ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మంగళవారానికి వాయిదా పడ్డాయి.
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మంగళవారానికి వాయిదా పడ్డాయి. ఈరోజు ఉదయం సభ ప్రారంభమైన వెంటనే రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలదీసింది. తమ వాయిదా తీర్మానాలపై చర్చ జరపాలని విపక్షం డిమాండ్ చేసింది. అయితే చర్చకు సిద్ధమన్న ప్రభుత్వం మరో ఫార్మెట్‌లో రావాలని సూచించింది.
తొమ్మిది గంటలకు సభ ప్రారంభమైన వెంటనే విపక్షమిచ్చిన వాయిదా తీర్మానాల్ని తిరస్కరిస్తున్నట్టు స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రకటించారు. చాలా ముఖ్యమైన రైతు సమస్యలపై తాము తీర్మానాలు ఇచ్చామని, వాటిని తిరస్కరించడం భావ్యం కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యులు పోడియంలోకి వచ్చారు. రైతు సమస్యలపై చర్చించాలని నినాదాలు చేశారు.
ఈ క్రమంలో స్పీకర్ సభను పది నిమిషాలు వాయిదా వేశారు. ఆ తర్వాత సభ ప్రారంభం కాగానే స్పీకర్ ప్రశ్నోత్తరాలు కార్యక్రమం చేపట్టారు. ప్రశ్నోత్తరాల తర్వాత టీ బ్రేక్ కోసం సభను పది నిమిషాలు వాయిదా వేశారు. ఆ తర్వాత ప్రారంభమైన సభ గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ చేపట్టింది. గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ధన్యవాద తీర్మానంపై చర్చను ప్రారంభించారు. అనంతరం కూన రవికుమార్ చేసిన వ్యాఖ్యలను వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే తీవ్రంగా ఖండించింది. అనంతరం మాట్లాడేందుకు సమయం ఇవ్వాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. అయితే ఫలితం లేకపోవటంతో ఆయన ప్రభుత్వ తీరును ఎండగట్టారు. అనంతరం స్పీకర్ సమావేశాలను రేపటికి వాయిదా వేశారు.