బాబు డైరెక్షన్..తమ్ముళ్ల యాక్షన్
అసెంబ్లీలో విపక్షం గొంతు నొక్కిన పాలకపక్షం
హైదరాబాద్: విపక్షం గొంతు నొక్కడమే లక్ష్యంగా రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సాగాయి. ప్రజా సమస్యలను ప్రస్తావించిన ప్రతిసారీ ఏదో విధంగా సభను పక్కదారి పట్టించడమే పనిగా పెట్టుకున్న పాలకపక్షం ప్రజాసమస్యల పరంగా ఐదు రోజుల పాటు సభను తూతూ మంత్రంగా నడిపి మమ అనిపించింది. మంత్రులు, అధికారపక్ష సభ్యుల అనుచిత వ్యాఖ్యలు, కవ్వింపు చర్యలతో ఏ ప్రయోజనమూ నెరవేరకుండానే సమావేశాలు ముగిశాయి. ఆగస్టు 31 ఉదయం ప్రారంభమైన సమావేశాలు శుక్రవారం మధ్యాహ్నానికే ముగిశాయి. విపక్షం గట్టిగా పట్టుబట్టడంతో రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించడం, అరకొరగా దుర్భిక్షంపై చర్చ మినహా ఈ సమావేశాల తో సాధించిందేమీ లేదు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అర్థంపర్థంలేని ఆరోపణలతో సభను పక్కదోవ పట్టిస్తూ అధికార పక్షం కాలం వెళ్లబుచ్చింది. నిమిషానికోసారి జగన్ మైక్ కట్ చేయించి విపక్షనేత చెప్పాలనుకున్న విషయాలను ప్రస్తావనకే రాకుండా చేశారు. పట్టిసీమ, పోలవరం తదితర అంశాలపై జగన్ మాట్లాడటానికి యత్నించినపుడు స్పీకర్ అడ్డుకున్నారు. హడావిడిగా బిల్లులు ప్రవేశపెట్టడంపై నిరసన తెలుపుతూ గురువారం విపక్షం వాకౌట్ చేయగా.. విపక్షం లేనప్పుడే తొమ్మిది బిల్లులకు సభ ఆమోదం తెలిపింది.
విపక్షంపై విషం :తొలిరోజు వైఎస్సార్‌సీపీ ప్రత్యేక హోదాపై వాయిదా తీర్మానం నోటీసు ఇస్తే పాలకపక్షం దొంగాట ఆడి, ప్రభుత్వమే తీర్మానం పెట్టనుందని ప్రకటించి సరిపెట్టింది. విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి మాట్లాడే అవకాశమే లేకుండా చేసింది. చంద్రబాబు నాయుడు దర్శకత్వంలో చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు, మంత్రి అచ్చన్నాయుడు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తదితరులు ఎప్పటికప్పుడు విపక్షం గొంతు నొక్కడంలో కీలకపాత్ర పోషించారు. విపక్షనేత సభలో ఉండరని రూఢీగా తెలిసిన మూడో రోజున గోదావరి నదీ జలాలను వినియోగించుకోవడం, పట్టిసీమ ప్రాజెక్టుపై స్వల్ప కాలిక చర్చంటూ మొదలు పెట్టి విపక్షంపై విషం చిమ్మారు. మంత్రుల పని తీరుకు సీఎం తనయుడు మార్కులేస్తున్నారనే ప్రచారం నేపథ్యంలో అచ్చన్నాయుడు రెచ్చిపోయారు. నోటికొచ్చినట్టు మాట్లాడుతూ సభను పక్కదోవ పట్టించారు. చివరిరోజు శుక్రవారం.. ‘ఓటుకు కోట్లు’ కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమేయంపై చర్చించాలని విపక్షం వాయిదా తీర్మానం ఇస్తే.. విపక్ష నేత జగన్‌కు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఫోన్ చేసి ఈ తీర్మానం ఇప్పించారని అచ్చన్నాయుడు ఆరోపించి సభ జరక్కుండా చేశారు.
9 బిల్లులు.. 2 తీర్మానాలు : ఐదు రోజుల అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో 20 గంటల 29 నిమిషాల పాటు సభ నడిచింది. 50 లిఖిత పూర్వక ప్రశ్నలకు జవాబులు వచ్చాయి. ఆరు స్వల్ప కాలిక ప్రశ్నలకు, 344 నిబంధన కింద ఒక ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. సభలో ప్రవేశపెట్టిన 9 బిల్లులు పాస్ అయ్యాయి. రెండు తీర్మానాలను సభ ఆమోదించింది. రెండింటిపై స్వల్ప వ్యవధి చర్చ జరిగింది. మంత్రి ఒక ప్రకటన చేశారు.