మూసీకి మరో ముప్పు | Another threat to the Musée | Sakshi
Sakshi News home page

మూసీకి మరో ముప్పు

Published Wed, Aug 7 2013 1:23 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM

Another threat to the Musée

ఘట్‌కేసర్/భువనగిరి, న్యూస్‌లైన్: హైదరాబాద్ నగరంలోని కాలుష్య కారక కంపెనీలన్నింటినీ ఔటర్ రింగ్‌రోడ్డు ఆవలికి తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయంతో రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని మూసీ ఆయకట్టు ప్రాంత ప్రజలకు ముప్పు వాటిల్లబోతోంది. తీవ్రమైన కాలుష్య కారకమైన కంపెనీలలోంచి వెలువడే వ్యర్థ రసాయనాలు నేరుగా మూసీలోకి పంపించే కుట్ర సాగుతోందని ఇక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీఓ నంబర్ 20 ప్రకారం కాలుష్య, కాలుష్యరహిత కంపెనీలను తొల గించి నగర శివారుల్లోని 48చోట్ల పారిశ్రామికవాడలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
 
 ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లాలోని ఏదులాబాద్, అంకుశాపురం, మాదారం గ్రామాల శివార్లలో 630 ఎకరాల్లో పారిశ్రామికవాడను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు భూ సేకరణ కోసం ఆయా కంపెనీల యజమానులు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ ప్రాంతంలో కంపెనీలు ఏర్పాటైతే వాటి నుంచి విడుదలయ్యే కాలుష్య కారకాలు ఆ ప్రాంతం కంటే పొరుగునే ఉన్న నల్లగొండ జిల్లాలోని మూసీ పరీవాహక మండలాలపై తీవ్ర ప్రభావాన్ని చూపనున్నాయి. ఇప్పటికే మూసీ కాలుష్యంతో ఇబ్బం ది పడుతున్న ఈ ప్రాంత ప్రజలకు కంపెనీల ఏర్పాటు శరాఘాతంగా మారనుంది.
 
 నాలుగు మండలాలపై ప్రధాన ప్రభావం
 మూసీని ఆనుకొని ఉన్న నల్లగొండ జిల్లాలోని బీబీనగర్, భూదాన్‌పోచంపల్లి, వలిగొండ, రామన్నపేట మండలాల్లోని మూసీజలాలు తీవ్రంగా కాలుష్యమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ మండలం పోతురాజుగూడెం వద్ద ఏర్పాటు చేసే ఇండస్ట్రియల్ పార్కునుంచి వెలువడే వ్యర్థ రసాయనాలను మూసీలోకి నేరుగా వదలడంతో మక్తానంతారం మీదుగా పడమటిసోమారం చిన్నచెరువు, వెంకిర్యాల పెద్దచెరువు, మక్తానంతారం కత్వల్లో కాలుష్యం పెరిగే అవకాశం ఉంది. మూసీకి అనుసంధానంగా ఏర్పాటు చేసిన బునాదిగాని, పిల్లాయిపల్లి కాల్వల ద్వారా కూడా రసాయనాలు ప్రజలను నష్టాల పాలు చేసే అవకాశం ఉంది.
 
 సాగుపై మరింత ప్రభావం
 నల్లగొండ జిల్లాలోని మూసీ పరీవాహక ప్రాంతంలో మూసీ నీటితో లక్ష ఎకరాలకు పైగా వరిసాగుతో రైతులకు మేలు జరుగుతోంది. రికార్డుల ప్రకారం 70వేల ఎకరాలు ఉన్నప్పటికీ అనధికారికంగా మరో 50వేల ఎకరాలు సాగవుతుంది. వరిసాగుతో పెరిగిన ఉత్పత్తి వల్ల జరిగే లాభంతో పాటు అంతే స్థాయిలో ఇక్కడి ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోంది. వ్యవసాయం, పాడిపంటలు, మత్స్య పరిశ్రమ, గీత వృత్తి తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఇటీవల భూ సేకరణ కోసం ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించడంతో తమకు నష్టాలు జరుగుతాయని  స్థానికులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు.
 
