రాష్ట్రంలో అతి పెద్ద సామాజిక మార్పునకు ఊతమిచ్చే చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇదివరకెన్నడూ లేని రీతిలో స్థానికులకు ఉపాధి కల్పించే కీలక నిర్ణయాలకు నాంది పలికింది. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్ కల్పించడానికి అడుగు ముందుకు వేసింది. అసాధ్యం అనుకున్న పనులను సుసాధ్యం చేస్తూ కొత్త చరిత్ర సృష్టించింది. నిరుద్యోగ యువతకు భవిష్యత్‌పై భరోసా కల్పిస్తూ, మహిళల చిరకాల కోరిక నెరవేరుస్తూ నవ సమాజ నిర్మాణానికి అంకురార్పణ గావించింది. రాష్ట్రంలో పరిశ్రమలు, కర్మాగారాలలో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా, దశల వారీగా మద్య నిషేధం దిశగా మద్య నియంత్రణ చట్టాన్ని సవరించేలా ప్రవేశ పెట్టిన కీలక బిల్లులను బుధవారం సభ్యుల హర్షధ్వానాల నడుమ శాసనసభ ఆమోదించింది. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు రూపొందిన ఈ బిల్లులు నిరుద్యోగులు, మహిళల పాలిట వరం అని ఈ సందర్భంగా పలువురు శాసనసభ్యులు కొనియాడారు. పేదలు, మహిళల జీవితాల్లో కొత్త వెలుగులు నింపిన సంఘ సంస్కర్తగా చరిత్రలో నిలిచిపోతారని ప్రశంసించారు.
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో పరిశ్రమలు, కర్మాగారాలలో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేందుకు ఉద్దేశించిన చరిత్రాత్మక బిల్లును బుధవారం రాష్ట్ర శాసనసభ ఆమోదించింది. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశం మేరకు రూపొందించిన ఈ బిల్లు నిరుద్యోగుల పాలిట వరం అని పలువురు శాసనసభ్యులు అభివర్ణించారు. ఏపీ పరిశ్రమలు, కర్మాగారాలలో స్థానిక అభ్యర్థులకు ఉపాధి బిల్లు–2019ను శాసనసభ సుదీర్ఘంగా చర్చించి ఆమోదం తెలిపింది. దీంతో స్థానికులు పొట్ట చేత పట్టుకుని వలసలు పోవాల్సిన అవసరం ఉండదని శాసనసభ్యులు అభిప్రాయపడ్డారు. ఈ బిల్లుపై చర్చకు ప్రతిపాదిస్తూ రాష్ట్ర కార్మిక, ఉపాధి, కర్మాగారాల శాఖ మంత్రి జి.జయరాం మాట్లాడారు. ‘అందరి తల రాతను బ్రహ్మదేవుడు రాస్తాడని విశ్వసిస్తుంటారు. అందరి సంగతేమో గానీ మా తలరాత రాసింది మాత్రం వైఎస్ జగన్మోహనుడు’ అని అన్నారు. ఎస్సీలకు అంబేడ్కర్‌లా, వాల్మీకులకు వాల్మీకి మహర్షిలా, క్రైస్తవులకు ఏసుక్రీస్తులా, ముస్లింలకు అల్లా లాగా, అందరి దేవుడు షిర్డీ సాయిలాగా సమాజంలోని అన్ని వర్గాలకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దేవుడని అభివర్ణించారు. ఈ సందర్భంగా జగన్ వినమ్రంగా నమస్కరిస్తూ బిల్లుపై మాట్లాడాల్సిందిగా సంజ్ఞలు చేశారు.
బాబు వంచిస్తే.. జగన్ ఆదుకున్నారు
గత ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్యోగం అని చెప్పి అందర్నీ వంచించారని మంత్రి జయరాం అన్నారు. చంద్రబాబుకు, జగన్‌కు.. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. ప్రస్తుత బిల్లు ప్రకారం స్థానిక పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని, ఇదో చారిత్రక నిర్ణయమని వివరించారు. నైపుణ్యం, అర్హత లేదన్న సాకుతో పరిశ్రమల యజమానులు స్థానికులను తిరస్కరించే వీలు లేదని, నైపుణ్యం లేకపోతే శిక్షణ ఇచ్చి ఉద్యోగాల్లోకి తీసుకోవాలన్నారు. మిగతా 25 శాతం ఉద్యోగాలలో యాజమాన్యాలు ఇష్టం వచ్చిన వారిని నియమించుకునే స్వేచ్ఛ ఉంటుందని చెప్పారు. పి.రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా ఇటువంటి బిల్లును తీసుకువచ్చిన చరిత్ర లేదన్నారు. ఈ బిల్లు చట్టమైతే అనేక ప్రాంతాలలో పరిశ్రమలు వస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. నైపుణ్యం లేని వారికి మూడేళ్ల కాలంలో శిక్షణ ఇవ్వొచ్చన్నారు. స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వడం వల్ల పరిశ్రమల యాజమాన్యాలకు చాలా ఖర్చులు తగ్గుతాయన్నారు. మధ్యప్రదేశ్‌లోని పరిశ్రమల్లో స్థానికులకు 70 శాతం ఉద్యోగాలు ఇచ్చే వెసులుబాటు ఉందని, దాన్ని మించి ఆంధ్రప్రదేశ్‌లో అవకాశం కల్పిస్తున్నారని వివరించారు. గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు చేయలేని పనులు నవ యువకుడైన వైఎస్ జగన్ తన 45 రోజుల పాలనలో చేసి చూపారన్నారు. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా మొదలు రాష్ట్ర విభజన నాటి హామీలను అమలు చేయనప్పుడు నోరెత్తని ఆంగ్ల ఛానళ్లు ఇప్పుడు ఈ బిల్లును వివాదాస్పదం చేయాలని చూడడం విడ్డూరంగా ఉందన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకువచ్చిన మేనిఫెస్టో మూడు తరాల భవిష్యత్ అన్నారు.
మహాత్మా గాంధీ కలలు సాకారం
మంగళవారం ఆమోదించిన ఐదు బిల్లులు సామాజికమైనవైతే బుధవారం ప్రతిపాదించిన బిల్లులు చరిత్రాత్మకమైనవని కిలారు రోశయ్య అన్నారు. మహాత్మాగాంధీ కన్న కలలను సాకారం చేసే దిశగా వైఎస్ జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. చంద్రబాబు ఎంతో గొప్పగా చెప్పుకునే అమరావతి ప్రాంత అభివృద్ధి పనుల్లోనూ సుమారు 80 శాతం మంది కార్మికులు ఇతర రాష్ట్రాల వారని, స్థానికులకు ఎటువంటి అవకాశం కల్పించలేదన్నారు. 2016 నుంచి నాలుగేళ్లలో రూ.19,58,000 కోట్ల పెట్టుబడులు, 43 లక్షల ఉద్యోగాలు అని చెప్పి చంద్రబాబు మోసం చేశారన్నారు. వి.వరప్రసాద్ మాట్లాడుతూ ఈ బిల్లుతో ప్రతి నియోజకవర్గంలో ఒక నైపుణ్య అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసే వెసులుబాటు ఉంటుందన్నారు. వలసల్ని నిరోధించవచ్చన్నారు. ఈ బిల్లులోని అంశాలను అమలు చేయని పరిశ్రమల యాజమాన్యాలకు, అధికారులకు కూడా జరిమానాలు విధించేలా ప్రతిపాదనలు ఉండాలని సూచించారు. చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టి ఉండకపోతే పరిశ్రమలు వచ్చి ఉండేవని పలాస ఎమ్మెల్యే అప్పలరాజు దుయ్యబట్టారు. నైపుణ్యం లేదనే సాకుతో ఉద్యోగాలు తిరస్కరించే అవకాశం ఇకపై ఉండదన్నారు. గ్రామీణ యువతకు ఇదో వరమన్నారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బి.మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో విప్లవాత్మక మార్పునకు ఈ బిల్లు శ్రీకారం చుడుతోందన్నారు. పరిశ్రమలకు స్థానికులు భూములు ఇస్తున్నప్పుడు ఉద్యోగాలు వేరే వాళ్లకు ఇస్తామనడంలో అర్థం లేదని, ఇకపై ఈ సమస్య ఉండదన్నారు.
జగన్ పట్టుదలతోనే...
సామాజిక న్యాయం, బడుగు వర్గాలకు సాధికారతకు ఉద్దేశించిన 5 బిల్లులు సభ ఆమోదం పొందేంత వరకు మా అన్న, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నం ముట్టలేదని సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ చెప్పారు. జగన్ పట్టుదలకు, బీసీల పట్ల ఆయనకున్న ప్రేమాభిమానాలకు ఇదే నిదర్శనమన్నారు. మహాత్మాగాంధీ, జ్యోతిరావ్ పూలే, అంబేడ్కర్ ఎలాగో ఇక వైఎస్ జగన్ కూడా తమకు అంతేనని అభివర్ణించారు. ప్రస్తుతం జగనిజం నడుస్తోందన్నారు. ఏపీ రాజకీయ చరిత్ర చెప్పాల్సి వస్తే జగన్‌కు ముందు జగన్‌కు తర్వాత అని చెప్పాల్సి వస్తుందన్నారు. ఏ నాయకునికీ తట్టని ఆలోచనలెన్నో వైఎస్ జగన్‌కు తట్టాయని, అందుకే ఆయన మహనీయుడని అన్నారు.
పారిశ్రామిక విప్లవం
సామాజిక బాధ్యతతో పారిశ్రామిక విప్లవానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే కల్పిస్తూ చేస్తున్న చట్టం రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి దోహదపడుతుంది. ఎందుకంటే పరిశ్రమలకు అవసరమైన రీతిలో యువతకు శిక్షణ ఇచ్చి నిపుణులైన ఉద్యోగులను ప్రభుత్వమే అందిస్తుంది. ఇక పారిశ్రామికీకరణతో కాలుష్యం, ఇతర సమస్యలు ఎదుర్కొంటున్న స్థానికులకు పరిశ్రమల ఏర్పాటు పట్ల సానుకూల ధోరణి పెరుగుతుంది. స్థానికులకే ఉద్యోగాల్లో సింహభాగం దక్కాలన్న నినాదం ప్రపంచ వ్యాప్తంగా బలోపేతమవుతోంది. అదే నినాదంతో అమెరికన్ల మనసు గెలుచుకుని ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యారు. అదే రీతిలో బ్రిటన్ కూడా బ్రెగ్జిట్ పేరిట ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చింది.
– మేకపాటి గౌతంరెడ్డి, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి
యువత భవిష్యత్‌కు ఇక భరోసా
పరిశ్రమల్లోని ఉద్యోగాల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్ కల్పించే చట్టాన్ని తీసుకురావాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. ఇంటికో ఉద్యోగం ఇస్తామంటే నమ్మి టీడీపీకి అధికారం అప్పగిస్తే చంద్రబాబు యువతను మోసం చేశారు. దాంతో యువతలో నిరాశ నిస్పృహలు పెరిగిపోయాయి. ఈ పరిస్థితుల్లో పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పించే చట్టాన్ని తీసుకురావాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం యువతలో కొత్త ఆశలు రేకెత్తించింది. తమ భవిష్యత్ బాగుంటుందన్న భరోసా వారికి కలుగుతోంది. ప్రజలు ఆయన నాయకత్వం కలకాలం ఉండాలని కోరుకుంటున్నారు.
– రాపాక వరప్రసాద్, ఎమ్మెల్యే, రాజోలు
నవ చరిత్రకు శ్రీకారం
Published Thu, Jul 25 2019 4:14 AM | Last Updated on Thu, Jul 25 2019 8:23 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment