
ఎమ్మెల్యే స్థానంలో పరీక్ష రాసిన అభ్యర్థి - ఆన్సర్ షీట్ పై ఎమ్మెల్యే సంతకం
(పోలవరపు వాసుదేవ)
పెనమలూరుః పెనమలూరు శాసనసభ్యుడు బోడె ప్రసాద్ రాస్తున్న ఇంటర్ వన్ సిట్టింగ్ పరీక్ష వివాదస్పదంగా మారింది. ఆయన సింగపూర్‌లో ఉండగా మరో వ్యక్తి పరీక్షకు హాజరయ్యాడని ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించిన సాక్ష్యాలను విద్యార్థులు కొందరు మీడియాకు అందజేశారు. అయితే స్క్వాడ్,పరీక్షా కేంద్ర నిర్వాహకులు మాత్రం ఆరోపణల్లో నిజంలేదని అన్నారు.
స్థానికుల కథనం ప్రకారం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్(ఎన్ఐఓఎస్) ఇంటర్ వన్ సిట్టింగ్ పరీక్షకు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ గంగూరు మహిళా కాలేజీ ద్వారా ఫీజు చెల్లించారు. పోరంకిలోని తాతినేని గోపయ్య అకాడమీకి చెందిన ఎస్‌కెవీఎస్ జూనియర్ కాలేజీ పరీక్షా కేంద్రంను ఆయనకు కేటాయించారు. ఈ పరీక్షలు గత నెల 27న మొదలయ్యాయి. నవంబర్ పది వరకు జరుగుతాయి.
కాగా ఇప్పటికి జరిగిన మూడు పరీక్షల్లో ఎమ్మెల్యే రెండు పరీక్షలకు హాజరైనట్లు ఉంది. ఒక పరీక్షకు గైర్హాజరయ్యారు. సోమవారం ఫిజిక్స్ పరీక్ష జరిగింది. అయితే ఎమ్మెల్యే బోడె ప్రసాద్ హాల్‌టిక్కెట్‌తో మరో వ్యక్తి పరీక్షకు హాజరయ్యాడని పలువురు మీడియాకు ఉప్పందించారు. వాస్తవానికి ఎమ్మెల్యే ఆదివారం సింగపూర్‌కు వెళ్లారు. మీడియా ప్రతినిధులు పరీక్షా కేంద్రం వద్దకు వెళ్లి అక్కడ ఉన్న స్క్వాడ్ ఎండి.రషీద్‌ను ఈ విషయమై ప్రశ్నించారు. తమకు వచ్చిన సమాచారం మేరకు ఇక్కడికి వచ్చామని వారు తెలిపారు. తాము ఎమ్మెల్యేకు కేటాయించిన గది (4/4) పరిశీలించాలని కోరగా స్క్వాడ్‌తో పాటు కాలేజీ యాజమాన్యం మీడియాను అనుమతించలేదు. దీంతో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పావు గంట తరువాత మీడియాను లోపలకు అనుమతించారు.
పరీక్ష జరుగుతున్న గదిలోకి వెళ్లి చూడగా ఎమ్మెల్యేకు కేటాయించిన హాల్ టిక్కెట్- బి 1614301455 స్ధానంలో ఎవరూ కనిపించలేదు. అయితే పరీక్ష ప్రారంభమై అర గంటకు పైగా గడిచినా రికార్డులో అటెండెన్స్ చూపలేదు. ఈ విషయమై స్క్వాడ్‌ను విలేకరులు ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పలేదు. పరీక్ష రాస్తున్న విద్యార్థులు వివరాలు మీడియాకు చెప్పడానికి భయపడ్డారు.
ఎమ్మెల్యే స్థానంలో మరో వ్యక్తి పరీక్ష రాయటానికి వచ్చి,హడావుడి జరగటంతో తప్పించారని నూతక్కి నాగేశ్వరరావు అనే విద్యార్థి నాయకుడు ఆరోపించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాము పరీక్ష రాసిన వ్యక్తి ఫోటో తీశామని,అలాగే బోడె ప్రసాద్ సంతకం చేసిన ఆన్సర్ షీట్ (నెంబర్ 112782)ఫోటో తీసి మీడియాకు అందచేశారు. ఎమ్మెల్యే అధికార దుర్వినియోగంతో ఈ పని చేశారని,కష్టపడి చదివిన విద్యార్థుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై వెంటనే విచారణ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎవ్వరూ పరీక్ష రాయలేదుః ఈ విషయమై పరీక్షకు స్క్వాడ్‌గా ఉన్న రషీద్‌ను వివరణ కోరగా, ఎమ్మెల్యే స్థానంలో ఎవరూ పరీక్ష రాయలేదని చెప్పారు.
**