 ప్రాణాంతకమైన రసాయనాలు
 గతంలో వర్షాకాలం ప్రారంభంతోనే కురిసే వానల కోసం ఎదురుచూసే హైదరాబాద్ పారిశ్రామికవాడల్లోని యజమానులకు ఇక్కడ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేస్తే ఆ పరిస్థితి ఉండదు. నిబంధనల ప్రకారం ఆ కంపెనీల్లో వ్యర్థ రసాయనాలను నిర్వీర్యం చేయాలి. అలా చేయకుండా వర్షాకాలం వచ్చే వరకు ఆ ప్రాణాంతకమైన రసాయనాలను ఆపి వర్షాలు కురవగానే ఆ నీటిలో వ్యర్థరసాయనాలను కలుపుతారు. దీంతో పెద్ద ఎత్తున రసాయనాలు వరద నీటిలో కలిసి నురగలు కక్కుకుంటూ మూసీ వెంట పరుగులు తీస్తాయి. ఈ రసాయనాల్లో పాదరసం, జింక్, హీలియం, కాడ్మియం, క్రోమియం వంటి ప్రాణాంతక రసాయనాలు మూసీలో కలుపుతారు. తాజా ఇండస్ట్రియల్ పార్కు నుంచి వెలువడే కాలుష్య కారకాలు లక్షలాది మందిని దుర్భర పరిస్థితుల్లోకి నెట్టనున్నాయి.
 
 ఆరోగ్యంపై మరింత దుష్ర్పభావం
 మూసీ జలాలతో ఇప్పటికే అవస్థలు పడుతూ వ్యవసాయం చేసుకుంటున్న వారికి తాజా కంపెనీల కాలుష్యం మరణశాసనం రాయబోతోంది. కాలుష్యపు నీటితో పండించే పంటలు, కూరగాయలు, ఆకుకూరలు తినడం ద్వారా ప్రజలు  ఆర్థరైటిస్, గాస్ట్రోఎంటరైటిస్, చర్మవ్యాధులు, మలేరియా కీళ్లనొప్పులు ఇతర వ్యాధులతో బాధపడుతున్నారు.
 
 మళ్లీ ఉద్యమిస్తాం
 మూసీ నదిలో పారే రసాయనాలతో ప్రజలకు ఇప్పటికే తీవ్ర నష్టం వాటిల్లుతోంది. పరిశ్రమలు వదిలే కాలుష్యాల ప్రభావం వల్ల ప్రజలు వివిధ రకాల జబ్బుల బారిన పడుతున్నారు. కాలుష్యాల నివారణ కోసం అనేక ఉద్యమాలు చేశాం. చివరికి కేంద్ర ప్రభుత్వం  పై ఒత్తిడి తీసుకువచ్చి మూసీనదిపై ట్రీట్‌మెంట్ ప్లాంటులు ఏర్పాటు చేయించాం. అయినా ఇంకా కాలుష్యాలు పారుతున్నాయి. ప్రస్తుతం  ఉన్న కాలుష్యాలు చాలవన్నట్లు మండల పరిధిలోని పోతురాజుగూడెంలో రసాయన  పరిశ్రమలు ఇక్కడే ఏర్పాటైతే  ప్రజల జీవితాలు నరకప్రాయంగా మారడం ఖాయం. పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా మళ్లీ ఉద్యమం చేస్తాం.
 - మూసీ శంకర్, మూసీ పరిరక్షణ సమితి  కన్వీనర్, ఏదులాబాద్ సర్పంచ్
 
 అధికారులు కుట్ర పన్నుతున్నారు
 పేద రైతుల నుంచి బలవంతంగా లాక్కున్న మండలంలోని శివారులోని 630 ఎకరాల్లో  రసాయన పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఏపీఐసీసీ అధికారులు కుట్ర పన్నుతున్నారు. రైతులకు చెందిన భూములను తక్కువ రేటుకు ల్యాండ్ మాఫియా  కొనుగోలు చేసింది. తిరిగి వాటిని అధిక ధరలకు ఏపీఐసీసీ అమ్మడానికి  యత్నిస్తున్నారు. వ్యవసాయం చేస్తున్న రైతులు రోడ్డున పడే దుస్థితి దాపురించింది. ఇక్కడి పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతోంది. ఇక్కడ బతుకే దుర్భరంగా మారనుంది. పరిశ్రమల ఏర్పాటుకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకువస్తాం
 - పిట్టల శ్రీశైలం, ముచుకుంద ఫౌండేషన్ కన్వీనర్, ఘట్‌కేసర్ మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement