలు రకాల క్యాన్సర్‌ రోగాల్ని ప్రాథమిక దశలో గుర్తించడం ద్వారా తగిన మందులు వాడటంతో నివారించవచ్చని వైద్యులు పేర్కొనడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

గోదావరి వాసులే అధికం.. 
హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, విశాఖ తదితర ప్రాంతాల్లోని క్యాన్సర్‌ ఆసుపత్రుల వద్ద గోదావరి జిల్లాలకు చెందిన క్యాన్సర్‌ రోగులే అధిక శాతం ఉంటున్నారని వైద్యులు చెబుతున్నారు. జిల్లాలోని ఆకివీడులో ఇటీ వల క్యాన్సర్‌ వ్యాధితో ముగ్గురు వైద్యులు అకాల మృతి చెందడం వ్యాధి విస్తరణకు అద్దం పడుతోంది. మలం, మూత్రంలో రక్తం పడటం వంటి లక్షణాలను గుర్తించి స్క్రీనింగ్‌ పరీక్షలు చేయించడం ద్వా రా వ్యాధిని నిర్ధారించవచ్చు. ప్రధానంగా గొంతు, రక్త, మహిళల్లో సర్వైకల్‌ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్‌ బాధితులు అధిక సంఖ్యలో ఉంటున్నారు. 20 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయసు మధ్య ఉన్న వారిలో 20 నుంచి 30 శాతం క్యాన్సర్‌తో బాధపడుతున్నారని ఎన్‌ ఐపీ సంస్థ గతంలో వెల్లడించింది.   

నాణ్యమైన గింజతోనే ఆరోగ్యం 
నాణ్యమైన, సేంద్రియ, ఆరో గ్యకరమైన ఆహారాన్ని పండించేలా చర్యలు చేపడితే రోగాలు తగ్గుతాయి. క్యాన్సర్‌ వంటి మహమ్మారిని కూడా పారద్రోలవచ్చు. కలుషిత ఆహారం వల్లే క్యాన్సర్‌ విస్తరి స్తోంది. మనిషిలోని కణాలు రోజురోజుకూ మందగించడం వల్లే కణం అదుపు తప్పి క్యాన్సర్‌గా మారుతోంది.
– డాక్టర్‌ పీబీ ప్రతాప్‌కుమార్, సీనియర్‌ వైద్యులు, ఆకివీడు  

ఆరోగ్యశ్రీ వరం 
ఆరోగ్యశ్రీ పథకం క్యాన్సర్‌ రోగులకు వరం. ఈ పథకంలో కొత్తగా 44 రకాల క్యాన్సర్‌ చికిత్సలను చేర్చడంతో మొత్తం 175 క్యాన్సర్‌ జబ్బులకు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందించనుంది. క్యాన్సర్‌ రోగులను ప్రాథమిక దశలో గుర్తించేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించడం అభినందనీయం.  
– కేశిరెడ్డి మురళీ, మండల కన్వీనర్, వైఎస్సార్‌సీపీ, ఆకివీడు 

ప్రాథమికస్థాయిలో కొన్ని గుర్తిస్తున్నాం 
ప్రాథమిక స్థాయిలో కొన్ని క్యాన్సర్‌ వ్యాధుల్ని గుర్తించి, ఉన్నత ఆసుపత్రులకు రిఫర్‌ చేస్తున్నాం. అన్ని క్యాన్సర్‌ వ్యాధుల్ని గుర్తించలేం. స్క్రీనింగ్‌ పరీక్షల ద్వారానే గుర్తించాలి. ప్రతి నెల ఆరుగురు, ఏడుగురు రోగులను ఉన్నత వైద్యానికి రిఫర్‌ చేస్తున్నాం.  
– డాక్టర్‌ భీమవరపు బిలాల్, సీహెచ్‌సీ వైద్యులు, ఆకివీడు  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement